వినోదం.. సందేశం.. ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’

చేతన్‌ మద్దినేనిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ నరేష్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’. విద్య 100% బుద్ధి 0%.. అన్నది ఉపశీర్షిక. డాల్ఫిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మంజునాథ్‌ వి.కందుకూర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర లోగో, టీజర్‌ను ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ - దర్శకుడు మారుతి సంయుక్తంగా విడుదల చేశారు. 2015లో కన్నడ నాట సంచలన విజయం అందుకున్న ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’ చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. చదువులో ఫస్ట్‌ ర్యాంక్‌తో ఉన్న యువకుడు తన మంద బుద్ధి కారణంగా ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నాడు అన్న అంశాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా చూపించారు. ఈ చిత్రంతో కార్పొరేట్‌ విద్యా విధానం వల్ల పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను సందేశాత్మకంగా వివరించబోతున్నారు. టీజర్‌ను బట్టీ చూస్తుంటే మూల కథను ఏమాత్రం మార్చకుండా యథావిథిగా తెలుగులోకి తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇది కన్నడలో నేను చేసిన తొలి చిత్రం. అక్కడ మంచి విజయాన్ని అందుకొంది. కన్నడలో ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులతో చూసిన చిత్రమిది. విద్యే కాదు.. బుద్ధి కూడా ఉండాలని చెప్పే సినిమా. ఇందులోని వినోదం.. సందేశం ఆకట్టుకుంటాయి. కన్నడ వాసులకు నచ్చినట్లే తెలుగు ప్రేక్షకులూ ఈ సినిమాను ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఇందులో బ్రహ్మానందం, ప్రకాశ్‌ రాజ్, నరేష్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.