‘‘మంచి స్కిప్ట్‌తో రావాలే కానీ, నా పాత్ర చిన్నదా.. పెద్దదా అన్నది అస్సలు పట్టించుకోను. సినిమాలో పాత్ర ప్రభావం బలంగా ఉంటే చాలు’’ అంటోంది కల్యాణి ప్రియదర్శిని. ‘హలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. ఇటీవలే ‘చిత్రలహరి’తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ‘రణరంగం’తో హ్యాట్రిక్ కొట్టేందుకు వచ్చేస్తోంది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో ముచ్చటించింది కల్యాణి. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

* ‘రణరంగం’ను ఎంచుకోవడానికి అందులో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి?
- సుధీర్ వర్మ చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించింది. ఓవైపు గత కాలానికి సంబంధించిన కథను చెప్తూనే.. ప్రస్తుతానికి సంబంధించిన జీవితాన్ని చూపిస్తుంటారు. కచ్చితంగా చెప్పాలంటే ఓ గ్యాంగ్‌స్టర్ 20 ఏళ్ల జీవిత ప్రయాణమిది. ఇందులో స్క్రీన్ప్లేదే ప్రధాన భూమిక. దీన్ని తెరపై చూస్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా, కొత్తగా అనిపిస్తుంటుంది.
* ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
- నేనిందులో గీత అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర గురించి చెప్పాలంటే ముందుగా శర్వా పాత్ర గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా అతని జీవితం.. అతని ఎదుగుదలకు సంబంధించినది. కథ మొత్తం శర్వా చుట్టూనే తిరుగుతుంది. సినిమా మొత్తం చాలా బలమైన పాత్రలో కనిపిస్తాడు. అయితే ఎంత గొప్ప మగవాడైనా అమ్మాయిల దగ్గరకొచ్చే సరికి తమ బలహీనతను బయటపెట్టుకుంటారు. శర్వా పాత్ర కూడా అంతే.. తనకి గీతే ఓ బలహీనత. ఆమె ప్రేమ కోసం పరితపిస్తుంటాడు. ప్రేక్షకులంతా నా పాత్రతోనే శర్వాలోని ఈ కోణాల్ని చూడగలుగుతారు. అందుకే నాకీ పాత్ర బాగా నచ్చింది. వినోదం, భావోద్వేగాల కలబోతగా ఉందే పాత్ర నాది. నా గత చిత్రాల్లోని పాత్రలు జున్నూ, లహరీలతో పోలిస్తే.. గీత చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది.
* ఇంతకీ చిత్ర కథేంటి?
- కథేంటో నేను చెపితే సుధీర్ నన్ను చంపేయడం ఖాయం (నవ్వుతూ). ఒకటి మాత్రం చెప్పగలను. ఇంతవరకు వచ్చిన గ్యాంగ్‌స్టర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. చాలా కొత్తగా ఉంటుంది.
* గ్యాంగ్స్టర్స్ అంటే మీకిష్టమేనా?
- నాకు గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే ఇష్టం. చినప్పటి నుంచి వాటిని చూసేందుకు ఆసక్తి చూపించేదాన్ని. నాకు తుపాకీ పట్టుకోవడమన్నా చాలా ఇష్టం. నాన్న (దర్శకుడు ప్రియదర్శన్)ను ఫైరింగ్ నేర్పించమని ఎప్పుడూ అడుగుతుండే దాన్ని. ఎప్పుడూ నేర్పిస్తా అనేవారు కానీ, ఇంతవరకు ఆ పని చేయలే. అయితే ఆ కోరిక సుధీర్ ద్వారా ‘రణరంగం’ సెట్స్‌లో తీరింది.
* ఈ సినిమాలో ఓ పల్లెటూరి యువతిలా కనిపించారు. ఆ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు?
- సినిమాలో నా భాగమంతా 80-90ల కాలంలో జరిగేదే. ఆనాటి పల్లెటూరి యువతుల వేషధారణ ఎలా ఉండేదన్నది అమ్మ (లిజీ), శోభనగారు చేసిన చిత్రాలను చూసి తెలుసుకున్నా. ముఖ్యంగా నేను పుట్టిన రోజుల్లోని వాతారవణాన్ని అనుభవిస్తూ సినిమా చేయడాన్ని చాలా ఆస్వాదించాను. ఈ చిత్రం కోసం తొలిసారి హాఫ్ శారీ కట్టుకున్నా. ఆ గెటప్‌లో నాన్న నన్ను చూసి ప్రత్యేకంగా అభినందించారు. ‘ఇంతవరకు చూడనంత కొత్తగా కనిపిస్తున్నావ్. ప్రేక్షకులకూ నచ్చుతుంది’ అని అభినందించారు. ఆయన కూడా కొన్ని సలహాలు, సూచనలిచ్చారు.

