ర ‘సాలూరు’ గీతాలు... రాగరంజితాలు!
సాలూరు’ గీతాలు... రాగరంజితాలు!
ఆయన స్వరపరిచిన పాటలు రసగుళికలు... పాటలో భావానికి తగిన సంగీతాన్ని ఆయన జోడిస్తే, ఆయన సమకూర్చిన సంగీతం వల్ల ఆ భావం మరింత ప్రస్ఫుటమయ్యేది. ఆయనే సాలూరు రాజేశ్వరరావు. ఆయన పాటల్లోని మాధుర్యం వల్ల ఆయనను అభిమానులు ‘రాసాలూరు’ రాజేశ్వరరావు అని ప్రేమగా పిలుచుకునేవారు. ఆయన వర్ధంతి (ఆక్టోబర్ 25,1999) ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుందాం. అందరి సంగీత దర్శకుల వ్యవహార శైలి ఒకటిగా వుంటే రాజేశ్వరరావు శైలి తద్భిన్నంగా, వినూత్నంగా వుండి, అందరి దృష్టిని ఆకర్షించేది. ఆత్మాభిమానానికి రాజేశ్వరరావు ఇచ్చిన విలువ ధనార్జనకు ఇవ్వలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. తను నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడూ సడలించని మనస్తత్వం రాజేశ్వరరావుకు సొంతం. పాటనుబట్టి వాద్యాల నిర్ణయం జరగాలే తప్ప వున్నాయి కదా వాద్యాలు వాడుకుందాం అనే భావన ఎప్పుడూ ఆయన దరిచేరనీయ లేదు. జానపద, సాంఘిక చిత్రాల పాటలకు ఎన్ని వాయిద్యాలు వుండాలి, పాశ్చాత్య ధోరణి పాటకైతే ఎన్ని వాయిద్యాలు వుండాలి అనే ఖచ్చితమైన లెక్కలు రాజేశ్వరరావు దగ్గర వుండేవి. జానపద పాటలకు ఫ్లూటు, డప్పులు, జముకు, డోలక్, క్లారినెట్, పంజా, షెహనాయి వంటి వాద్య పరికరాలను రాజేశ్వరరావు వాడేవారు. వెస్టన్ర్‌ పాటలకు యాభైకి పైగా వయొలిన్లు వాడిన సందర్భాలు రాజేశ్వరరావుకు కోకొల్లలు. ‘చంద్రలేఖ’ సినిమాలో సేల్లోలు, హేమాండ్‌ ఆర్గాన్, ఎలక్ట్రిక్‌ గిటార్, ట్రంపెట్లు, ట్రంబ్నోన్, సింతసైజర్, జిప్సీలు వాడే వాద్య పరికరాలు ఉపయోగించి ఒక నూతన ఒరవడి సృష్టించిన ఘనత ఆయనది.

బాల రసాల సాలూరు...
సాలూరు రాజేశ్వరరావు అక్టోబరు 11, 1921న విజయనగరం జిల్లా సాలూరుకు దగ్గరలో వుండే శివరామపురంలో జన్మించారు. మంగమ్మ, సన్యాసిరాజు ఆయన తల్లిదండ్రులు. తండ్రి మంచి కవి, మృదంగ విద్వాంసుడు. విజయనగరం రాజాస్థానంలో పనిచేసేవారు. ఆయన వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు కచేరీలకు మృదంగం వాయించేవారు. రాజేశ్వరరావుకు చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి వుండేది. