వామ్మో.. ఈ ‘ఖైదీ’ మామూలోడు కాదు!!

మొత్తం 62 రాత్రులు.. చిత్రీకరణ మొత్తం నిశిరాత్రుల్లోనే. ఎందుకిలా? అంటే.. ఈ కథ ప్రకారం హీరో ఓ ఖైదీ. రాత్రిపూట జైలు నుంచి తన బృందంతో బయట పడేందుకు ఓ పన్నాగం వేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? పోలీసులు కళ్లుగప్పి తప్పించుకోగలిగాడా? లేదా? అన్నది తెలియాలంటే ‘ఖైదీ’ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. కార్తి కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది. ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో యువ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం చూస్తుంటే ఇదొక డ్రగ్‌ మాఫియా నేపథ్యంతో అల్లుకున్న కథలా అనిపిస్తోంది. ట్రైలర్‌ ఆద్యంతం పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఘట్టాలతో నింపేశారు. కార్తీ జైలు నుంచి తప్పించుకోవడం.. మరోవైపు మాఫియా గ్యాంగ్‌ అతన్ని వెంటాడుతుండటం, అదే సమయంలో ఇటు పోలీసులతోను తలపడుతూ కనిపించడం ఇలా కార్తి ఫుల్ యాక్షన్‌ మోడ్‌లోనే దర్శనమిచ్చాడు. ఇదొక స్ర్కీన్‌ప్లే బేస్డ్‌ స్టోరీ. కథానాయిక పాత్రకు అవకాశం లేదు. పాటలు కూడా అసలు వినిపించవు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.