హిట్‌ టాక్‌ వస్తేనే.. నిద్ర లేపమంటా!!
ఆగస్టు 30వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ‘సాహో’పై సినీప్రియుల అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ‘బాహుబలి’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తోన్న సినిమా కావడం.. దాదాపు రూ.350 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ కావడం వంటి అంశాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు ఈ చిత్రంతోనే ప్రభాస్‌ హిందీలోకి అడుగుపెట్టబోతుండటం.. శ్రద్ధాకపూర్‌ వంటి స్టార్‌ హీరోయిన్‌ దక్షిణాది ప్రేక్షకులను పలకరించడం వంటివి సినీప్రియుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రచార కార్యక్రమాలను ఉత్తరాది, దక్షిణాదిల్లో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌ ప్రముఖ జర్నలిస్ట్‌ అనుపమ్‌ చోప్రాతో మాట్లాడుతూ.. తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.


* ఆ మూడు నా బలహీనతలు..
‘‘నలుగురితో త్వరగా కలవలేకపోవడం, సిగ్గు, బద్ధకం ఈ మూడు నా బలహీనతలు. ఎందుకో తెలియదు.. చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్‌ ఇంతే. నలుగురిలో మాట్లాడటమంటే అంత సౌకర్యంగా అనిపించదు. అదే కెమెరా ముందుంటే మాత్రం ఇలాంటివి ఏమీ గుర్తుండవు. చకచకా నా పని నేను చేసుకుపోతా. అయితే కొన్నిసార్లు అవుట్‌ డోర్, ఇన్‌ డోర్‌ షూట్లలో ఎక్కువ మంది చిత్ర బృందం కనిపిస్తే మాత్రం మళ్లీ సిగ్గు, భయం మొదలైపోతాయి. నా ఈ లక్షణాలు కొన్నిసార్లు నాకూ ఇబ్బందిగానే అనిపిస్తాయి. ఇలాంటి బలహీనతలు ఉన్నా స్టార్‌గా ఎలా నిల్చున్నానా అనిపిస్తుంటుంది. అదృష్టవశాత్తూ ‘బాహుబలి’ నా వెనుక ఉంది కాబట్టి సరిపోయింది అనుకుంటా (నవ్వుతూ).

* బ్లాక్‌బస్టర్‌ అయితేనే నిద్ర లేపండి..
‘‘సినిమా విడుదలకు ముందు ప్రతి స్టార్‌కూ ఉన్నట్లే నాకూ ఒత్తిడిగా అనిపిస్తుంటుంది. అందుకే నా ఇంట్లో వాళ్లకి, నా ఫ్రెండ్స్‌కు చెప్తుంటా. బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినిపిస్తేనే నన్ను నిద్ర లేపండి. లేదంటే వద్దని చెప్తుంటా. ‘బాహుబలి’ తొలి భాగం విడుదలప్పుడు అదే పని చేశా. వాస్తవానికి ఆ చిత్రానికి తొలిరోజు దక్షిణాదిలో నెగిటీవ్‌ టాక్‌ వచ్చింది. ఉత్తరాది నుంచే మంచి స్పందన వచ్చింది. అయితే దీనికి దక్షిణాదిలో మాపై ఉన్న అంచనాలే కారణం. రాజమౌళి - ప్రభాస్‌ అనగానే ఓ అంచనా.. అనుష్క, తమన్నా, సత్యరాజ్‌ ఇలా అంతా తెలిసిన నటులు కావడం అందరిలోనూ కొన్ని భారీ అంచనాలుంటాయి. కానీ, ఉత్తరాది వాళ్లకు మేమూ కొత్త, మేం చేసిన ప్రయత్నమూ కొత్తే. కాబట్టి ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చారు. కొత్త అనుభూతికి లోనయ్యారు. ఇక చివర్లో బాహుబలిని కట్టప్ప చంపడం వంటి ట్విస్ట్‌లు చూసి అక్కడంతా షాక్‌. దాని ప్రభావం దక్షిణాదిలో తొలిరోజు తర్వాతకు కానీ కనిపించలే. రెండో రోజు ఇక్కడ కూడా మంచి టాక్‌ రావడం మొదలైంది. అది చూశాకా రాత్రికి రాత్రి సినిమాలో ఏం మార్పులు జరిగిపోయాయా అని ఆశ్చర్యపోయా’’.

* అక్కడ సినిమా చూడాలంటే హార్ట్‌ఎటాక్‌ వస్తది..
‘‘నాకూ నా సినిమాని థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసుకోవాలని అనిపిస్తుంటుంది. కానీ, అక్కడి దాకా వెళ్లగానే హార్ట్‌ఎటాక్‌ వచ్చినట్లే ఉంటుంది. ‘రెబల్‌’ అప్పుడు మా దర్శక, నిర్మాతలకు కచ్చితంగా సినిమాను థియేటర్లోనే చూస్తా అని మాటిచ్చా. అన్ని ఏర్పాట్లు చేసుకున్నా. మా ఇంటి నుంచి థియేటర్‌కు వెళ్లడానికి ఓ 30 - 40 నిమిషాల సమయం పట్టొచ్చు. కానీ, థియేటర్‌కు చేరే లోపలే గుండెల్లో ఏదో ఆందోళన మొదలైపోయింది. అంతే ఇచ్చిన మాట పక్కకు పెట్టి ఇంటికి వెళ్లిపోయా.

* ‘బాహుబలి’ తర్వాత కన్ఫ్యూజ్‌ అయ్యా..
‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత మరేదైనా లవ్‌స్టోరీ చెయ్యాలా.. లేకపోతే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చెయ్యాలా అని ఓ కన్ఫ్యూజన్‌ ఉండేది. ఎందుకంటే ఆ సినిమాల తర్వాత నాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మళ్లీ ‘బాహుబలి’ అంత పెద్ద కథ దొరకడమంటే అయ్యే పని కాదు. దీంతో ఏదైనా స్క్రీన్‌ప్లే బేస్డ్‌ స్టోరీ చేస్తే బాగుంటుందనిపించింది. అప్పటికే నాకు సుజీత్‌ ‘సాహో’ కథ చెప్పడం.. నేను అనుకున్న స్క్రీన్‌ప్లే ప్రధానమైన కథ కావడంతో దీనికి ఓటేశా. ఆ తర్వాత ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్లుగా దీన్ని భారీ స్థాయిలో నిర్మించాం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.