అలా ఊహించుకొని చేస్తాను...
‘‘ఒక మంచి సినిమాలో భాగం కావాలనే ‘యు టర్న్‌’లో నటించా. కథ విషయంలో మేం ఏదైతే అనుకొన్నామో, ప్రేక్షకులు కూడా సినిమా చూసి అదే అనుభూతికి గురయ్యారు. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఆది పినిశెట్టి. ఆయన ఓ కీలకపాత్రలో నటించిన ‘యు టర్న్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సమంత ముఖ్యభూమిక పోషించిన ఈ చిత్రానికి పవన్‌కుమార్‌ దర్శకుడు. చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా ఆది పినిశెట్టి శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఆ విషయాలివీ...మన తప్పు మనకే ముప్పు..
‘‘నటుడిగానే కాకుండా... వ్యక్తిగతంగా కూడా నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో ‘యు టర్న్‌’ ఒకటి. ఒక చిన్న అంశంతో ఎంత ఆసక్తికరంగా సినిమా తీయొచ్చో పవన్‌ చూపించారు. మనం చేసిన తప్పు మనకే ముప్పుగా ఎలా మారుతుందనే విషయాన్ని ఈ చిత్రంలో దర్శకుడు చూపించిన విధానం చాలా బాగుంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు రెడ్‌ సిగ్నల్‌ పడినా అటు, ఇటూ చూసి ఎవ్వరూ రావడం లేదు కదా అని నేనూ తప్పులు చేశాను. కానీ ఈ సినిమా చూశాక రోడ్డుపై ఎవరున్నా లేకపోయినా సిగ్నల్‌ పడేంతవరకు వెళ్లకూడదని నిర్ణయించుకొన్నా. ఆ కోణంలో నాలాగా కొంతమందిలోనైనా ఈ సినిమా మార్పు తెస్తుంది. ఆ సందేశాన్ని కూడా అంతర్లీనంగా కథలో చెప్పడం ప్రేక్షకులకు బాగా నచ్చింది’’.

ఆమెతో కలిసి నటించడం గొప్ప అనుభవం..
‘‘పోలీసు పాత్రల్లో నటించమని ‘వైశాలి’ తర్వాత కూడా నాకు చాలా అవకాశాలొచ్చాయి. కానీ ఎప్పుడూ తెరపై కనిపించే పోలీసులాగా నటించడం నాకు రాదు. ‘యు టర్న్‌’లో ప్రదీప్‌ నాయక్‌ చాలా సాధారణంగా కనిపిస్తాడు. అసలు ఈ పాత్రకి ప్రత్యేకంగా పరిచయ సన్నివేశం అంటూ ఉండదు. అదే నాకు బాగా నచ్చిన విషయం. ఏ సినిమా చేసేటప్పుడైనా ఆ కథ, సన్నివేశాల్ని, పాత్రల్ని ఊహించుకుంటూ నటిస్తాం. థ్రిల్లర్‌ కథల్లో నటిస్తున్నప్పుడు ఆ ఊహలకు మరింత పదును పెట్టాల్సి ఉంటుంది. పవన్‌కుమార్‌ భవిష్యత్‌తరం దర్శకుడు. అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి ఆయన ఆలోచనలు. సమంతతో కలిసి నటించడం మంచి అనుభవం. రామ్‌చరణ్, నాని, సమంత... ఇలా వీళ్లందరితో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుంది’’.

ప్రేక్షకుల ఆలోచన మారింది..
‘‘మా తప్పొప్పుల్ని ఎత్తి చూపేవాళ్లు ఎంతమంది ఉంటారు? నన్ను నేను సరిదిద్దుకొనే అవకాశం విమర్శకుల నుంచే వస్తుంది. అందుకే సమీక్షల్ని పరిశీలించి నేనెక్కడ తప్పు చేస్తున్నానో గమనించి సరిదిద్దుకుంటా. ప్రస్తుతానికి మంచోడిలా ఉందామనుకుంటున్నా! ప్రతినాయక పాత్రల గురించి ఆలోచించడం లేదు. ఎప్పుడైనా మరీ మంచితనం ఎక్కువై, చెడ్డోడిలా మారదాం అనిపించొచ్చు. అలాంటి సమయంలోనే ఓ మంచి స్క్రిప్టు నా దగ్గరికొస్తే చేస్తానేమో. ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా విధానంలో ఎంతో పరిణతి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కథల్ని జాగ్రత్తగా ఎంచుకొని అడుగులు వేస్తున్నా. తదుపరి కథానాయకుడిగా నటించే సినిమాలు వాణిజ్య ప్రధానంగా సాగుతాయి. తమిళంలో ‘ఆర్‌.ఎక్స్‌.100’ రీమేక్‌లో నటించబోతున్నా. అలాగే తెలుగు, తమిళ భాషల్లో బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నా’’.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.