అన్న మాట్లాడుతుంటే.. అమ్మ.. నేను చాలా బాధపడ్డాం!
‘దొరసాని’ సినిమా చూసిన తర్వాత తన సోదరుడు, హీరో విజయ్‌ దేవరకొండ గర్వపడ్డాడని ఆనంద్‌ దేవరకొండ తెలిపారు. ఆయన కథానాయకుడిగా పరిచయం కాబోతున్న సినిమా ‘దొరసాని’. ఇదే సినిమాతో నటుడు రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక కథానాయికగా అరంగేట్రం చేస్తున్నారు. కేవీఆర్‌ మహేంద్ర దర్శకుడు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తోంది. ఈ నెల 12న సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆనంద్‌ మీడియాతో మాట్లాడారు. తన సినీ కెరీర్‌ ఎలా ప్రారంభమైందో ముచ్చటించారు.


హీరోగా నేనా?.. అని నవ్వుకున్నా
‘అన్న ‘అర్జున్‌ రెడ్డి’ వచ్చిన తర్వాత కొంతమంది నాన్నకు ఫోన్‌ చేసి మీ పెద్ద కుమారుడి డేట్స్‌ దొరకడం లేదు. చిన్న కుమారుడి డేట్స్‌ ఇస్తారా? అని అడిగారు. ఇది తెలిసి.. నేను హీరోగానా? అని నవ్వుకున్నా, సీరియస్‌గా తీసుకోలేదు. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అన్న ప్రొడక్షన్ హౌస్‌, దుస్తుల బ్రాండ్‌ అభివృద్ధికి సహాయం చేద్దామని గత ఏడాది భారత్‌కు వచ్చా. అమెరికాలో ఉద్యోగం వదిలేశా. అక్కడ పనిచేయడం వల్ల నాకు వ్యాపారంపై కాస్త పట్టు వచ్చింది’.

ఆ భయం ఉండేది
‘2012లో నేను థియేటర్‌లో చేశా. వర్క్‌షాప్‌లలో పాల్గొన్నా. కానీ కెమెరా ముందుకు ఎప్పుడూ రాలేదు. నటించగలనా? లేదా? అనే భయం ఉండేది. మహేంద్ర నాకు ఐదు గంటలపాటు ‘దొరసాని’ స్క్రిప్టు నరేట్‌ చేశారు. అప్పుడు నటనపై నాకున్న భయాలు వెళ్లిపోయాయి. కథ చాలా నచ్చింది. మహేంద్రకు సినిమాపై చాలా క్లారిటీ ఉంది. ఇది 1980లో జరిగిన ఓ స్వచ్ఛమైన ప్రేమకథ. నిజ జీవితానికి దగ్గరగా ఈ చిత్రాన్ని చూపించే ప్రయత్నం చేశాం’.

చాలా టెన్షన్‌ పడ్డాడు
‘ఈ సినిమాలోని నటీనటులంతా కొత్త వాళ్లే. చక్కగా నటించారు. అన్న మొన్న ‘దొరసాని’ చూశాడు. సినిమా చూసేందుకు కారులో వెళ్తున్నప్పుడు చాలా కంగారుపడ్డాడు. ‘నా సినిమా కన్నా నీ సినిమాకే ఎక్కువ టెన్షన్‌ పడుతున్నారా’ అన్నాడు. సినిమా చూసిన తర్వాత చాలా గర్వపడ్డాడు. బాగా నటించావని మెచ్చుకున్నాడు. దాంతో నాకు ఇంకాస్త నమ్మకం వచ్చింది. జులై 12న ఆ విషయం మీకూ తెలుస్తుంది’.

ఓ అన్నలా సపోర్ట్‌ చేస్తాడంతే..
‘మా అన్నను చూసి నేనూ హీరో కావాలి అనుకోలేదు. కానీ అతడ్ని చూసి ధైర్యం, నమ్మకం వచ్చింది. శ్రమించేతత్వం ఉంటే ఎవరైనా పైకొస్తారు అనిపించింది. విజయ్‌ ఓ అన్నలా నాకు సపోర్ట్‌ చేస్తాడు.. అంతేకానీ ఓ స్టార్‌గా సపోర్ట్‌ చేయడు’.


అన్న మాట్లాడుతుంటే బాధేసింది
‘అన్న ‘దొరసాని’ ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో నా గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా బాధేసింది. కన్నీరు పెట్టుకున్నా. మా అమ్మ కూడా బాగా బాధపడ్డారు. అన్న చాలా పట్టుదల కల్గిన వ్యక్తి. చిత్ర పరిశ్రమలో చాలా పనులు చేశాడు. కథలు కూడా రాస్తుండేవాడు. నటుడు కాకపోయి ఉంటే దర్శకుడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓసారి అన్నతోపాటు ఆడిషన్స్‌కు వెళ్లాను. ముగ్గురు నటుడు ఆడిషన్స్‌కు వచ్చారు. అన్న అందరి కంటే బాగా చేశాడు. కానీ ఆ ఆఫర్‌ అన్నకు రాలేదు.

అందుకే శివాత్మికను కలవలేదు
‘ఈ కథలో రాజు, దేవకి పాత్రల మధ్య ఎక్కువ చనువు ఉండదు. అందుకే నా వర్క్‌షాప్‌లను శివాత్మికతో కాకుండా వేరుగా నిర్వహించారు. షూటింగ్‌ లొకేషన్‌లో కూడా కాస్త దూరంగానే ఉన్నాం. మేం స్నేహితులమైతే.. ఆ ఫీల్‌ స్క్రీన్‌పై తెలిసిపోతుందని జాగ్రత్త తీసుకున్నాం. ఇప్పుడు మంచి స్నేహితులం అయ్యాం’.

ఏదైనా సినిమా వచ్చిన తర్వాతే..
‘సినిమాపై మనకు నమ్మకం ఉంటే ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జడ్జిమెంట్‌ అనేది అందరూ ఇస్తారు. ఇప్పుడు వచ్చే విమర్శల్ని నేను పట్టించుకోవడం లేదు. సినిమా విడుదలైన తర్వాత వచ్చే ప్రశంసలు, విమర్శల్ని దృష్టిలోకి తీసుకుంటాను. సోషల్‌మీడియాలో విమర్శిస్తూ చేసిన కొన్ని మీమ్స్‌ నేనూ చూశా’.

గొప్ప దర్శకుడు అవుతాడు
‘మహేంద్ర భవిష్యత్తులో గొప్ప దర్శకుడు అవుతాడు. ఆయన దర్శకుడి కంటే ముందు ఓ చక్కటి స్టోరీ టెల్లర్‌. ప్రతిదీ వివరించి చెబుతారు. ఆయన కథ చెబుతుంటే మనమే సీన్‌ను స్పష్టంగా ఊహించుకోవచ్చు. ‘దొరసాని’ తర్వాత రొమాంటిక్‌, కామెడీ నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నా. వచ్చే నెల షూటింగ్‌ ప్రారంభం అవుతుంది’.
ఆనంద్‌ దేవరకొండ, ఆనంద్‌, శివాత్మిక, విజయ్‌ దేవరకొండ, అర్జున్‌ రెడ్డి, మహేంద్ర, దొరసాని,Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.