* కథల ఎంపికలో అమ్మానాన్నల సలహాలు తీసుకుంటారా?
- లేదు. ఆ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్లు చెప్పేది ఒక్కటే.. ‘‘నువ్వు చేసే పనిలో నీకు సంతోషం ఉండాలి. నీ మనసుకు నచ్చినది చెయ్యి. ఇతరుల సలహాలు అస్సలు పాటించకు. ఎందుకంటే 10మంది మనల్ని మెచ్చుకునే వాళ్లుంటే.. 8 మంది మనల్ని ఇష్టపడని వాళ్లుంటారు’’ అంటుంటారు.
* తెలుగులో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక్కడ నటిగా మీ కెరీర్ పట్ల అమ్మ ఎలా ఫీలౌతున్నారు?
- చాలా ఆనంద పడుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే అమ్మకు చాలా ఇష్టం. ‘ఇక్కడి ప్రేక్షకులు సినిమాలు, నటులను ఎంతో ప్రేమిస్తారు. వారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటుంది’ అని చెప్తుండేది. నా తొలి సినిమా పూర్తయ్యాక ఇక్కడి వారి ఆదరణ, ఆప్యాయత చూశాక ‘అమ్మా నవ్వు చెప్పింది నిజమే’ అని చెప్పా. తెలుగు భాషన్నా నాకు చాలా ఇష్టం. వినసొంపైన భాష. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. నేను మాట్లాడుతుంటే వ్యాకరణ దోషాలు వస్తుంటాయి. కానీ, చక్కగా అర్థమవుతుంది.
* నాన్న బాటలో దర్శకత్వం వైపు వెü™్ల ఆలోచన ఉందా?
- కచ్చితంగా. కానీ, ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను. భవిష్యత్తులో నేను చేయగలను, నా చేతిలో మంచి కథలు సిద్ధంగా ఉన్నాయి అనుకున్నప్పుడు, తప్పకుండా దర్శకత్వం వహిస్తా.
* నాన్న దర్శకత్వంలో ‘మరక్కర్’ చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది? ఆ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది?
- ప్రస్తుతం గ్రాఫిక్స్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇందులో నా పాత్ర చిన్నదే కానీ, ప్రాధాన్యత ఉన్నది. నాన్న దర్శకతంలో చేయలన్నది కల. ఈ సినిమాలో ఓ పాత్ర ఇవ్వమని నాన్నను నేనే అడిగా. కానీ, ఆయన ముందు చేస్తున్నప్పుడు ఒత్తిడిగా ఫీలయ్యేదాన్ని. వాస్తవానికి నేను ఓ ఐదారు చిత్రాలు చేశాక, నటిగా అనుభవం సంపాదించుకున్నాకే నాన్నతో సినిమా చేయాలనుకున్నా. లేకపోతే ఆయనపై కూడా ఒత్తిడి ఉంటుంది.
* నాయికా ప్రాధాన్య చిత్రాలు చేయాలనుకుంటున్నారా?
- మంచి స్కిప్ట్‌తో వస్తే ఎలాంటి పాత్రలో నటించడానికైనా సిద్ధమే. అది నాయికా ప్రాధాన్య చిత్రమా.. లేక నా పాత్ర రెండు నిమిషాలే ఉంటుందా? అన్నది పట్టించుకోను. ఒక వయసు దాటకా నా సినిమాలను నేను వెనక్కు తిరిగి చూసుకుంటే నాకు గర్వంగా అనిపించాలి.
* మీ కొత్త సినిమాల విశేషాలేంటి?
- ప్రస్తుతం నేనెక్కువగా తమిళ్, మలయాళ చిత్రాల్లోనే నటిస్తున్నాను. తెలుగు నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నా. ఇకపై రెగ్యులర్‌గా తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉంటా. ఇప్పటికైతే ఓ సినిమా చర్చల దశలో ఉంది.
- మందలపర్తి రాజేశ్ శర్మ, ఈనాడు డిజిటల్