ఒకే పాటలో 20 మంది తారలు

ఒక హీరో సినిమాలో మరొక హీరో కనిపిస్తే ప్రేక్షకులకు పండగే. ప్రత్యేక పాత్రలో నిమిషం కనిపించినా అభిమానులకు అదో ఆనందం. ఇలాంటి కాంబినేషన్‌ అన్ని సమయాల్లో కుదరదు. అందుకే అడపాదడపా మాత్రమే ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. అయితే మల్టీస్టారర్‌ చిత్రాలు టాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. ఆ రోజుల్లోనే ఎంతో మంది అగ్ర కథానాయకులు ఒకే సినిమాలో కలిసి నటించారు. కేవలం సన్నివేశాల్లోనే కాకుండా పాటల్లోనూ స్పెషల్‌ అప్పీరియన్స్‌ ఇచ్చారు. ఒక పాటలో ఒకరిద్దరు అంతకన్నా ఎక్కువ నటులు మెరవడం ఇప్పుడు మామూలే అయినా 90ల్లో ఇదొక సంచలనమే చెప్పాలి. ఎందుకంటే ఒక పాటలో ఏకంగా 20మంది నాటి అగ్రతారలు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు కాబట్టి. ఇంతకీ అదేం పాటంటే.. వెంకటేష్‌, అర్జున్‌,రాజేంద్ర ప్రసాద్‌ కాంబినేషన్‌లో దర్శకుడు మురళీ మోహన్‌ రావు తెరకెక్కించిన చిత్రం ‘త్రిమూర్తులు’. 1981లో వచ్చిన ‘నజీబ్‌’ అనే హిందీ చిత్రానికి రీమేక్‌ ఇది. బప్పీ లహరి సంగీతం అందించిన ఈ చిత్రంలోని వేడుక నేపథ్యంలో వచ్చే ఓ పాటలో శోభన్‌ బాబు,చిరంజీవి,బాలకృష్ణ,కృష్ణంరాజు,నాగార్జున,దర్శకుడు కోదండ రామిరెడ్డి,కోడి రామకృష్ణ,శారద,విజయ నిర్మల,విజయ శాంతి,రాధ,జయమాలిని,పరుచూరి బ్రదర్స్,మురళీ మోహన్,గొల్లపూడి మారుతి దర్శనమిచ్చారు. అప్పట్లోనే కాదు ఇప్పటికీ ఎప్పటికీ చిత్ర పరిశ్రమలో ఇదొక రికార్డే.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.