ట్రైలర్‌ కోసమే 137 కట్స్‌.. 80 లేయర్ల లైవ్‌ మ్యూజిక్‌!!
‘‘జేమ్స్‌ బాండ్‌ సినిమాల స్ఫూర్తితో ‘సాహో’ చేయలేదు కానీ మన తెరపై ఇప్పటివరకు చూడని సన్నివేశాల్ని ఇందులో చూపించడానికి ప్రయత్నించాం’’ అన్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ నాయిక. సుజీత్‌ దర్శకత్వం వహించారు. చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం ముంబయిలో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రభాస్, శ్రద్ధాకపూర్‌ చిత్రం గురించి పలు విషయాల్ని వెల్లడించారు.


* ‘సాహో’ చిత్రాన్ని ఇంత భారీ స్థాయిలో తీయాలనే ఆలోచనకి ఎప్పుడు బీజం పడింది?
- సుజీత్‌ మాకు ‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలకి ముందే ఈ కథ చెప్పాడు. ‘బాహుబలి’ కథ మాకు ఎప్పట్నుంచో తెలుసు కాబట్టి, దాని స్థాయి ఎలా ఉంటుందో ఊహించాం. అయితే ఇంత స్పందన వస్తుందని మాత్రం తెలియదు. ‘బాహుబలి’ని ప్రేక్షకులు ఎక్కడెక్కడ స్వీకరిస్తారో అక్కడ ‘సాహో’ని విడుదల చేయాలని మా నిర్మాతలు వంశీ, విక్కీ, ప్రమోద్‌ అప్పుడే నిర్ణయించారు. ‘బాహుబలి’ విడుదలైన తర్వాత ‘సాహో’ లుక్, స్థాయి మరింత పెద్దగా ఉండాలనే నిర్ణయానికొచ్చాం. యువీ క్రియేషన్స్‌ ఎప్పుడు ఏది చేసినా అది డబుల్‌ అవుతుంది. అలా ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది.

* దర్శకుడు సుజీత్‌పైన ‘బాహుబలి’ ప్రభావం ఎంతవరకు ఉంది? దానివల్ల ఆయనేమైనా ఒత్తిడికి గురయ్యారా?
- మా అందరిపైనా ‘బాహుబలి’ సినిమాల ప్రభావం ఉంటుంది. ‘బాహుబలి’ కంటే పెద్ద కథ కష్టమే. కానీ ఇది స్క్రీన్‌ప్లే ప్రధానమైన సినిమా. మరింత నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఇంత సమయం తీసుకొన్నాం. సుజీత్‌ వయసుతో పోలిస్తే, తను ఈ సినిమాని చేసిన విధానం చూసి ఆశ్చర్యం వేసింది. మన దేశంలోని గొప్ప సాంకేతిక నిపుణులతో పాటు హాలీవుడ్, చైనా నుంచి నిపుణులు వచ్చి ఈ సినిమాకి పనిచేశారు. సెట్‌లో మేము అయినా ఒత్తిడికి గురయ్యాం కానీ...సుజీత్‌ ఒక్కసారి కూడా కోపంగా ఉండటం చూడలేదు.

* సుజిత్‌ ఈ స్థాయిలో సినిమా తీయగలడనే విశ్వాసం మీకు ఎప్పుడు కలిగింది?
- తొలి రోజే క్లిష్టతరమైన సన్నివేశాన్ని మొదలుపెట్టాం. ఒకే ఒక్క సన్నివేశంలో ఐదు కోణాలుంటాయి. సినిమాలో అదే సన్నివేశం ఐదారుసార్లు వస్తుంది. నటుడి కోణంలోనూ, దర్శకుడు కోణంలోనూ చాలా క్లిష్టమైంది అది. దానితోనే చిత్రీకరణ మొదలుపెట్టాం. రీషూట్‌ చేయకుండా, చిన్న మార్పు లేకుండా తీసిన విధానం చూసి సుజీత్‌పై ఆ రోజే ఓ నిర్ణయానికొచ్చా.


* ట్రైలర్‌లో సిక్సర్‌ గురించి సంభాషణ చెప్పారు. మీరు ఎప్పుడైనా సిక్సర్‌ కొట్టారా? ట్రైలర్‌కి ఎలాంటి స్పందన లభించింది?
- నేను బ్యాటింగ్‌కి దిగితే లాగి కొట్టడమే తెలుసు. అది తగిలిందంటే సిక్సరే (నవ్వుతూ). ‘సాహో’ ట్రైలర్‌ అందరూ బాగుందన్నారు. చిరంజీవిగారు సందేశం పంపించారు. నేను ఫోన్‌ చేసి మాట్లాడాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. రాజమౌళికి కూడా ట్రైలర్‌ బాగా నచ్చింది. ట్రైలర్‌ కోసం 137 సన్నివేశాలు కట్‌ చేశారు సుజిత్, సహాయ దర్శకుడు నిఖిల్‌. థియేటర్‌లో చూసినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇలా ట్రైలర్‌ కట్‌ చేయడం ఎంత కష్టమో సినిమా చూశాక ప్రేక్షకులకి బాగా అర్థమవుతుంది. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. టీజర్‌ కోసమే 80 లేయర్ల లైవ్‌ మ్యూజిక్‌ చేయించాడు. అందుకే అందులో అంత సౌండ్‌ వినిపిస్తుంటుంది.

