దుమ్ములేపుతున్న ‘సాహో’ టీజర్‌

‘బాహుబలి2’ వంటి భారీ హిట్‌ తర్వాత ప్రభాస్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘సాహో’. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో యువి క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘‘బాధైనా హ్యాపీనెస్‌ అయినా నాతో షేర్‌ చేసుకోవడానికి ఎవ్వరూ లేరు’’ అంటూ కథానాయిక శ్రద్ధా కపూర్‌ చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. దీనికి ప్రభాస్‌.. శ్రద్ధను కౌగిలించుకోని ‘నేనున్నాను’ అని చెప్పడం ఆకట్టుకుంటోంది. యాక్షన్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి. ఛేజింగ్ సన్నివేశాలు భారతీయ వెండితెరపై మునుపెన్నడూ చూడని రీతిలో ఉన్నాయి. ప్రభాస్‌, శ్రద్ధాల లుక్స్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. చివర్లో దుండగుల నుంచి ప్రభాస్‌, శ్రద్ధ తప్పించుకుని ఓ చోట దాక్కుంటారు. అప్పుడు శ్రద్ధ ‘ఎవరు వీళ్లు’ అని ప్రభాస్‌ను అడుగుతారు. దానికి ప్రభాస్‌.. ‘ఫ్యాన్స్‌’ అని సమాధానమిస్తారు. ఆ తర్వాత శ్రద్ధ.. ‘ఇంత వైలెంట్‌గా ఉన్నారు..’ అని అడగ్గా.. ‘డై హార్డ్‌ ఫ్యాన్స్‌’ అని ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. ఆగస్టు 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.