నవ్వులు పూయిస్తున్న ‘ఎఫ్‌2’ మేకింగ్‌..
                             

‘భార్యల్ని గ్రిప్పులో పెట్టుకోవడం ఒక ఆర్టు’’ అని గంటల కొద్దీ లెక్చర్లు దంచిన ఓ ఇద్దరు మగధీరులు.. పెళ్లి తర్వాత వారి పెళ్లాల చేతిలోనే మిక్చర్‌లా నలిగిపోయారు. దెబ్బకు జీవిత సత్యం తెలుసుకొని.. పెళ్లయితే ఎంతటి మగాడి జీవితమైనా ఇంతేనంటూ సమాజానికి హితబోధ చేయడం మొదలుపెట్టారు. మరి వారిద్దరి కథ ఏంటి? పెళ్లాల చేతిలో వారు పడిన పాట్లేంటి తెలియాలంటే ‘ఎఫ్‌ 2’ చూడాల్సిందే. ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌.. అనేది ఉపశీర్షిక. వెంకటేష్‌ - వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. వీరిద్దరికీ జోడీగా తమన్నా, మెహరీన్‌లు నటిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్, వెంకీ, వరుణ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు చూస్తుంటే థియేటర్లో కడుపుబ్బా నవ్వులు ఖాయమనిపిస్తోంది. అసలే వినోదాత్మక కథలను వండి వార్చడంలో సిద్ధహస్తుడు అనిల్‌. ఇతనికి తోడు కామెడీలో తిరుగులేని టైమింగ్‌ ఉన్న వెంకీ, రాజేంద్రుడు ఉన్నారు. వీరితో పాటు వరుణ్, మెహరీన్, తమన్నా, వెన్నెల కిషోర్‌ వంటి యువ బృందం సందడి సరేసరి. అందుకే ఇంతమంది కలిశారు కాబట్టే థియేటర్లలో నవ్వులు పువ్వులు విరబూస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. మరి మీరేమంటారు అంతేగా.. మరంతేగా!!.© Sitara 2018.
Powered by WinRace Technologies.