అందుకే.. ఆస్తులు అమ్ముకున్నా!
మాటలు... తూటాల్లా పేలితే అవి పూరి జ‘గన్‌’వే
ఓ ఇడియట్‌ హీరో అయితే అదీ ఆయన మార్క్‌
షూటింగ్‌ మొదలైన ఆరునెలల్లో రిలీజ్‌ అయితే అది ఆయన సినిమా!
సినిమా అంతా కట్టె.. కొట్టె... తెచ్చేలా ఉండి... క్లైమాక్స్‌ అదరగొడితే అదీ ఆయన పంథా!... ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకత చాటుకొనే దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఏడ్చేవాళ్లంటేనే తన కిష్టమని కుండ బద్దలు కొడతాడు. మన చుట్టూ హ్యాండిచ్చేవాళ్లే ఉంటారని బల్ల గుద్దీ చెబుతాడు. వర్మలా మనం బతకలేమని మనసులో మాట నిర్మొహమాటంగా బయటపెట్టేస్తాడు. ‘సితార‌’తో పంచుకున్న ఈ భావాల స్క్రీన్‌ప్లే మీరూ చదవండి.

* ఆకాశ్‌లో ఓ యాక్షన్‌ హీరో ఉన్నాడని ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది?
(నవ్వుతూ) వాడేదో చేస్తాడని నాకు చిన్నప్పుడే అర్థమైంది. ‘చిన్న వేషం ఇవ్వు నాన్న’ అంటూ రోజూ బుర్ర తినేసేవాడు. స్కూల్‌ లేకపోతే షూటింగ్‌కి వచ్చేసేవాడు. తన మనసులో సినిమా తప్ప ఏదీ ఉండేది కాదు. ‘చిరుత’లో తొలిసారి నటించాడు. వాటితో పాటు కొన్ని సినిమాలూ చేశాడు. అవన్నీ నాకు బాగా నచ్చాయి. తప్పకుండా హీరో అవుతాడని అనిపిస్తూనే ఉండేది.

* బయటి దర్శకులతో అరంగేట్రం చేయిస్తే బాగుండేదనిపించలేదా?
చాలా మంది ‘మా అబ్బాయిని మీరే లాంచ్‌ చేయాలి’ అని అడుగుతున్నప్పుడు నేను వేరేవాళ్ల చేతుల్లో పెడితే బాగోదు కదా?. అబ్బాయిల్ని హీరోలు చేయాలంటే మామూలు విషయం కాదు. డబ్బులు ఖర్చు పెట్టాలి, బుర్ర వాడాలి, ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీయాలి, ఇలాంటి చాలా రిస్కులు చేయాల్సి ఉంటుంది.

* ‘ఈ సినిమాతో మా నాన్నని నేను లాంచ్‌ చేస్తున్నా’ అని ఆకాశ్‌ అంటున్నాడు.. మీ స్పందనేంటి?
ఓ రకంగా అదీ నిజమే. నేనిప్పటి వరకూ 35 సినిమాలు చేసుండొచ్చు. వాటన్నింటికంటే భిన్నంగా ఉండే సినిమా ‘మెహబూబా’. టేకింగ్‌లోగానీ, పాత్రల్ని చూపించే విధానంలోగానీ ఏ సినిమాతోనూ సంబంధం ఉండదు. చూస్తే ‘ఎవడో కొత్తవాడు తీశాడేమో’ అనిపిస్తుంది.

* ఈ సినిమాకోసం మీరే నిర్మాతగా మారారు. మీ ఆస్తుల్ని అమ్ముకుని ఆకాశ్‌తో సినిమా తీశారని ప్రచారం జరుగుతోంది.. నిజమేనా?
నిజమే. బయటి నిర్మాత అయితే ‘వీడ్ని ఎవడు చూస్తాడు, జనాలు థియేటకి వస్తారా, రారా’ అనే అనుమానాలు ఉంటాయి. మనకి మార్కెట్‌ ఉంటేనే బయటి నిర్మాతలు వస్తారు. అలాంటప్పుడు రిస్కు తీసుకోవడంలో తప్పేముంది? అందుకే నాకున్న ఇళ్లలో ఒకదాన్ని అమ్మేశా. ఆకాశ్‌తో పాటు చిత్రంపై అంత నమ్మకముంది మరీ!

* ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్లే లేరా?
హ్యాండిచ్చేవాళ్లే ఉంటారు. మనకెవరూ ఇక్కడ సహాయం చేయరు. దానికి ఫిక్సయిపోవాలంతే. సినీ పరిశ్రమలోనే కాదు. బయట ఎవరైనా ఎక్కడైనా మనుషులంతా ఇంతే. అలాగని వాళ్లపై కోపాలు, ద్వేషాలూ పెంచుకోకూడదు. ఎవరైనా బాధపెడితే.. ఆ క్షణం బాధ పడతానంతే. దానికి మించి తీసుకోకూడదు. మళ్లీ నా పనుల్లో నేను పడిపోతా.

* ఓ దశలో మీ వెనుక హీరోలు, నిర్మాతల క్యూ.. ఇప్పుడు సీన్‌ మారిందన్న బాధ ఉందా?
ఇది నా జీవితంలోనే జరిగిన విషయం కాదు. అందరికీ ఇది అనుభవమే. ఈ రోజు బిజీగా ఉన్న ప్రతీ ఒక్కడికీ, ఏదో ఓ రోజు ఎవడూ ఫోన్‌ చేయని సందర్భం తప్పకుండా వస్తుంది. పోనీ వాడే ఫోన్‌ చేసినా ‘ఇప్పుడు వీడెందుకు చేశాడు’ అని అవతలివాడు భయపడతాడు.

* పరిశ్రమలోకి వచ్చేటప్పుడు ఉన్న కసి, ఆ ఉత్సాహం ఇప్పుడూ ఉన్నాయా?
ఆ కసి ఎప్పుడూ తగ్గలేదు. నేనెప్పుడూ ఏదో ఓ పని చేస్తూనే ఉంటాను. ఒక్కరోజూ సెలవు తీసుకోలేదు. ఓ రోజు ఖాళీగా, పనిలేకుండా గడిపి పన్నెండేళ్లయ్యింది. ఆఖరికి ఆదివారమూ పని చేస్తా. ఎవరు రాకపోయినా నేనొక్కడినే కూర్చుని ఏదో ఒకటి రాసుకుంటుంటా. రిలాక్స్‌ అవ్వడం అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడు నేనో సినిమా తీస్తున్నానంటే ఆ కథ నాలుగేళ్ల క్రితమే సిద్ధమై ఉండి ఉంటుంది. పదేళ్లకు సరిపడా స్క్రిప్టులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు ఏది తీస్తానో నాకు తెలీదు. అవన్నీ తీస్తానా, లేదా అని కూడా తెలీదు. ఎవరైనా కథ ఓకే చేస్తే.. రేపు షూటింగ్‌ మొదలెట్టమన్నా నేను రెడీనే.

* టెక్నాలజీలో అప్‌డేట్‌గా ఉంటారా?
నాకు గ్యాడ్జెట్లు అంటే బాగా ఇష్టం. టెక్నాలజీ ఎలా మారుతుందో గమనిస్తుంటా. యూకే, యూఎస్‌లో కొత్త గాడ్జెట్‌ ఏంటి? ఎక్కడ ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు? కొత్త పాటలు ఎలాంటివి వచ్చాయి.. ఇవన్నీ చెక్‌ చేస్తుంటా. సంగీతం అంటే చాలా ఇష్టం. పాటలు వినకుండా ఒక్క రోజు పడుకోలేదు.

