డార్లింగ్‌ తలచుకుంటే ఆ ఐదేళ్లలో..
‘‘ప్రభాస్‌ సినిమాల సంఖ్యను, వాటి ద్వారా వచ్చే డబ్బుల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు’’ అంటున్నాడు నటుడు రానా. ‘బాహుబలి’, ‘ఘాజి’ వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో.. ప్రస్తుతం ‘హాథీ మేరీ సాథీ’, ‘1942’, ‘హౌస్‌ఫుల్‌4’ వంటి బహుభాషా చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా రానా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన స్నేహితుడు ప్రభాస్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.


‘‘బాహుబలి’కి ముందు ప్రభాస్‌ నేను అంత పెద్ద స్నేహితులం కాదు. కానీ, ఆ సినిమా చేసిన తర్వాత ఇద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయాం. ‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ నుంచి ఓ మంచి గుణం నేర్చుకున్నా. సహనంగా ఎలా ఉండాలనేది తనను చూసే అలవర్చుకున్నా. డార్లింగ్‌ ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా తన సహనాన్ని కోల్పోడు. ఈ సినిమాకు ముందు ప్రభాస్‌కు ‘డార్లింగ్‌’, ‘మిర్చి’ రూపంలో సూపర్‌హిట్లు దక్కాయి. ఆ సమయంలో అతని కెరీర్‌ ఫుల్‌ జోరులో ఉంది. కానీ, అలాంటి సమయంలో ‘బాహుబలి’ చిత్రాన్ని ఎంపిక చేసుకుని దాని కోసం తన ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడు. ఎంతో శ్రమించి.. చిత్ర విజయంలో వెన్నుముక అయ్యాడు. ఒక్కసారి ఊహించుకోండి.. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌తో ఆ ఐదేళ్లలో ఎన్ని సినిమా చేసి ఉండొచ్చో.. ఎంత డబ్బు సంపాదించి ఉండొచ్చో. కానీ, ప్రభా ఎన్ని సినిమాలు చేశాం.. ఎంత సంపాదించాం అనే వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వడు. సహనం, అంకిత భావంతో ‘బాహుబలి’ కోసం పని చేశాడు. అది నాకు చాలా బాగా నచ్చింది’’ అని డార్లింగ్‌పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు రానా.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.