భన్సాలీ సినిమాలంటే ఎంతో ఇష్టం
‘మైఖేల్‌ మదన్‌ కామరాజు’తో కళాదర్శకుడిగా ప్రయాణం మొదలెట్టిన అశోక్‌కుమార్‌ దాదాపు 125 చిత్రాలకు కళాదర్శకుడిగా పనిచేశారు. అరుంధతి, ఒక్కడు, వర్షం, పౌర్ణమి చిత్రాల్లో వేసిన సెట్స్‌ మంచి పేరు తీసుకొచ్చాయి. అయిదు సార్లు నంది అవార్డు అందుకున్నారు. ‘మౌనమే ఇష్టం’ చిత్రంతో దర్శకుడిగా మారారు. రామ్‌కార్తీక్‌, పార్వతి అరుణ్‌ నాయకానాయికలు. ఆశా అశోక్‌ నిర్మాత. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా అశోక్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. 


* 
‘‘ప్రేమకు ప్రేమే ఎలా సమస్యయిందనే అంశం చుట్టూ తిరిగే కథ ఇది. ఓ ప్రేమజంట మధ్య చెలరేగిన సంఘర్షణ నేపథ్యంలో సాగుతుంది. ఈతరంకి నచ్చేలానే ప్రేమ విషయంలో వారి ఆలోచనలను చూపిస్తూ తెరకెక్కించాను. ప్రేమ, అందులోని ఘర్షణ చాలా సహజంగా తెరపై కనిపిస్తుంది. ఆ నమ్మకం, ధైర్యంతో నేనే సినిమాని విడుదల చేస్తున్నాను. మిత్రులు, శ్రేయోభిలాషులైన సురేష్‌బాబు, ఎస్‌.గోపాల్‌రెడ్డికి చిత్రాన్ని చూపించాను. వారు మెచ్చుకున్నారు. ప్రేక్షకులకూ నచ్చుతుందన్న నమ్మకముంది’’. 

* 
‘‘నాకు గుర్తింపుని తెచ్చిన కళాదర్శకత్వానికి వీడ్కోలు చెప్పను. దర్శకత్వం చేయాలనే ఆలోచన పదిహేనేళ్ల కిందటే వచ్చింది. అందుకు కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఇంతకాలం ఆగాను. సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలంటే ఇష్టం. తనలానే సినిమాలు చేయాలన్నది నా ఆశ. కొన్ని కథల్ని సిద్ధం చేసుకున్నాను. ఈ ప్రేమకథకి కొత్తవారైతే బాగుంటుందని వారినే ఎంచుకున్నా. కళాదర్శకుడిగా కొనసాగుతూనే అవకాశం వచ్చినప్పుడు మెగాఫోన్‌ పడతాను’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.