ఒకే తరహా సినిమాలు ఒకేలా విడుదలవ్వాలి
తెెలుగు చిత్రసీమలో బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ‘మహానటి’ తర్వాత మరిన్ని చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లాయి. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ తెరకెక్కింది. అయితే ఇది వై.ఎస్‌ జీవితంలో ఓ భాగమైన పాదయాత్ర ఘట్టం ఆధారంగానే తెరకెక్కింది. ‘ఆనందోబ్రహ్మ’తో విజయాన్ని అందుకొన్న మహి వి.రాఘవ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. వై.ఎస్‌.పాత్రలో ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించారు. ఫిబ్రవరి 8న ‘యాత్ర’ ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా మహి వి.రాఘవ్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...


* వై.ఎస్‌ జీవితాన్ని ఒక బయోపిక్‌లా కాకుండా, కేవలం పాదయాత్ర ఘట్టాన్నే ఎందుకు తీయాలనిపించింది?
- కేవలం పాదయాత్రకి సంబంధించిన విషయాలే కాదు, కొన్ని ఉప ఘట్టాలు కూడా సినిమాలో ఉంటాయి. సినిమాకి అవసరమైన డ్రామా వాటిలో ఉంటుంది. ప్రేక్షకులు ఎప్పుడూ ఒకరి సమాచారం తెలుసుకోవడానికి సినిమాకి రారు. వినోదం కోసం, భావోద్వేగానుభూతి కోసమే వస్తారు. అందుకు వై.ఎస్‌ జీవితంలోని పాదయాత్ర ఘట్టం అయితేనే మేలనిపించింది. ఆయన మిగతా జీవితాన్ని కూడా పెంచలదాస్‌ పాడిన ఓ పాటలో చూపించే ప్రయత్నం చేశాం.

* అసలు ‘యాత్ర’ తెరకెక్కించడానికి ప్రేరణనిచ్చిన విషయాలేమిటి?
- ఉద్దేశపూర్వకంగా తీసిన సినిమా కాదిది. ఆటోలో వెళుతున్నప్పుడైనా, లేదంటే సామాన్య ప్రజలతో మాటలు కలిపినప్పుడైనా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గురించి మంచి మాటలే వినిపించేవి. ‘ఆనందోబ్రహ్మ’ చేస్తున్నప్పుడు వై.ఎస్‌ పాత్ర నాలో మరింత ఆసక్తిని పెంచింది. అందులోనుంచి పురుడు పోసుకొన్న ఆలోచనే ఈ ‘యాత్ర’.

* ఈ సినిమాకి ముందు వై.ఎస్‌ కుటుంబ సభ్యుల్ని కలిశారా? వాళ్లెలా స్పందించారు?
- పాదయాత్ర మీద చేస్తున్న సినిమానే కాబట్టి ఎలాంటి వివాదాస్పదాంశాలు ఇందులో ఉండవు. అందుకే మొదట కథ రాసుకొన్నాను. పోస్టర్‌ సిద్ధమయ్యాక పాదయాత్రలో ఉన జగన్‌ని కలిసి ఈ సినిమా గురించి చెప్పా. టీజర్‌ని విడుదల చేశాక ఆయన్ని కలిస్తే బాగుందని మెచ్చుకొన్నారు. సినిమా చూస్తారా అని అడిగితే ‘మీ నాయకుడి కథని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చూసి నా అభిప్రాయాలు చెబితే సృజనాత్మకంగా సినిమా దెబ్బతింటుంది కదా’ అన్నారు.

* వై.ఎస్‌. పాత్రకి మొదట మమ్ముట్టినే తీసుకోవాలనుకొన్నారా లేక, లేక వేరే ఆలోచనలేమైనా ఉండేవా?
- ఆ పాత్రలో గర్వం లేకుండా, వినయంతో కనిపించే నటుడు కావాలనుకొన్నా. అందుకు మమ్ముట్టి అయితేనే కరెక్ట్‌ అనిపించింది. ఆయన్ని సంప్రదించాక ‘నేనే ఎందుకు?’ అన్నారు. ‘దళపతి’లో ఓ సన్నివేశం గుర్తు చేసి చెప్పాక ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు. తెలుగు సినిమా చేసి చాలా కాలమైనా, ఆయన తెలుగులో సంభాషణలు చెబుతూ ఈ సినిమా చేశారు.

* ఎన్నికలపై ‘యాత్ర’ ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు?
- ఒక సినిమా ఎన్నికల్ని ప్రభావితం చేస్తుందంటే నేను నమ్మను. ఎవరికి ఓటేస్తే ఎలాంటి లాభం ఉంటుందో ప్రజలు లెక్కలేసి మరీ చెబుతున్నారు. సినిమావల్ల అదనంగా రెండు మూడు ఓట్లు కూడా రావనుకొంటా. ఒకవేళ వస్తే మంచిదే.


* వై.ఎస్‌.జగన్, చంద్రబాబు పాత్రలు ఇందులో ఉంటాయా?
- జగన్‌కి సంబంధించిన కొన్ని నిజమైన దృశ్యాలు ఉంటాయంతే. చంద్రబాబు నాయుడి పాత్ర కూడా సినిమాలో ఉండదు.


* ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’తో పాటే ఈ సినిమాని ఎందుకు విడుదల చేయాలనుకొంటున్నారు?
- ఒకే తరహా సినిమాలు, ఒకేసారి విడుదలైతే అది ఆసక్తికరంగా మారుతుంది. అది రెండు సినిమాలకీ మంచిదే అని నా అభిప్రాయం.

* ఇదివరకు భిన్నమైన చిత్రాలు చేశారు. ‘యాత్ర’ ప్రయాణం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
- నాకు తెలియని విషయాల్ని సేకరించి ఈ సినిమా చేశా. ఒకొక్క సినిమా ఒక్కో అనుభవం. చాలా విషయాల్లో ఇది నా తొలి సినిమా అన్న అనుభూతినిచ్చింది. తదుపరి సినిమా అనేది ఫలితాల్నిబట్టే ఉంటుంది. అందుకే ఈ సినిమా విడుదల గురించే ఎదురు చూస్తున్నా.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.