అందుకే ‘యాత్ర’ బయోపిక్‌ కాదు..
‘‘సినిమా అంటేనే వినోదం. దానికి భావోద్వేగాలను జోడించి ‘యాత్ర’ను తెరకెక్కించామ’’న్నారు విజయ్‌ చిల్లా. ఆయన నిర్మించిన చిత్రమిది. మహి వి. రాఘవ్‌ దర్శకుడు. ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విజయ్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఓ వ్యక్తి పుట్టుక నుంచీ మరణం వరకూ జరిగిన చరిత్రని వాస్తవిక కోణంలో తెరకెక్కిస్తే బయోపిక్‌ అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే డాక్యుమెంటరీ అవుతుందే తప్ప, సినిమా అనిపించుకోదు. అందుకే వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రకు ఊహాజనితమైన అంశాలు జోడించి ఓ కమర్షియల్‌ చిత్రంగా మలిచాం. అందువల్ల ఇది అసలు బయోపిక్‌ కానే కాదు. ఆ పాదయాత్ర సమయంలో వైఎస్‌ఆర్‌ ఏం నమ్మారో, ఏం చెప్పారో... అవే నిజాల్ని ఓ పాట ద్వారా తెరపై చూపే ప్రయత్నం చేశాం. వైఎస్సార్‌గా మమ్ముట్టి తప్ప మరొకరు న్యాయం చేయలేరనిపించింది. ఆయన్ని కలసి మహి ఈ కథని వినిపించారు. ‘యాత్ర’ని ఆరంభించేప్పుడు ఎన్నికల సమయంలో విడుదల చేయాలనుకోలేదు. ఈ సమయంలో విడుదల అవ్వడం కేవలం యాదృచ్ఛికం. జగన్‌ని మహి రెండుసార్లు కలసి మాట్లాడారు. ‘మా నాన్న చేసిందే చూపించండి. చేయంది చూపించొద్దు’ అని జగన్‌ చెప్పారు. పాదయాత్ర సమయంలో ఏమేం జరిగాయో, అవే ఉంటాయ’’న్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.