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు కార్యక్రమాలకు రాజేశ్వరరావు క్రమం తప్పకుండా వెళ్లేవారు. ఆయన వద్ద హరికథలు చెప్పడంలో శిక్షణ తీసుకొని అప్పుడప్పుడు పెళ్లి పందిళ్లలో సరదాగా హరికథలు చెప్పేవారు. ద్వారం వారి శిష్యరికంలో త్యాగరాయ కృతులు, వర్ణాలు నేర్చుకున్నారు. నవమి ఉత్సవాలకు ఈ బాల రాజేశ్వరరావు పల్లెటూర్లలో హరికథా కాలక్షేపం చేసేవారు. విశాఖపట్నంలో రాజేశ్వరరావు సోదరులు కచేరి చేస్తుండగా వైణిక విద్వాంసులు సంగమేశ్వరశాస్త్రి వీరికి బంగారు పతకం బహూకరించారు. అప్పుడే హచ్చిన్స్‌ రికార్డింగ్‌ కంపెనీ వారు కొత్త గాయకుల అన్వేషణలో విజయనగరానికి వచ్చి రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి బెంగుళూరు తీసుకెళ్లి భగవద్గీతతోబాటు కొన్ని పాటలు పాడించి రికార్డు చేశారు. వేల్‌ పిక్చర్స్‌ వారు 1934లో ‘శ్రీకృష్ణలీలలు’ సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుపుతున్న తరుణంలో గూడవల్లి రామబ్రహ్మం, పి.వి.దాసు బెంగుళూరులో రాజేశ్వరరావు రికార్డులు విని అతనికి శ్రీకృష్ణుడు వేషాన్ని ఖరారు చేశారు. అలా పన్నెండేళ్ల వయసులో బెరుకు లేకుండా రాజేశ్వరరావు ఆ చిత్రంలో నటించారు. సినిమా 1935న నవంబరు 23న విడుదలై విజయ దుందుభి మ్రోగించింది. ఆరోజుల్లో ‘శ్రీకృష్ణలీలలు’ సినిమా ప్రచారంలో భాగంగా కరపత్రాలు విసరడానికి హెలికాప్టర్‌ని వినియోగించడం గొప్పగా చెప్పుకున్నారు. తరువాతి సంవత్సరం వేల్‌ పిక్చర్స్‌ వారు ‘మాయాబజార్‌’ చిత్రాన్ని నిర్మించారు. అందులో రాజేశ్వరరావు అభిమన్యుడి వేషం వేశారు. తరువాత న్యూ థియేటర్స్‌ వారు ‘కీచక వధ’ సినిమా నిర్మిస్తూ అందులో ఉత్తరుడుగా నటించేందుకు రాజేశ్వరరావును ఎంపికచేసి కలకత్తా తీసుకెళ్లారు. అక్కడ రాజేశ్వరరావుకు కె. ఎల్‌.సైగల్, పంకజ్‌ మల్లిక్‌ వంటి సంగీతకారులతో పరిచయమైంది. వారి సహవాస ఫలితంగా రాజేశ్వరరావుకు హిందుస్తానీ సంగీతం మీద ఆసక్తి పెరిగి ఉస్తాద్‌ ఫయాజ్‌ ఖాన్‌ వద్ద ఆ సంగీతపు మెళకువలు ఆపోసన పట్టారు. మరోవైపు హార్మోనియం, సుర్‌ బహార్, సితార్‌ వంటి సంగీత పరికరాలను ఉపయోగించడం నేర్చుకున్నారు. న్యూ థియేటర్స్‌కు చెందిన ఆర్‌.సి. బోరల్, పంకజ్‌ మల్లిక్‌ వద్ద ఆర్కెస్ట్రా ఎలా కండక్ట్‌ చేయాలో అభ్యసించారు. వాద్యపరికరాలను కలిపి రాగాలను సృష్టించడం వంటి మెలకువలన్నీ రాజేశ్వరరావు వారి దగ్గరే నేర్చుకున్నారు. ఆ మెళకువలు అవగతమయ్యాక సంగీత దర్శకత్వం నెరపాలనే కోరిక పెంచుకున్నారు. మద్రాసు తిరిగి వచ్చాక సంగీత దర్శకుడు జయరామయ్యర్‌ వద్ద సహాయకుడిగా చేరి ‘విష్ణులీల’ అనే తమిళ సినిమాకు పనిచేశారు. కన్నడంలో నిర్మించిన ‘వసంతసేన’ సినిమాకు ఆర్‌. సుదర్శనం వద్ద సహాయకునిగా పనిచేశారు.


పద్దెనిమిదేళ్లకే సంగీత దర్శకునిగా...
