అవకాశం రావడమే గొప్ప!
‘నాకొచ్చిన అవకాశాల పట్ల నేను సంతృప్తిగానే ఉంటున్నా. వచ్చినవి సద్వినియోగపరచుకుంటున్నాననే భావిస్తున్నా. అయితే అగ్ర కథానాయకుల సరసన నటించే అవకాశాలు నాకెందుకు రావడం లేదో అర్థం కావడం లేదం’టోంది ఈషారెబ్బా. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుమంత్‌ కథానాయకుడు. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఈషా విలేకరులతో మాట్లాడింది.


* దేవుడంటే నమ్మకం..
‘‘నాకు థ్రిల్లర్‌ చిత్రాలంటే చాలా ఇష్టం. అలాంటి కథే ‘సుబ్రహ్మణ్యపురం’. నా పాత్ర పేరు ప్రియ. దేవుడంటే నమ్మకం ఎక్కువ. మరోవైపు కథానాయకుడికి దేవుడిపై నమ్మకం ఉండదు. మా ఇద్దరి మధ్య జరిగే వాదోపవాదాలు ఆకట్టుకుంటాయి. గ్రాఫిక్స్‌కి చాలా ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. ఇలాంటి కథలో నటించడం కూడా ఇదే తొలిసారి’’ అని చెప్పింది.

* అలాంటి అవకాశం రావడమే గొప్ప..
తన కెరీర్‌ గురించి మట్లాడుతూ ‘‘అరవింద సమేతలో ఓ చిన్న పాత్ర చేశా. ఆ సినిమాతో నా కెరీర్‌కి ఎలా ఉపయోగపడుతుంది? అనే విషయం నేను ఆలోచించలేదు. ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ల చిత్రంలో అవకాశం రావడమే గొప్ప. పెద్ద సినిమాలో నటించాననే తప్తినీ పొందగలిగాను. అగ్ర కథానాయకులు, భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు ఎందుకు రావడంలేదో నాకూ అర్థం కావడంలేదు. గ్లామర్‌గా కనిపిస్తూనే ‘భాగమతి’లో అనుష్క చేసినట్టుగా విభిన్నమైన పాత్రలు వేయాలనుంది. తెలుగు అమ్మాయిల్లోనూ ఒక మంచి నటి ఉందనిపించుకోవాలనివుంద’’ని చెప్పింది.

* వాళ్లే చెప్పాలి..
రాజమౌళి మల్టీస్టారర్‌లోనూ, ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లోనూ ఈషాకి అవకాశాలు వచ్చాయన్న వార్తలపై స్పందిస్తూ ‘‘ఆ విషయాల గురించి నేను కాదు, చిత్రబృందమే చెప్పాలి. ప్రస్తుతం నాగశౌర్యతో ఓ సినిమాలో నటిస్తున్నా. తమిళంలో జి.వి. ప్రకాష్‌ కుమార్‌తో ఓ సినిమాని ఒప్పుకున్నాను. ఈ నెలాఖరుకి ఆరంభం అవుతుంది. కన్నడలో శివరాజ్‌ కుమార్‌తో చేసే సినిమా ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కుతుంద’’ని చెప్పుకొచ్చింది ఈషా రెబ్బా.


© Sitara 2018.
Powered by WinRace Technologies.