* పక్షులు, కుక్కపిల్లలు పెంచుతుంటారు కదా? అంత అనుబంధం ఏమిటి?
సెన్సిటివ్‌గా ఉన్నవాళ్లే కుక్కపిల్లల్ని పెంచుకుంటారు. అవిచ్చే రిలీఫ్‌ మనుషులు ఇవ్వరు. కొన్ని ఆరోగ్యం బాగోక చచ్చిపోతుంటాయి. ఒకట్రెండు రోజులు బాధపడతా.. మూడో రోజు మరో కొత్త జీవిని తీసుకొచ్చి పెంచుకుంటా. పక్షులూ అంతేనేమో. నేను పోతే.. అవీ మర్చిపోతాయి (నవ్వుతూ). ఉన్నన్నాళ్లూ వాటితో ఆడుకోవడం సరదాగా ఉంటుంది.

* ఈ బిజీలో చదివే తీరిక దొరుకుతుందా?
పుస్తకాలు చడవడం, సినిమాలు చూడడం తగ్గిపోయింది. ఇంటర్‌నెట్‌ బ్రౌజింగ్‌ ఎక్కువైంది. నాకు టైమ్‌ పాస్‌ అంటే.. టామ్‌ అండ్‌ జర్రీ వీడియోలు చూడ్డమే. రెండు నిమిషాలు ఖాళీగా ఉంటే.. ఒక్క వీడియో అయినా చూసి నవ్వుకుంటా.

* మిమ్మల్ని ప్రభావితం చేసిందెవరు?
శ్రీశ్రీ, చలం, రంగనాయకమ్మ, రజనీష్‌, మణిరత్నం, వర్మ, బాలచందర్‌.. వీళ్ల ప్రభావం నాపై చాలా ఎక్కువ. వాళ్ల నుంచి ఇప్పటికీ ఏదో ఒకటి నేర్చుకుంటా. వీళ్లంతా రెబల్స్‌. అప్పటి వరకూ వచ్చిన ఆలోచనల్ని, సిద్ధాంతాల్ని పక్కన పెట్టి, కొత్త విషయం చెప్పడానికి ప్రయత్నించారు. అవన్నీ కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. మనం నేర్చుకోవడం మొదలెడతాం.

* ఎవరి జీవితాన్నయినా చూసి ఈర్ష్య పడ్డారా? కనీసం ‘ఇలా బతికితే బాగుండును’ అనిపించిందా?
ఎవరి జీవితం వాళ్లది. ఒకొక్కరూ ఒక్కో రకం. నేను మరో రకం. నేను నాలా బతకడంలోనే కిక్‌ ఉంటుంది. మరోకరిలా ఉండాలనుకోవడం, ఒకరిని చూసి ఈర్ష్య పడడం నా ఫిలాసఫీ కాదు. నేను చూసి షాక్‌ తిన్న వ్యక్తి.. ఆర్జీవీ మాత్రమే. అది ఎవరికీ అర్థం కాని, అర్థం చేసుకోలేని రకం.

* రిటైర్‌మెంట్‌ ఆలోచనలేమైనా ఉన్నాయా?
సినిమాలు ఆపాలని లేదు. సమయం దొరికితే ఎక్కువగా ప్రయాణం చేయాలనుంటుంది. ప్రతీ దేశానికీ వెళ్లాలి. అక్కడి సంస్కృతులు తెలుసుకోవాలి. రుచులు ఆస్వాదించాలి. అక్కడి సంగీతం వినాలి.. ఇదే నా ఆశ. సినిమాలతో పనిలేకుండా.. ప్రపంచం చుట్టి రావాలి.

* డ్రీమ్‌ హౌస్‌ లాంటి ఆలోచనలేమైనా ఉన్నాయా?
నాకు ప్రకృతి అంటే ఇష్టం. మొక్కలు పెంచడం అంటే మరీ ఇష్టం. ఎప్పుడైనా ఫామ్‌ హౌస్‌ కట్టుకుంటానేమో. అయితే ఏ ఇల్లూ లేకుండా ఉంటే ఇంకా నయం. అప్పుడు ప్రపంచమే మన ఇల్లు అయిపోతుంది. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే గుర్ఖాలా కాపాలా కాయాలంతే (నవ్వుతూ)!