రాజేశ్వరరావు ప్రతిభ గుర్తించిన శ్రీ శారదా రాయలసీమ ఫిలిమ్స్‌ వారు ‘జయప్రద’ సినిమా నిర్మిస్తూ రాజేశ్వరరావును సంగీత దర్శకునిగా నియమించారు. బొంబాయి నుంచి రికార్డింగ్‌ పరికరాలను తెప్పించి పాటలు రికార్డు చేశారు. ఈ సినిమా పెద్దగా ఆడక పోవడంతో సంగీత దర్శకునిగా రాజేశ్వరరావుకు తగిన గుర్తింపు రాలేదు. 1940లో గూడవల్లి రామబ్రహ్మం ఇందిరా దేవి ఫిలిమ్స్‌ పతాకం మీద ‘ఇల్లాలు’ సినిమా నిర్మిస్తూ రాజేశ్వరరావుకు ఒక వేషమిచ్చారు. గూడవల్లి నిర్మించే సినిమాలకు భీమవరపు నరసింహరావు ఆస్థాన సంగీత దర్శకుడు. అయితే రాజేశ్వరరావు తండ్రి సన్యాసిరాజు అభ్యర్ధన మేరకు రాజేశ్వరరావుకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో రాజేశ్వరరావు, రావు బాలసరస్వతి జంటగా నటించారు. అందులో వీరి జంట ఆలపించిన ‘కావ్యగానము చేసి కైపెక్కినానే’ బాగా పాపులరైంది. అంతవరకూ సినిమాల్లో ప్లేబ్యాక్‌ పద్ధతి లేదు. అటువంటిది రాజేశ్వరరావు ‘ఇల్లాలు’ సినిమాలో తొలిసారి ప్లేబ్యాక్‌ పద్ధతి ప్రవేశపెట్టి సఫలీకృతులయ్యారు. రికార్డింగ్‌ మొత్తం జెమినీ స్టూడియోలో జరిగినప్పుడు రాజేశ్వరరావు చొరవను ఎస్‌.ఎస్‌.వాసన్‌ గమనించారు. తన స్టూడియోలో సంగీత విభాగంలో రాజేశ్వరరావుకు చోటు కలిపించారు. జెమినీ ఫిలిం సర్క్యూట్‌ నిర్మించిన ‘జీవన్ముక్తి’ (1942), ‘బాలనాగమ్మ’ (1942) సినిమాలకు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. ‘జీవన్ముక్తి’లో ‘జయజయ పరమాత్మా సకల భువన కారణా’, ‘దాశరథే దయా శరదే’, ‘మేలుకో జీవా తూర్పు తెలవారే’ పాటలు; ‘బాలనాగమ్మ’ సినిమాలో ‘నా సొగసే కని మరుడే దాసుడు కాడా’, ‘శ్రీ జయజయ గౌరీ రమణా’ వంటి పాటలు బాగా పాపులరయ్యాయి. ‘బాలనాగమ్మ’ సినిమాకు రాజేశ్వరరావు చేసిన రీ-రికార్డింగు అద్భుతమని, ముఖ్యంగా మాయల ఫకీరు ప్రవేశంలో వచ్చే సౌండ్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దవాళ్లు కూడా జడుసుకునేవారని చెప్పేవారు.

చంద్రలేఖ కోసం...