* హిందీలో మీరే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొన్నారట కదా. ఆ విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
- నాకు హిందీ చదవడం, రాయడం వచ్చు. ఇంట్లో మాట్లాడను కానీ, హైదరాబాద్‌ స్నేహితులు కలిసినప్పుడు మాట్లాడుతుంటా. సినిమాలో యూపీ హిందీనే వినిపిస్తుంటుంది. అందుకే త, థ అని పలకడం దగ్గర కొంచెం కష్టమైంది కానీ మేనేజ్‌ చేశా.

* బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయానికి గట్టి పోటీనిస్తున్నారు. అక్కడ ‘సాహో’పై ఎలాంటి అంచనాలున్నాయి?
- ఖాన్‌ త్రయం చేసిన సినిమాలు దేశవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చాయి. వాళ్లతో మనం పోటీ అనుకోకూడదు. అయితే ‘బాహుబలి’ని బాలీవుడ్‌లో అందరూ బాగా స్వీకరించారు. ‘బాహుబలి ది బిగినింగ్‌’ తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు అగ్ర కథానాయకులు చాలామంది సందేశాలు పంపించారు. అక్కడి మీడియా కూడా చాలా బాగా స్వీకరించింది. ఆ విషయంలో వాళ్లకి కృతజ్ఞతలు.

* యాక్షన్‌ ప్రధానంగా సాగే కథలు హాలీవుడ్‌తో పాటు పలు భాషల నుంచి వస్తుంటాయి. వాటితో పోలిస్తే ‘సాహో’ ప్రత్యేకత ఏంటి?
- కొత్త రకమైన యాక్షన్‌ని ప్రయత్నించాం. ట్రైలర్‌లో ట్రక్‌ కనిపించే సన్నివేశంలో...ట్రక్‌ నిజంగానే అంత వేగంతో వస్తుంటుంది. దాన్ని నడపడం కోసం విదేశాల నుంచి నిపుణుల్ని పిలిపించాం. ఆశ్చర్యానికి గురిచేసే యాక్షన్‌ ఘట్టాలు చాలానే ఉంటాయి. సాంకేతిక బృందం వందల స్టోరీ బోర్డులు తయారు చేసుకొని, ఆరేడు నెలలు సన్నద్ధమయ్యాకే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించాం. గన్‌ ఫైట్లు, ఛేజింగ్‌లు కొత్తగా ఉంటాయి. స్క్రీన్‌ప్లే కూడా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

* శ్రద్ధాకపూర్‌ తొలిసారి తెలుగులో నటించింది. ఆమె పనితీరుపై మీ అభిప్రాయం?
- తొలి రోజు నుంచే తెలుగు మాట్లాడటం బాగా నేర్చుకుంది శ్రద్ధ. ఆమె మాటలు విని నేనూ దర్శకుడు ఆశ్చర్యపోయాం. శ్రద్ధ ఎక్కువగా ప్రేమకథలు చేసింది. ఇందులోనూ అందమైన ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమాని ఒక యాక్షన్‌ ప్రేమకథ అని కూడా చెప్పొచ్చు. శ్రద్ధ ఇందులో గన్‌ పట్టి యాక్షన్‌ చేయడంతో ఈ సినిమా గురించి బాలీవుడ్‌ వర్గాలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. శ్రద్ధ కనిపించిన విధానంలో గాఢత, లుక్‌ సూపర్బ్‌ అనిపించింది.

రెండేళ్ల ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు: శ్రద్ధాకపూర్‌

‘‘తెలుగులో ఇంతకంటే గొప్ప పరిచయ చిత్రాన్ని నేను కోరుకోను. ప్రభాస్‌తో సినిమా, అది కూడా పలు భాషల్లో తెరకెక్కుతున్నది కావడం, ఆసక్తికరమైన ఈ కథ, పాత్ర.. ఇలా అన్నీ నన్ను ఆకట్టుకున్నవే. ఇలాంటి చిత్రంలో ఓ చిన్న భాగమైనా చాలనుకొన్నా. ఇది కొత్త పరిశ్రమ అని ఎప్పుడూ అనిపించలేదు. రోజూ ఇంటి భోజనమే తెప్పించేవారు. ఈ రెండేళ్ల ప్రయాణంలో గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పటిదాకా నేను యాక్షన్‌ ప్రధానమైన సినిమా చేయలేదు. తొలిసారి గన్‌ పట్టాను. గన్‌ పట్టుకోగానే చేతులు వణికేవి. పోలీసు పాత్ర చేశాను కాబట్టి, ఆ పాత్రపైన ఉన్న గౌరవం, ఈ సినిమా ప్రయాణంలో ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో యాక్షన్‌ ఘట్టాలు చేయడం అలవాటైంది. ప్రభాస్‌ అత్యుత్తమ సహనటుడు. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం. సెట్‌లో సుజీత్‌ని వేల ప్రశ్నలు అడిగేదాన్ని. తను అన్నింటికీ సమాధానం చెప్పేవారు’’
‘‘పాన్‌ ఇండియా సినిమా ఇది. ‘సాహో’ కోసమే కొన్ని థియేటర్లు అప్‌డేట్‌ అవుతున్నాయి. దృశ్యం, శబ్ధం పరంగా కొత్త సాంకేతికతతో ముస్తాబవుతున్నాయి. ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’.

- నిర్మాతలు ప్రమోద్, విక్కీCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.