అందుకే హీరోగా భాస్కర్‌ కరెక్ట్‌ అనిపించింది

కథానాయకుడిగా తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు ‘మీకు మాత్రమే చెప్తా’తో నిర్మాతగా మారారు. తరుణ్‌ భాస్కర్‌ హీరోగా నటించారు. షామీర్‌ సుల్తాన్‌ దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా విడుదల అయింది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ విలేకరులతో మాట్లాడుతూ ‘‘పెళ్లి చూపులు’ తరవాత షామీర్‌ సుల్తాన్‌ని కలిశాను. తను తీసిన లఘు చిత్రాలు చూశాను. తక్కువ బడ్జెట్‌లో నాణ్యతతో తెరకెక్కించిన విధానం నచ్చింది. అందుకే ‘మీతో సినిమా చేస్తా’ అని మాట ఇచ్చాను. ‘అర్జున్‌రెడ్డి’ కంటే ముందు ఈ కథ విన్నాను. బాగా నచ్చి సినిమా చేద్దామనుకున్నా. కానీ ‘అర్జున్‌రెడ్డి’ విడుదలయ్యాక పరిస్థితులు మారాయి. అందుకే తరుణ్‌ భాస్కర్‌ని హీరోగా ఎంచుకున్నా. ‘పెళ్లిచూపులు’ సమయంలో తరుణ్‌ నటన గమనించాను. ప్రతి సన్నివేశం నటించి చూపించేవాడు. తన స్థాయిలో మేం నటించలేకపోయేవాళ్లం. అందుకే తనే కరెక్ట్‌   అనిపించింది. స్క్రిప్టు విషయంలో నా జోక్యం కొంత వరకు ఉంది. కానీ మొత్తం స్క్రిప్టు ఖరారయ్యాక కలగచేసుకోలేదు. సెట్‌కి ఒక్కసారి మాత్రమే వెళ్లా. అది కూడా వాళ్ల బలవంతంపైనే. ఇప్పటి వరకూ సంపాదించిన దాంట్లో మూడొంతులు ఈ సినిమాపై పెట్టేశాను. ‘మనకెందుకురా ఇవన్నీ’ అని నాన్న అన్నారు. కానీ ఎంతో మంది ప్రోత్సహిస్తే నేను ఈ స్థాయికి వచ్చా. అందుకే కొత్తవాళ్లని నేనూ ప్రోత్సహించాలనిపించింది. ఇప్పుడు ఈ సినిమా తీశా. భవిష్యత్తులో ఏం చేస్తానో చెప్పలేను. ‘మీకు మాత్రమే చెప్తా’ చూశాక ప్రతీ ఒక్కరూ నవ్వుకుంటూ థియేటర్ల నుంచి బయటకు వస్తార’’న్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.