‘మిస్టర్‌ కె.కె’ అదరగొడుతున్నాడుగా..


‘శి
వపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘ఐ’, వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలతో తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు చియాన్‌ విక్రమ్‌. కొన్నాళ్లుగా సరైన హిట్‌ లేక సతమతమవుతున్న ఆయన.. ఇప్పుడు ‘మిస్టర్‌ కె.కె’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకోవాలనే కసితో వస్తున్నారు. తమిళ ‘కడరం కొండాన్‌’కు తెలుగు అనువాదమిది. రాజేశ్‌ సెల్వా దర్శకత్వం వహించారు. రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థపై కమల్‌హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జులై 19న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా చిత్ర మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. దీన్ని పూర్తిగా యాక్షన్‌ సన్నివేశాలతోనే నింపేశారు. ఈ వీడియోలో విక్రమ్‌ స్టైలిష్‌ లుక్స్‌, ఆయన చేసిన ఛేజింగ్‌ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో విక్రమ్‌ కేకే అనే ఓ పవర్‌ఫుల్‌ కమాండో ఆఫీసర్‌గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అక్షర హాసన్‌ - అబీ హస్సన్‌ భార్యాభర్తలుగా నలిస్తున్నారు. కేకే పేరుతో విక్రమ్‌ అందరికీ ఫోన్లు చేసి వారిని చంపేస్తుంటాడు. ఈ క్రమంలోనే అతని నుంచి అక్షర దంపతులకు అనుకోని ఆపద ఎదురవుతుంది. మరి ఓ కమాండో ఆఫీసరైన విక్రమ్‌ అందరినీ ఎందుకలా బెదిరిస్తుంటాడు? ఎందుకు హంతుకుడిగా మారాతాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.