‘దొరసాని’ కోసం 42 వెర్షన్లు రాసుకున్నా..
‘‘అద్భుతమైన విజయాల్ని నమోదు చేసే ప్రేమకథలు దశాబ్దానికి ఒకటి, రెండు మాత్రమే వస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో ఉండేంతటి కథాబలం మా ‘దొరసాని’లో ఉంది’’ అంటున్నారు దర్శకుడు కెవీఆర్‌ మహేంద్ర. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రమిది. ఈ సినిమాతో ఆనంద్‌ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్‌ నాయకానాయికలుగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు మహేంద్ర.


*
‘‘నాది 17 ఏళ్ల సినిమా ప్రయాణం. చిత్రసీమలో ఎదురయ్యే అని సినిమా కష్టాలు అనుభవించా. తొలిసారి నాకు గుర్తింపు వచ్చింది మాత్రం.. నేను తెరకెక్కించిన ‘నిశీధి’ లఘు చిత్రంతోనే. నేనేంటో.. నా శక్తి సామర్థ్యాలు ఎలాంటివో నాకు తెలిసింది ఈ షార్ట్‌ ఫిలింతోనే. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటం.. ఆ ఉద్యమం కోసం ప్రాణాలర్పించిన వారి జీవితాల నేపథ్యంతో ‘నిశీధి’ని రూపొందించా. పూర్తిగా నలుపు - తెలుపు రంగుల్లోనే చిత్రీకరించాం. అది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దాదాపు 18 దేశాల్లో వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. 39కిపైగా జాతీయ - అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. లెజండరీ డైరెక్టర్‌ శ్యాం బెనగల్‌.. నా సినిమా చూసి అభినందనలు తెలుపుతూ నాకు ప్రత్యేకంగా మెయిల్‌ చేశారు. ఈ చిత్రం విడుదలయ్యే నాటికి నా వద్ద రెండు కథలున్నాయి. కానీ, వాటిని మించిన అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని నాలుగేళ్ల క్రితం ‘దొరసాని’ స్క్రిప్ట్‌పై కూర్చున్నా’’.

*
‘‘1987 బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణలోని ఓ చిన్న పల్లెటూరి నేపథ్యంగా సాగే అందమైన ప్రేమకథ ఇది. దీనికి నా చిన్నతనంలో నేను చూసిన సంఘటనలే స్ఫూర్తి. వరంగల్‌ జిల్లాలోని జయగిరి అనే చిన్న పల్లెటూరు మాది. మా ఊరిలోనూ పెద్ద గడీ ఉండేది. ప్రతిరోజు ఆ గడీ ముందు నుంచే స్కూల్‌కు వెü™్లవాడిని. అలా వెళ్తున్న సమయంలో.. ఆ గడీలోని పరిస్థితులు, అందులోని దొర, ఓ అందమైన దొరసాని, నాటి దొర వ్యవస్థ వంటి వాటి గురించి నాలో రకరకాల ఊహలు వస్తుండేవి. ఆ చిన్నతనంలో నాలో ఉదయించిన ఆ ఊహలకు తెర రూపమే.. నేటి ‘దొరసాని’. వాస్తవానికి ఈ కథ నడిచే కాలానికి నాకు సరిగా జ్ఞానం కూడా లేదు. కాబట్టి అప్పటి తెలంగాణలోని సమకాలిన పరిస్థితులు, గడీలు, దొరల వ్యవస్థల గురించి తెలుసుకోవడానికి అనేక పుస్తకాలు చదివా. ప్రముఖ రచయితలు అల్లం రాజయ్య, దాశరథి రంగాచార్యులు వంటి వారు రాసిన పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయం చేశా. ఇక ఈ కథ రాసుకోవడానికి మూడేళ్ల సమయం పట్టింది. దీనికోసం దాదాపు 42 వెర్షన్లు రాసుకున్నా. ఆ తర్వాత కథా రచయిత వెంకట సిద్ధారెడ్డికి చూపించగా.. 25 రోజుల్లో ఓ వెర్షన్‌ను ఫైనల్‌ చేశారు. దాన్నే నిర్మాత సురేష్‌బాబుకు నాలుగు గంటలు వినిపించా. ఆయన కథ నచ్చి మధుర శ్రీధర్‌కు చెప్పడం, తర్వాత ఆనంద్‌ - శివాత్మికలు కథలోకి రావడం ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి’’.


