రోజుకు మూడు గంటలే నిద్ర!
అందంగా కనిపించే కథానాయికలు కొంతమంది. అభినయంలో దిట్ట అనిపించుకొనేవాళ్లు కొంతమంది. ఆ రెండూ కలగలిసినవాళ్లూ కనిపిస్తుంటారు. అందులో ఒకరు రెజీనా. కెరీర్‌ తొలి నుంచీ మొన్నటి ‘అ!’ వరకు గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఇటీవల అడివి శేష్‌తో కలిసి ‘ఎవరు’లో నటించారు. పీవీపీ సినిమా పతాకంపై రామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రెజీనా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...


‘ఎవరు’ కథ విన్నాక మీకొచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటి?

దర్శకుడు రామ్‌జీ, కథానాయకుడు శేష్‌ వచ్చి కథ చెప్పారు. వింటున్నప్పుడే నేను చేయబోయే సమీర పాత్రకి సంబంధించి కొన్ని దృశ్యాలు కళ్ల ముందు మెదిలాయి.

ఈ పాత్ర మీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు?
ఒక కథ కానీ, పాత్ర గురించి కానీ విన్నాక ‘దీనికి ఒక నటిగా నేనేం ఇవ్వగలను’ అనేదే ఆలోచిస్తా. అది నా కెరీర్‌కి ఎంత మేలు చేస్తుంది? ఎలాంటి ప్రభావం చూపిస్తుందని ఆలోచించను. ‘అ!’ కోసమూ అలాగే కష్టపడ్డా. దానికి జాతీయ పురస్కారాలొచ్చాయి.

అగ్ర హీరోల సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు అందుకోలేకపోయారేంటి?
ఏడేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా. ఏం జరిగిందో, ఎక్కడ తప్పులు దొర్లాయో ఇంకా అర్థం కాలేదు. నా వాళ్లెవరూ ఇక్కడ లేరు. అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. కొంతమంది ఇలా చేయాలి, అలా చేయకూడదని చెప్పారు కానీ... నేను మాత్రం నా అనుభవం ప్రకారమే నిర్ణయాలు తీసుకొన్నా. నా తప్పులు, నా పరాజయాలు నన్ను నేను మరింత బాగా అర్థం చేసుకోవడానికి దోహదం చేశాయి.


మీ తొలి హిందీ చిత్రం ‘ఏక్‌ లడ్‌కీ కో దేఖా తో..’లో స్వలింగ సంపర్కురాలిగా నటించారు. దానికి ఎలాంటి స్పందన వచ్చింది?

ఆ సినిమాకు పిలుపొచ్చాక చేయాలా వద్దా? అని చాలా ఆలోచించా. ‘ఏక్‌ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా’లో నా పాత్రని చూసి చాలామంది కమర్షియల్‌ కథానాయిక అయినా, ఇలాంటి పాత్రలు చేయడం బాగుందని మెచ్చుకున్నారు.

‘అ!’కి జాతీయ పురస్కారాలు వచ్చాయని తెలిశాక మీ అనుభూతేంటి?
ఆ విషయం గురించి నాని నాకు మెసేజ్‌ చేశారు. మేకప్‌కి జాతీయ పురస్కారం వచ్చింది, అందుకు నువ్వొక ప్రధాన కారణం అని అందులో రాశారు. అది చూశాక నాకు చాలా ఆనందం కలిగింది. ‘అ!’కి మేకప్‌ వేసుకోవడానికి నాకు 24 గంటలు పట్టేది. రోజులో 2, 3 గంటలే నిద్రపోయేదాన్ని. అంత కష్టపడి చేసిన సినిమా అది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.