అదరగొడుతున్న సూర్య.. ‘బందోబస్త్‌’ టీజర్‌


మిళ స్టార్‌ హీరో సూర్య వరుస చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఇటీవలే ‘ఎన్జీకే’గా సినీప్రియుల్ని మురిపించిన సూర్య.. ఇప్పుడు ‘కాప్పన్‌’గా సందడి చేసేందుకు ముస్తాబవుతున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘బందోబస్త్‌’ పేరుతో విడుదల కాబోతుంది. ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్‌’ వంటి హిట్ల తర్వాత దర్శకుడు కేవీ ఆనంద్‌ - సూర్యల కలయికలో వస్తోన్న మూడో చిత్రమిది. మోహన్‌లాల్‌, ఆర్య, బొమన్‌ ఇరానీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్ర తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను బట్టీ చూస్తుంటే ఇదొక స్పై థ్రిల్లర్‌ మూవీగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సూర్య ఓ భయంకర తీవ్రవాదిలా కనిపిస్తూనే.. దేశ రక్షణకు సాయపడే సీక్రెట్‌ పోలీస్‌ కమాండో పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రకు తగ్గట్లుగానే టీజర్‌లో ఆయన విభిన్నమైన గెటప్పుల్లో దర్శనమిచ్చారు. తీవ్రవాదిగా, నాగలి పట్టి పొలం దున్నే రైతుగా, గోవుల్ని కాసే వ్యక్తిగా ఇలా రకరకాల పాత్రల్లో ఆకట్టుకునేలా కనిపించారు. మోహన్‌లాల్‌ దేశ ప్రధానమంత్రిగా కనిపించగా.. బొమన్‌ ఇరానీ తన స్వార్థం కోసం దేశాన్ని దెబ్బకొట్టే బిజినెస్‌మ్యాన్‌గా నటిస్తున్నారు. ఇక సయేశా ఆర్య ప్రేమికురాలిగా, సూర్యని వెంటాడే పోలీస్‌గా దర్శనమిచ్చింది. ‘‘మీరు రెచ్చగొట్టింది ప్రశాంతంగా నిద్రపోతున్న పులిని. అది పంజా విసరడానికి ఎంతో సమయం పట్టదు’’ అంటూ సూర్యను ఉద్దేశించి మోహన్‌లాల్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. ‘‘పోరాడటం తప్పంటే.. పోరాడే పరిస్థితిని ఏర్పరచడం కూడా తప్పేగా’’ అంటూ చివర్లో సూర్య తన పై అధికారి నాగినీడును ప్రశ్నించగా.. ‘‘మీరే నక్సల్‌లా మాట్లాడుతున్నారు’’ అని ఆయన తిరిగి ప్రశ్నిచడం హైలైట్‌గా నిలిచింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.