* మీ జీవితం మళ్లీ జీరో నుంచి మొదలైతే..?
నేనెప్పుడూ సున్నా నుంచి లెక్కపెట్టడానికి సిద్ధమే. అలా ఉండాలి కూడా. ఆకాశ్‌కి అప్పుడు పదేళ్లనుకుంటా. ఓసారి ‘డాడీ.. నాకో కారు కొనిపెట్టు’ అన్నాడు. ఎందుకు? అని అడిగాను. ‘నా సొంతకార్లో నేను తిరగాలని వుంది’ అన్నాడు. ‘విలాస వంతమైన జీవితం కోసం ముందే సిద్ధపడాల్సిన అవసరం లేదు. రోడ్డుపై పడుకోవడం ఎలాగో నేర్చుకో. తిండి లేకుండా ఓ పూట గడపడం ఎలాగో తెలుసుకో. ముందు వాటికి సిద్ధపడు. అప్పుడే నీకు జీవితం అర్థమవుతుంది’ అని చెప్పాను. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. తెల్లారుజామున లేచి చూస్తే.. అప్పటికీ ఏడుస్తూ కనిపించాడు. నాకు ఏడ్చేవాళ్లంటే ఇష్టం. అప్పుడే మనం బాగా స్ట్రాంగ్‌ అవుతాం. అప్పుడే మన విలువేంటో మనకు తెలుస్తుంది.

* అలా మీరూ ఏడ్చిన సందర్భాలున్నాయా?
నమ్మిన మనుషులు మోసం చేసినప్పుడు ఏడ్చా..

* మరి మీ పిల్లలకు విలాసవంతమైన జీవితాన్ని అలవాటు చేయలేదా?
చేశాను. అలాగని వాళ్లకు కష్టం తెలియకుండా లేదు. ఆకాష్‌ నా దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తే... వాడ్ని అలానే చూస్తా. సెట్లో నా దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం చేయనివ్వను. సహాయ దర్శకులంతా ట్రైన్‌లో వస్తే.. వాడ్నీ అలానే రమ్మంటా. ఎప్పుడు ఎలా ఉండాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలు మా పిల్లలకు మా ఆవిడే నేర్పించింది. ఇప్పటికీ నా పిల్లలు అణిగిమణిగి ఉన్నారంటే కారణం తనే. నేనెప్పుడూ నా పిల్లల్ని ‘చూ.. చూ.. కన్నా..’ అని గారాభం చేయను. ఐలవ్‌ యూ చెప్పను. ఫ్రెండ్లీగా ఉంటానంతే. చాలా ఓపెన్‌గా ఉంటాను. ముద్దు చేస్తే నాటకాలు ఆడేస్తారు. (నవ్వుతూ)

* మీ అమ్మాయికీ సినిమాలంటే ఇష్టముందా?
తను ఎంబీఏ చేస్తోంది. సినిమాలంటే ఇష్టం. అప్పుడప్పుడూ సెట్‌కి వస్తుంటుంది. పైసా వసూల్‌ సమయంలో ప్రొడక్షన్‌ వ్యవహారాలు తనూ చూసుకుంది.

‘జనగణమన’ ఎప్పటికైనా తీస్తా
నిర్భయ, అసిఫాలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరిలానే నేనూ మధనపడిపోతుంటా. నిజంగా దేశంలో ఎవరికీ భయం లేకుండా పోయింది. వేరే దేశాల్లో ఇలాంటి పనులు చేస్తే తలలు తీస్తారు. ఇక్కడ అలాంటివి లేవు. ఈ ఆవేదనలోంచి ఓ కథ పుట్టింది. అదే ‘జనగణమన’. మన భారతదేశం ఎలా ఉండాలి? అని నేను అనుకుంటున్నానో ఆ సినిమాలో చూపిస్తా. చాలా ఇష్టమైన కథ ఇది. ఎప్పటికైనా సినిమాగా తీస్తా.

