శివగామిగా ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి రమ్యకృష్ణ. ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇందులో నాగచైతన్యకు అత్తగా శైలజారెడ్డి అనే మరో పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షకుల మెప్పించారు. శనివారం రమ్యకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘శైలజారెడ్డి అల్లుడు’ గురించి.. తన పాత్ర గురించి అనేక ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
* ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు కానుకగా ‘శైలజారెడ్డి అల్లుడు’ మంచి విజయాన్ని అందుకోవడం ఎలా ఉంది?
రమ్య: ఈ పుట్టినరోజుకి ఓ మంచి చిత్రం సూపర్ హిట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం కోసం ప్రతిఒక్కరూ చాలా కష్టపడ్డారు. వారందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు.
* ‘శైలజారెడ్డి అల్లుడు’ చూసిన వారంతా మీ పాత్ర గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈ స్పందన చూస్తుంటే మీకెలా అనిపిస్తోంది?
రమ్య: శైలజారెడ్డి పాత్రలోనే ఓ వైవిధ్యం ఉంది. ఓవైపు ఊరిలో ఆడవాళ్లకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడే ధీరత్వం.. మరోవైపు తల్లిగా కూతురు మీద ప్రేమ.. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం.. ఇన్ని ఉన్నాయి ఆ పాత్రలో. మారుతిగారు ఈ పాత్రని మలిచిన విధానం చాలా బాగుంది. సినిమాల్లో వచ్చే రెగ్యులర్ అత్త పాత్రలా ఉండదు. మీరు ఎప్పుడూ చూస్తున్న అత్త అల్లుళ్ల మధ్య కామెడి కూడా ఇందులో కనిపించదు. చూసిన వారికి, చూసేవారికి స్వీట్ సర్ప్రైజ్లా ఉంటుంది.
* సినిమాలో అత్తకి ఇగోనే, కూతురుకి ఇగోనే.. పాపం వీరిద్దరి మధ్య నలిగిన అల్లుడును చూస్తే మీకు జాలి వేయలేదా..?
రమ్య: నిజమే (నవ్వుతూ) వేసింది. అత్తగా నాకు ఇగో ఉంది. నా కూతురికి ఇగో ఉంది. ఇక్కడి వరకూ నేనూ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నాకులాంటి పాత్ర నాకొకటి తోడుగా ఉంది. కానీ చైతన్యకి ఆ ఛాన్సు లేదు. దీంతో ఆయనకు ఫుల్ టెన్షన్ ఉండేది (నవ్వుతూ). అయితే ఈ వ్యక్తిత్వాలన్నీ వినోదాన్ని పంచాయి. మా ముగ్గురి మధ్యలో నరేష్, మాణిక్యంగా పృథ్వీ, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ కామెడిగా ఉంటాయి. కొన్నిసార్లు షూట్ ఆపేసి కూడా నవ్వుకునే వాళ్లం. నేను చాలా బాగా ఎంజాయ్ చేశా.
* మీరు నాగార్జునతో చేశారు.. ఇప్పుడు నాగచైతన్యకు అత్తగా చేశారు. ఎలా అనిపించింది?
రమ్య: నాకు చాలా ఆనందంగా ఉంది. నాగచైతన్య చాలా సింపుల్‌గా ఉంటాడు. నటనలో చాలా పరిణతి సాధించాడు. ముఖ్యంగా సినిమాలో నన్ను, అనుని కన్విన్స్ చేసే సన్నివేశంలో అద్భుతమైన నటనను కనబర్చాడు. చాలా మంచి నటుడు అతను.
* మీరు సీరియస్ పాత్ర ఎలా చేస్తారో.. అంతే చక్కగా కామెడి కూడా చేస్తారు. అంత ఈజ్ ఎలా వస్తుంది మీకు?
రమ్య: నటి అంటే అన్ని చేయాలి. సహ నటులు బాగా ఉంటే కామెడి చాలా బాగా వస్తుంది. అది కూడా చాలా సందర్భోచితం, సహజంగా ఉంటుంది. నేను వినోదం బాగా పండించింది ‘పంచతంత్రం’.. ఆ తర్వాత ‘శైలజారెడ్డి అల్లుడు’లోనే. నా చుట్టూ ఉన్న పాత్రల వల్ల వినోదం పుడుతూ ఉంటుంది. కానీ, నేను సీరియస్‌గా ఉండాలి. ఇది నాకు చాలా కఠినంగా అనిపించేది.
* ‘బాహుబలి’ చిత్రం తర్వాత కొంచెం విరామం తీసుకొని ఇలా అత్తగా కనిపించారు. మళ్లీ ఇలాంటి పాత్రలొస్తే చేస్తారా?
రమ్య: నేను చేసిన వైవిధ్యభరితమైన పాత్రలన్నీ నన్ను నటిగా నిలబెట్టాయి. కాబట్టి ఇలాంటి విభిన్నమైన పాత్రలు మళ్లీ వస్తే తప్పకుండా చేస్తాను.
* సినిమాటోగ్రాఫర్, నిర్మాతల గురించి..?
రమ్య: సినిమా చూసి అందరూ చాలా అందంగా కనిపించారని మెచ్చుకుంటున్నారు. దీనంతటికీ కారణం సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫినే. మారుతి వర్క్ స్పీడ్‌కు తగ్గట్లుగా పరుగెత్తి షూట్ చేసేవాడు. ఇలాంటి గొప్ప వ్యక్తులతో పనిచేయడం సంతోషాన్నిస్తోంది. అలాగే దర్శకుడ్ని, నటీనటులను నమ్మి ఇలాంటి సినిమాలు చేసే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. నిజంగా మా నిర్మాతలంతా సినిమాపై ఎంతో ఫ్యాషన్‌తో పనిచేశారు. వారందరికీ నా తరపున అభినందనలు. ‘శైలజారెడ్డి అల్లుడు’ను ఆదరిస్తున్న సినీప్రియులందరికీ మా ధన్యవాదాలు.