కథలో దమ్ముంటేనే బయోపిక్స్‌ చేయాలి!!
మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బోయపాటి శ్రీను. ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ ఆయన కథల్లో కొండంత హీరోయిజం కనిపిస్తుంటుంది. కథానాయకుణ్ని ప్రేమించి, అభిమానుల్లో ఓ అభిమానిగా మారిసినిమాలు తీస్తుంటారాయన. అవన్నీ వాణిజ్యపరంగా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాల్ని అందుకుంటాయి. రామ్‌చరణ్‌ని ‘వినయ విధేయ రామ’గా చూపించనున్నారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది. ఈసందర్భంగా బోయపాటి శ్రీను ఏమన్నారంటే.


మీ ప్రతి కథనీ చిరంజీవికి వినిపిస్తారు కదా. ఈ కథనీ చెప్పారా? ఆయన ఎలాంటి సలహాలు ఇచ్చారు?
ప్రతి కథనీ సెట్‌కి వెళ్లే ముందు చిరంజీవి గారికి వినిపిస్తాను. ఆయన విలువైన సలహాలిస్తారు. ‘సరైనోడు’ కథ విన్నాక కొన్ని సూచనలు చేశారు. ‘వినయ విధేయ రామ’ కథ ఆయనకు చెప్పాను. ప్రతి సన్నివేశం జాగ్రత్తగా విన్నారు. అంతా అయిపోయాక ‘బాగా సిద్ధం చేశావు. మార్పులు చెప్పేందుకు అవకాశమే లేదు’ అని మెచ్చుకున్నారు.

చిరంజీవితో సినిమా ఎప్పుడు?
కొన్ని కథల గురించి చిరంజీవిగారితో మాట్లాడుతున్నాను. ఇప్పుడాయన ‘సైరా నరసింహారెడ్డి’ పనిలో నిమగ్నమయ్యారు. ఆయన స్థాయిలో సరైన కథ పక్కాగా ఖరారయిన తర్వాతే అది పట్టాలెక్కుతుంది.

ఈ రాముడు ఎవరికి విధేయుడు?
ఎవరు తనను నమ్ముకుంటారో వాళ్లకి. కుటుంబం, అన్నావదినలు, ప్రేమికురాలు ఇలా ఎవరైనా కావొచ్చు. తనది అనుకున్న దాన్ని సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఏమైనా చేస్తాడు.


మీ సినిమాల్లో లెక్కలేనంతమంది నటీనటులు కనిపిస్తుంటారు. ‘వినయ విధేయ..’ ప్రచార చిత్రాల్లోనూ అదే కనిపిస్తోంది. వాటితో పాటు ప్రత్యేకంగా ఈ సినిమాలో ఏముంటాయి?
నా ప్రతి కథకీ కుటుంబమే పునాది. సమాజంలోని అంశాలు కనిపిస్తాయి. ‘వినయ విధేయ రామ’ కూడా కుటుంబ కథే. చరణ్‌ అన్నయ్యలుగా ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ కనిపిస్తారు. వదిన పాత్రలూ బాగా వచ్చాయి. వాటిలో స్నేహ, హిమజ, ప్రవీణ నటించారు. సామాజిక స్పృహతో ఉన్న పాత్రని నటి హేమ పోషించింది. ప్రతినాయకుడిగా వివేక్‌ ఒబెరాయ్‌ని అనుకున్నాం. కానీ ఆయన అలాంటి పాత్రలు చేయడంలేదు. అయినా సరే.. ఓసారి కలసి కథ వినిపించాను. బాగా నచ్చి వెంటనే కాల్షీట్లు సర్దుబాటు చేశారు. యాక్షన్‌ దృశ్యాలు వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా అజర్‌బైజాన్‌లో తెరకెక్కించిన పోరాట ఘట్టం అభిమానుల్ని మైమరిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్‌తో నేను చేసిన ఐదు చిత్రాలూ హిట్లే. ఈ సినిమాలోనూ మంచి సంగీతం అందించాడు. సంభాషణలు ఆకట్టుకుంటాయి. రామ్‌ చరణ్‌ పాత్రకు తగినట్టు తన దేహాన్ని తీర్చిదిద్దుకున్నారు. తెరపై చరణ్‌ ఐరన్‌మ్యాన్‌లా కనిపిస్తారు. ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అన్నీ రామ్‌ చరణ్‌.

యువ కథానాయకులతో ప్రేమకథలు తీసే ప్రయత్నాలు చేయటం లేదు ఎందుకని?
బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ తీశాను. తను ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సుఖంగా ఉండేందుకు తన వెంటే ఉండి పోరాడే ప్రేమికుడి కథ అది. చేస్తే దాన్ని మించిన ప్రేమకథలే చేయాలి. అలాంటి కథల గురించే ఇటీవల నేను, రామ్‌చరణ్‌ మాట్లాడుకున్నాం. త్వరలో మేమిద్దరం అలాంటి ప్రేమకథ చేస్తామేమో.

అగ్ర దర్శకులు అప్పుడప్పుడూ చిన్న సినిమాలు చేస్తున్నారు. మీకూ అలాంటి ఆలోచనలున్నాయా? బయో పిక్‌లు చేయమని ఎవరైనా అడిగారా?
నేను ఏ సినిమా చేసినా, ఎవరితో చేసినా ప్రేక్షకులు ఆ సినిమాని వాళ్ల గుండెల్లో పెట్టుకుంటున్నారు. చిన్న సినిమాలు చేసినా అవీ ఇట్లానే ఉండాలి. హంగు, ఆర్భాటాలు లేకుండా చిన్న సినిమాలు తీసి ప్రేక్షకుల్ని సంతృప్తిపరచడం సాధ్యమా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే వస్తోంది. అందువల్లే చిన్న సినిమాలు చేయను. బయోపిక్‌ సినిమాలు చేయాలని నాకూ ఉంది. కథలో దమ్ముంటేనే బయోపిక్స్‌ చేయాలి. అవి దొరికినప్పుడే చేస్తా. అన్ని జోనర్లూ చేసేందుకు అన్నీ కుదరాలి.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.