ఎమ్.ఎ.వి.సేలం వారు ‘సంపూర్ణ రామాయణం’ తమిళంలో తీశారు. ఎన్.టి.ఆర్. రాముడు. ఆయనకి తమిళం రాదు గనుక, ఎవరో డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమాను తెలుగులోకి అనువదించినప్పుడు కూడా కంఠం ఆయనది కాదు. ఎవరో మాట్లాడారు. కానీ దశరథుడి పాత్ర ధరించిన నాగయ్య మాత్రం తనే తెలుగులో డబ్బింగ్ చెప్పారు. అలా చెప్పడం ఆయనకి ఇబ్బందయింది. ‘ఇంకెన్నడూ ఈ పనికి రాకూడదు’ అనుకున్నారు. తరువాత ఆయన తమిళంలో వేసిన సినిమాలు ఎన్నో తెలుగులోకి అనువాదం అయ్యాయి. కానీ తెలుగులో కంఠం ఆయనది కాదు. అంతేకాదు తెలుగు సినిమాల్లో కూడా అవుట్ డోర్ దృశ్యాల్లో నటించవలసి వచ్చినప్పుడు- డైలాగ్ రికార్డింగ్ సరిగ్గా ఉండదు గనుక, డబ్ చెయ్యాలి. అది కూడా ఆయనకు ఇబ్బందిగానే ఉండేది. ‘ఆ రోజుల్లో రెండూ ఒకే చోట గనుక ఇబ్బంది ఉండనే ఉండదు. ఎప్పుడో యాక్ట్ చేసి ఇప్పుడు దాని మీద డైలాగ్ చెప్పడమంటే నా వరకు నాకు ఇబ్బందిగానే ఉంటుంది’ చెప్పారు నాగయ్య.

- రావి కొండలరావు