ఇలాంటి మంచోణ్ని చూశారా..

‘మా మనవడు శివ మంచోళ్లకే మంచి వాడు. నా కొడుకు ఆచార్య చాలా మంచివాడు. మా అల్లుడు బాలు చాలా మంచివాడు. నా తమ్ముడు సూర్య ఎంత మంచోడో. నా అన్నయ్య రిషి చాలా మంచోడు. నా లవర్‌ బాలు చాలా మంచివాడు’.. ఇంతమంది మంచి వాడు అనేది ఇంకెవరినో కాదు యువ కథానాయకుడు కల్యాణ్‌ రామ్‌ని. వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘ఎంతమంచివాడవురా’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. కల్యాణ్‌ రామ్‌ మంచోడంటూ ప్రారంభమయ్యే ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. ‘అందరూ మంచోడు మంచోడు అంటున్నారు. మరి ఇలా కొడుతున్నావేంట్రా?’ అని నటుడు టీఎన్‌ఆర్‌ అడగ్గా.. రాముడు కూడా మంచోడేరా కానీ రావణాసురుణ్ని చంపలా? అని సమాధానమిస్తాడు. దీన్ని బట్టి చూస్తే అన్యాయం చేసేవారిని చంపినా తప్పులేదనే రీతిలో కథానాయకుడి పాత్ర ఉంటుందేమో. గత చిత్రాల మాదిరి ఈ చిత్రంలోనూ పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు సతీష్‌. మళ్లీ ఎప్పుడొస్తావ్‌ నాన్న అని తనికెళ్ల భరణి అడిగితే సంక్రాంతికి వస్తున్నానని చెప్పకనే చెప్పాడు కల్యాణ్‌ రామ్‌. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పిస్తున్నారు. మెహరీన్‌ కౌర్‌ కథానాయిక. సంగీతం గోపీసుందర్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.