చిట్టిబాబు కోసం సరికొత్త శబ్ద ప్రపంచం

ప్రేక్షకుల మనసులు గెలుచుకొన్న ‘రంగస్థలం’ జాతీయ పురస్కారాల్లోనూ మెరిసింది. ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగానికిగానూ రాజాకృష్ణన్‌కి పురస్కారం దక్కింది. ‘రంగస్థలం’ ప్రయాణం గురించి సౌండ్‌ ఇంజినీర్‌ రాజకృష్ణన్‌ ‘సితార.నెట్‌’ చెప్పిన విషయాలివీ...

మీరు ముందే పురస్కారాన్ని ఊహించారా?
సినిమా బాగా రావాలని ప్రయత్నించాం కానీ పని చేస్తున్నప్పుడు పురస్కారం గురించి ఆలోచనే లేదు. శబ్ద ప్రధానమైన సినిమా ఇది. సుకుమార్‌ రాసిన ఈ కథే అన్ని విభాగాల నుంచి ఉత్తమ పనిని రాబట్టుకొంది. ఇందులో కథానాయకుడు చిట్టిబాబుకి వినబడదు. అతని కోసం మేం శబ్దంతో ఒక ప్రపంచాన్ని సృష్టించాం. అందుకే ఈ పురస్కారం అని నా అభిప్రాయం.


ఈ సినిమా ప్రయాణం కష్టంగా అనిపించిందా?

నా దృష్టిలో కష్టం అనే మాట తప్పు. ఇలాంటి శబ్ద ప్రధానమైన సినిమా వచ్చినప్పుడు పని చేయడానికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. నేను కేరళకి చెందినవాడిని. తెలుగు సినిమాకి జాతీయ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.

శబ్దం పరంగా దక్షిణాది చిత్ర పరిశ్రమ సాధించిన పురోగతిపై మీ అభిప్రాయం?
ఇది వరకు థియేటర్‌ నుంచి బయటికి రాగానే తలనొప్పిగా అనిపించేది. ఇప్పుడు ప్రేక్షకుడు శబ్దాన్ని, దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమ శబ్దం, దృశ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటోంది. తెలుగు సినిమా పరిశ్రమ శబ్దానికి మరింత వెచ్చించడానికి ముందుకొస్తోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.