నేనైతే కమెడియన్ని కాను అనుకుంటా!
హాస్యనటుడిగా గుర్తింపు పొందిన సప్తగిరి.. కథానాయకుడుగా మెరిశారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌బి’లలో తన హీరోయిజం చూపించాడు. ఇప్పుడు ‘వజ్రకవచధర గోవింద’లో దొంగగా వినోదాలు పంచడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల అవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సప్తగిరి విలేకర్లతో మాట్లాడారు.

‘‘గోవింద అనే దొంగ కథ ఇది. లక్ష్యం మంచిదైనప్పుడు నడిచే మార్గం కూడా గొప్పదై ఉండాలి అని గోవింద పాత్ర ద్వారా చెబుతున్నాం. వినోదం మాటున ఓ సందేశం ఉంటుంది. కేన్సర్‌ బాధితులకి న్యాయం చేయాలని చూపాం. నేను కథానాయకుడ్ని కాదు, కథనే నమ్ముతా. నా దృష్టిలో కథే హీరో. ద్వితీయార్థంలో జబర్దస్త్‌ బృందం నవ్విస్తారు. నాకూ స్వామీజీకి మధ్యనున్న దృశ్యాలు, కుక్క, పాము నేపథ్యంలోని మరికొన్ని సన్నివేశాలు, బెలూన్‌ గుహల్లో చిత్రించిన దృశ్యాలు గుర్తుండిపోయేలా రూపొందించారు. జోషి గ్రామీణ యువతిగా అలరిస్తుంది. అవసరమైనప్పుడు పోరాటాలు చేసి ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంతో మాకు డబ్బులు, పేరు వస్తాయి’’ అన్నారు.


తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ ‘‘నా మాటలు, బాడీ లాంగ్వేజ్‌నీ పరిశీలించినవాళ్లు నన్ను కమెడియన్ని చేశారు. నేనైతే కమెడియన్ని కాను అనుకుంటా. ఇన్ని సినిమాలు చేసినా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెలోని నా వేషం బాగా నచ్చింది. పరిశ్రమలోకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అడుగు పెట్టా. డైరెక్టర్‌ అవ్వాలని కోరిక. అనుకోకుండా నటుడ్ని అయ్యా. ప్రస్తుతం సందీప్‌కిషన్‌ సినిమాలోనే మంచి పాత్ర చేస్తున్నా. మరో రెండు చిత్రాల్లో కామెడీ పాత్రలున్నాయి. కథానాయకుడుగా ‘దెయ్యం పట్టిన-1’, ‘దెయ్యం పట్టిన-2’ అనే రెండు కథలున్నాయి. నేను శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుణ్ణి. గోవిందనామాల్లో ‘వజ్రకవచధర గోవింద’ అనేది ఓ నామం. ఈ కారణంగా కథలో గోవింద కథానాయకుడి పేరైనందున సెంటిమెంట్‌ రీత్యా అదే టైటిల్‌ అయింద’’న్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.