నేను సింబా.. ముఫాసా కొడుకుని

ప్రఖ్యాత డిస్నీ సంస్థ నుంచి టూడీ యానిమేటెడ్‌ సినిమాగా 1994లో విడుదలైంది ‘లయన్‌ కింగ్‌’. ఆ చిత్రం తాజాగా త్రీడీ యానిమేటెడ్‌ సాంకేతికతతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ సొబగులద్దుకొని సరికొత్తగా ముస్తాబైంది. జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఫాసా అనే సింహం, సింహం పిల్ల సింబ, ముంగిస టిమోన్‌, అడవి పంది పుంబా చుట్టూ సాగే కథ ఇది. ఈ చిత్ర తెలుగు వెర్షన్‌ కోసం ముసాఫా కొడుకైన సింబా పాత్రకు నేచురల్‌ స్టార్‌ నాని డబ్బింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన తన పాత్రకు సంబంధించిన వాయిస్‌ ఓవర్‌ను పూర్తి చేశారు. తాజాగా సింబాగా తన పాత్ర టీజర్‌ను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు నాని. దీనికి ‘‘నేను సింబా.. ముఫాసా కొడుకుని’’ అని ఓ వ్యాఖ్యను కూడా జోడించారు. ‘‘మా నాన్న ఒకసారి చెప్పారు. సూర్య కిరణాలు పడే చోటంతా రక్షించాలని’’ అంటూ నాని డబ్బింగ్‌ చెప్తున్న దృశ్యాలతో టీజర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత అడవి రాజు ముఫాసా తన వారసుడు సింబా అని అడవిలోని జంతువులకు పరిచయం చేయడం, అనంతరం ‘‘నేను సింబా, ముఫాసా కొడుకుని’’ అని చెప్పడంతో టీజర్‌ ముగిసింది. ఇక ఈ చిత్రంలో మిగిలిన పాత్రలకు రవిశంకర్‌, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందం తదితరులు వాయిస్‌ ఓవర్‌ అందించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.