*
‘‘దొరసాని’లో శివాత్మికను తప్ప మరొకరిని ఊహించుకోలేను. ఈ పాత్రకు అందమైన రూపుతో పాటు గంభీరమైన వ్యక్తిత్వం.. కళ్లతోనే భావోద్వేగాలు పలికించగల నేర్పు ఉండాలి. నేను ఊహించుకున్న ఈ లక్షణాలన్నీ శివాత్మికలో కనిపించాయి. ఇక రాజు పాత్రలో అమాయకత్వం, నిజాయితీ ఉంటాయి. అవన్నీ ఆనంద్‌లో సహజంగానే ఉన్నాయి. ఈ కథ పూర్తయ్యాక తొలిసారి ఈ కథను దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌కు వినిపించా. ఆయనకు ఈ కథ విపరీతంగా నచ్చడంతో దాన్ని ఆనంద్‌ దేవరకొండ వాళ్ల నాన్న వర్ధన్‌గారితో చెప్పారట. ‘నాకీ కథలోని రాజు పాత్రలో ఆనందే కనిపిస్తున్నారని’ అన్నారట. ఈ కథా చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆనంద్‌ యూఎస్‌ నుంచి తిరిగి రావడం, నేనాయనకు ఈ కథ చెప్పడం, అన్నీ అనుకోకుండా జరిగాయి. ఈ చిత్రంతో దాదాపు 60 మంది కొత్తవాళ్లను చిత్రసీమకు పరిచయం కాబోతున్నారు’’.

*
‘‘పెద్దింటి అమ్మాయి - పేదింటి కుర్రాడు అన్న అంశంలో తప్ప.. ఈ చిత్రానికి గతంలో వచ్చిన ఏ సినిమాలకు సంబంధం ఉండదు. వాస్తవికతో నిండిన సహజమైన ప్రేమకథ ఇది. తెరపై దీన్ని చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడూ ఆ నాటి కాలంలోకి వెళ్లిపోతారు. తమ కళ్ల ముందు జరుగుతున్న కథ కదా.. అన్నట్లుగా అనుభూతి చెందుతారు. పూర్తిగా విజువల్స్‌ ద్వారానే కథ చెప్పబోతున్నాం. ఆనాటి పరిస్థితులు, ప్రాంతాలను, నేపథ్యాన్ని వాస్తవికంగా చూపించడానికి దాదాపు నెలరోజుల పాటు శ్రమించి మా కథకు తగ్గ లొకేషన్లను పట్టుకున్నాం. ఇలాంటి కథలకు నేపథ్య సంగీతమే ప్రాణం. దీనికి సమర్థవంతంగా న్యాయం చేశాడు ప్రశాంత్‌.ఆర్‌.విహారి. నేను ఊహించిన దానికన్నా అద్భుతమైన సంగీతమిచ్చాడు. సాయి కొర్రపాటి ఛాయాగ్రహణం కూడా సినిమాకు ప్రాణం పోసింది. సన్నివేశాలను పాత రోజులకు తగ్గట్లుగా చూపించడం కోసం.. కెమెరాకు అప్పట్లో వాడిన ఓల్డ్‌లెన్స్‌ పెట్టి చిత్రీకరణ జరిపాం. కొన్నిసార్లు వైల్డ్‌ లెన్స్‌ వాడాం. పాత్రల సంభాషణలను సింక్‌ సౌండ్‌ పద్ధతిలో రికార్డు చేసుకున్నాం. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. దీనికోసం చిత్రీకరణ సమయంలోనే డైలాగ్‌లను రికార్డు చేయడం జరుగుతుంది’’.


* ‘‘మనలో విషయం ఉంటే.. అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి అని నమ్మే వ్యక్తిని నేను. ఏదైతే నేను బాగా చూపించగలనో అదే స్రిప్ట్‌పై రాసుకుంటా. అందుకే చిత్రీకరణలో ఎక్కడా రాజీ పడను. ఇప్పటికీ నేను ‘దొరసాని’ నుంచి బయటకు రాలేకపోతున్నా. గత నాలుగేళ్లుగా నేను 1987 కాలంలోనే జీవిస్తున్నా. ఈ చిత్ర హడావుడి ముగిశాకే తర్వాతి సినిమాపై దృష్టిపెడతా. నా దర్శకత్వం ప్రతిభ నచ్చడం వల్లే.. ప్రీరిలీజ్‌ వేడుక వేదికపై ‘నాకు కథ చెప్పు కచ్చితంగా వింటా’ అన్నారు విజయ్‌ దేవరకొండ. రాజశేఖర్‌ కూడా తర్వాతి సినిమా నాతోనే చేయాలి అంటుండేవారు సరదాగా. ప్రస్తుతానికి ఏ కథా ఫైనల్‌ చేసుకోలేదు. ఐడియాలు మాత్రమే ఉన్నాయి’’.


- మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.