నేను వాళ్లు చెప్పిందే ఫాలో అవుతా
రంగనాయకమ్మ రాసిన ‘రామాయణ విష వృక్షం’ నా చిన్నప్పుడెప్పుడో చదివేశా. అందులో ఆవిడ చెప్పిందే కరెక్ట్‌ అనిపించింది. సమాజంలో వందమంది ఉంటే, అందులో పదిమందే మేధావులు. మిగిలిన తొంభై మంది యావరేజ్‌, బిలో యావరేజ్‌. మనం ఈ తొంభైమంది చెప్పిందే నిజం అనుకుంటాం. అదే భ్రమల్లో ఉంటాం. వాస్తవానికి ఆ పదిమంది మేధావులు ఏం చెబుతున్నారో అదే నిజం. నేనైతే వాళ్లు చెప్పిందే ఫాలో అవుతా.

ఆయనుంటే బాగుండు
ప్రస్తుతం చిత్రసీమకు మార్గదర్శనం చేయడానికి దాసరి గారుంటే బాగుండును అనిపిస్తుంది. ఇన్ని గొడవలు జరిగేవి కావు. ఆయన జరగనిచ్చేవారు కాదు. అందరినీ పిలిచి మాట్లాడేవారు. ఆ లోటు లోటే. అలాంటి మనిషి పుట్టరు, రారు. నాయకత్వం అనేది ఒకరు ఇచ్చేది కాదు. తీసుకోవాలి. అందరినీ ముందుండి నడిపించాలి. ఆ లక్షణాలు దాసరిగారిలో ఉండేవి. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. ‘నా వారసుడు పూరినే’ అని ఓ సందర్భంలో ఆయన అన్న మాట నాకు దొరికిన గొప్ప కాంప్లిమెంట్‌గా భావిస్తాను.

ఇష్టమైన పని చేస్తున్నామా?
ఇది వరకు డబ్బు విలువ తెలిసేది కాదు. ఇప్పుడు కాస్త తెలివి వచ్చింది. జాగ్రత్త పెడదాం, దాచుకుందాం అనుకుంటున్నా. ఎంత దాచుకున్నా మళ్లీ సినిమాల్లోనే పెట్టాలి కదా. నా దృష్టిలో డబ్బు, పేరు కంటే ముఖ్యమైన విషయం మరోటుంది. ఇష్టమైన పనిలో ఉన్నామా, లేదా? అనేదే ప్రధానం. నీకిష్టమైన పని చేయి.. రూపాయి రావొచ్చు, కోటి రూపాయలు సంపాదించొచ్చు. ఎంత? అనేది తరువాతి విషయం. ప్రతీ రోజూ నీకిష్టమైన పనే చేస్తున్నావా, లేదా? అనేదే సక్సెస్‌. అంతకు మించిన విజయం మరోటి లేదు.

ఇదో పునర్జన్మ కథ
ఈమధ్య నా సినిమాలు సరిగా ఆడడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకూ ఓ హిట్టు కావాలి. రచయితగా, దర్శకుడిగా మార్పు చూపించాలనిపించింది. అయితే ఇది తెచ్చి పెట్టుకున్న మార్పు కాదు. అలా జరిగిపోయింది. ‘మెహబూబా’ ఓ పునర్జన్మ కథ. యుద్ధ నేపథ్యంలో సాగే సినిమా. గ్రాఫిక్స్‌కీ చోటుంది. ఇలాంటి జోనర్‌లో నేనెప్పుడూ సినిమా చేయలేదు. అందుకే నాకే కొత్తగా అనిపించింది.

- మహమ్మద్‌ అన్వర్‌
ఫొటోలు: జయకృష్ణ
సంబంధిత వ్యాసాలు


© Sitara 2018.
Powered by WinRace Technologies.