కల్పన పురాణం... కాసుల పంట!

కుబేరా పేరు మీద ఘంటసాల బలరామయ్య భారీ ఎత్తున ‘మైరావణ’ (1940) పౌరాణిక చిత్రం తీశారు. అసలు, మైరావణుడు (మహిరావణుడు) అనే పాత్ర భారత రామయాణాల్లోగాని, అష్ణాదశ పురాణాల్లోగాని కనిపించలేదు. శుద్ధకల్పన. ఎప్పుడో ఒక నాటకరచయిత కల్పించి రాస్తే ప్రేక్షకులు మెచ్చుకున్నారు. మైరావణుడికి ఎలాంటి వరాలున్నాయంటే, యుద్ధంలో అతని రక్తం బొట్టు నేలమీద చిందితే, ఆ మేర ఎన్ని ఇసుక రేణువులన్నాయో, అంతమంది మైరావణులు పుడతారు! శ్రీరాముడిని మైరావణుడు బంధిస్తాడు. అక్కడ చంద్రసేన అనే యువతి, శ్రీరాముడిని చూసి మోహిస్తుంది. ఇలా ఉంటుంది కథ. కాంచనలమాల చంద్రసేన. శ్రీరాముడి పాత్రని టి.రామకృష్ణ శాస్త్రి ధరించారు. వేమూరు గగ్గయ్య మైరావణుడు, రామిరెడ్డి రావణుడు. కథ మాటలకేంగాని, ‘మైరావణ’ సినిమా పెద్ద హిట్టయింది. కారణం భారీతనం. కళాదర్శకుడు టి.వి.ఎస్‌.శర్మ అద్భుతమైన సెట్స్‌ వేశారు. పాత్రలకి రూపకల్పన చేశారు. మైరావణుడు, పాతాళలోకంలో ఉంటాడు. వాడి రాజ్యంలోని ప్రతి వస్తువూ శంఖాల రూపంలో ఉండేలా శర్మ సెట్లు వేశారు. మేకప్‌మేన్‌ మంగయ్య పాత్రలకి రూపురేఖలు దిద్దాడు ‘‘సినిమా మాట ఎలా ఉన్నా కళాదర్శకుడు మేకప్‌మేన్‌ల పనితనం వల్లనే సినిమా అంగ గొప్పగా హిట్టయింది’’ అని ఆ రోజుల్లో సినిమా పండితులు విశ్లేషించారు.

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.