పావుగంటకే ప్రేక్షకులు.. ఆ మన్మథుడిని మర్చిపోతారు!
నటన నుంచి దర్శకత్వం వైపు అడుగులు వేసి, తొలి చిత్రంతోనే ఓ మంచి విజయాన్ని అందుకున్నారు రాహుల్‌ రవీంద్రన్‌. ‘చిలసౌ’ తనలోని దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది. ఆ విజయమే... నాగార్జునతో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అదే... ‘మన్మథుడు 2’. శుక్రవారం ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా ఈ నట దర్శకుడు చెప్పిన ‘మన్మథుడు’ కబుర్లు..


* రెండో చిత్రానికే నాగార్జున లాంటి అగ్ర కథానాయకుడి చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ అవకాశాన్ని ఊహించారా?
- ఏమాత్రం ఊహించలేదు. ‘చిలసౌ’ విడుదలకు ముందే నాగార్జున గారు నన్ను పిలిచారు. ‘చిలసౌ’ బాగుందనీ, అందులో భావోద్వేగభరితమైన సన్నివేశాల్ని బాగా తెరకెక్కించానని మెచ్చుకున్నారు. తన దగ్గర ఓ ఫ్రెంచ్‌ చిత్రముందని, దాన్ని రీమేక్‌ చేయమని అడిగారు. ఆయనే హీరో అనేసరికి ఆనందం, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి.


* రీమేక్‌ అనగానే ముందు వెనకడుగు వేశారట..?
- చాలా రీమేకులు ఫ్రీమేకులుగా ఉంటాయి. అధికారికంగా హక్కులు కొనుక్కుని రీమేకులు చేయడం చాలా అరుదు. ఇది కూడా అలానే అనుకున్నా. అందుకే కాస్త వెనుకడుగు వేశా. కానీ అన్నపూర్ణ సంస్థ అన్ని విషయాల్లోనూ పక్కాగా ఉంటుంది. ఆ కథ నచ్చి, హక్కుల్ని కొనుగోలు చేశారు. కాబట్టి ధైర్యం వచ్చింది.


* పదిహేడేళ్ల క్రితం వచ్చిన ‘మన్మథుడు’ కుటుంబ ప్రేక్షకులకు చాలా చేరువైంది. ఇప్పటికీ ఆ చిత్రాన్ని అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. ‘మన్మథుడు 2’ అనగానే ఆ సినిమాని దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్న భయం వేయలేదా?

సినిమా మొదలైన పావుగంటకు ప్రేక్షకులంతా పాత మన్మథుడిని మర్చిపోయి మేం చెబుతున్న కథలోకి వెళ్లిపోతారు. ‘మన్మథుడు 2’ అనేది ఈ కథకు సరైన టైటిల్‌. నిజానికి ‘మన్మథుడు’ అంటే నాకు చాలా ఇష్టం. ‘మన్మథుడు’ని మించిపోయే సినిమా చేస్తున్నా అని చెప్పడం లేదు. ఆ పేరుని మాత్రం పాడు చేయడం లేదు.


* ‘మన్మథుడు’ విజయంలో పంచ్‌ డైలాగులు, వినోదం చాలా కీలకపాత్ర పోషించాయి. మరి మీ సినిమాలో అవి ఏ స్థాయిలో ఉన్నాయి?
- తొలి సన్నివేశం నుంచి క్లైమాక్స్‌ వరకూ హాయిగా నవ్వించే చిత్రమిది. ‘చిలసౌ’లో కామెడీ కేవలం 20 శాతమే ఉంటుంది. 80 శాతం భావోద్వేగాలు కనిపిస్తాయి. ఇక్కడ అలా కాదు. 80 శాతం కామెడీ ఉంటుంది. 20 శాతం మాత్రమే ఫీల్‌ గుడ్‌ సన్నివేశాలుంటాయి.


* నటన నుంచి దర్శకత్వం వైపు వచ్చారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు ‘నేనూ ఓ పాత్ర పోషిస్తే బాగుంటుంది కదా’ అనిపించలేదా?

ఒక్కసారి కూడా అనుకోలేదు. నన్ను తెరపై చూస్తే.. ప్రేక్షకుడి మూడ్‌ పాడవుతుంది. ‘ఇతనే కదా ఈ సినిమా దర్శకుడు’ అనుకుంటే.. అప్పటి వరకూ కాపాడుకుంటూ వచ్చిన ఓ అనుభూతి గాడి తప్పుతుందని నా భయం.


* నటన, దర్శకత్వం రెండు ఉద్యోగాలూ ఎలా అనిపిస్తున్నాయి?
నటుడిగా ఉన్నప్పుడు దర్శకుడు చెప్పింది చేసేవాడ్ని. ఇప్పుడు అలా కాదు. రేపు షూటింగ్‌ అంటే ఈ రోజు నిద్ర పట్టదు. ‘రేపు ఈ సీన్‌ ఎలా చేయాలి’ అనే ఆలోచనలతో రాత్రంతా పక్కమీద దొర్లుతూనే ఉంటా.


* ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నారు?
- ఒకే తరహా జోనర్‌లో కథలు చెప్పకూడదు. రొమాంటిక్‌ కామెడీ కథలకు కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతం నా దగ్గర ఏడెనిమిది కథలున్నాయి. ‘మన్మథుడు 2’ హంగామా పూర్తయ్యాక నెల రోజులు ఎక్కడికైనా వెళ్లాలి. అప్పుడు ఆలోచిస్తా. ఎలాంటి కథ చేయాలో.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.