జెమినీ వారు నిర్మించిన ‘చంద్రలేఖ’(1946) తమిళ/హిందీ సినిమాకు రాజేశ్వరరావు సమకూర్చిన సంగీతం ఆయన కీర్తిని ఇనుమడింపజేసింది. ముఖ్యంగా డ్రమ్‌ డ్యాన్సు సంగీతానికి రాజేశ్వరరావు అహర్నిశలు శ్రమించారు. రకరకాల ప్రయోగాలు చేశారు. ఈ డ్రమ్‌ డ్యాన్స్‌ పాట కోసం మద్రాసులో వున్న వాద్యకారులందరినీ వాడుకున్నారు. వారు సరిపోక పోలీసు బ్యాండ్‌ దళాన్ని, నేవీ బ్యాండ్‌ దళాన్ని కూడా వుపయోగించుకున్నారు. ఈజిప్టు, ఆఫ్రికా దేశాలనుంచి జిప్సీలు వాడే వాద్యపరికరాలను దిగుమతి చేసుకొని వాటిని ఉపయోగించేందుకు వందల కొద్దీ రిహార్సల్స్‌ చేయించారు. ఈ సినిమా సంగీతాన్ని పూర్తిచేసేందుకు ఏడాది సమయం పట్టిందంటే ఆలోచించండి రాజేశ్వరరావు ఎంతగా శ్రమించి ఉంటారో! తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ సినిమా విడుదలైనప్పుడు హిందీ చలనచిత్ర సీమకు చెందిన సంగీత పండితులు, సాంకేతిక కళాకారులు, ఆ సినిమా సంగీతాన్ని, చిత్రీకరణను తిలకించి విస్తుపోయారు. పాతికేళ్లు నిండని ఓ కుర్రాడు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడంటే నమ్మలేకపోయారు. తరువాత జెమినీ వారు నిర్మించిన ‘అపూర్వ సహోదరులు’, ఆ చిత్ర హిందీ వర్షన్‌ ‘నిషాన్‌’ (1950)లకు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు.

మల్లీశ్వరికి ఆరునెలలు...
అదే సమయంలో బి.ఎన్‌. రెడ్డి ‘మల్లీశ్వరి’ (1951) సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజేశ్వరరావుకు పిలుపొచ్చింది. ఈ సినిమా పాటలు స్వరపరచి రికార్డింగ్‌ చెయ్యడానికి ఆరునెలల సమయం పట్టింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి ముందు పాటలు రాసిన తరవాతే రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. ఆర్కెస్ట్రా సహకారాన్ని ఆద్దేపల్లి రామారావు సమకూర్చడం జరిగింది. ‘ఎందుకే నీకింత తొందరా’, ‘ఎవరు ఏమని విందురు’, ‘కోతిబావకు పెళ్ళంట’, ‘పరుగులు తీయాలి’, ‘మనసున మల్లెల మాలలూగెనే’ పాటలు నేటికీ అజరామరాలే. ఆ సినిమా ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. 1954లో భానుమతి నిర్మించిన ‘విప్రనారాయణ’ సినిమాకు శాస్త్రీయ సంగీత బాణీలతో అద్భుత సంగీతాన్ని అందించారు రాజేశ్వరరావు. ‘ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతన’, ‘చూడుమదే చెలియా కనులా’, ‘పాలించర రంగా’, ‘మధుర మధురమీ చల్లని రేయి’, ‘మేలుకో శ్రీరంగ మేలుకోవయ్యా’ వంటి పాటలు ఘంటసాలతో కాకుండా ఎ.ఎం.రాజా, భానుమతి కాంబినేషన్లో పాడించి హిట్‌ చేయడం రాజేశ్వరరావు ప్రతిభే. ‘ఎందుకోయీ తోటమాలి’ పాట బాణీ రాజేశ్వరరావు సిటీ బస్సులో ప్రయాణం చేస్తుండగా స్ఫురించిందే. బస్సు దిగి భరణీ స్టూడియోకి వెళ్లి వెంటవెంటనే ఆ పాటకు పూర్తి స్థాయి బాణీని స్వరపరచడం జరిగింది. ముందుగా అల్లిన స్వరానికి సముద్రాల రాసిన పాట అది. విజయా వారి ‘మిస్సమ్మ’ చిత్రంలో కూడా రామారావుకి రాజా చేత పాటలు పాడించి ప్రయోగం చేశారు రాజేశ్వరరావు. ‘ఔనంటే కాదనిలే, కాదంటే ఔననిలే’, ‘తెలుసుకొనవె యువతి’, ‘బృందావనమది అందరిదే’, ‘రావోయి చందమామా’ పాటలు ఇందుకు ఉదాహరణలు. అదే సినిమాలో రాజేశ్వరరావు స్వరపరచిన ‘కరుణించు మేరిమాతా’ పాట క్రైస్తవుల మందిరాలలో తరచూ వినిపిస్తూనే వుంటుంది. ఈ సినిమాని ఎ.వి.ఎం వారు హిందీలో ‘మిస్‌ మేరి’గా పునర్నిర్మించినప్పుడు సంగీత దర్శకుడు హేమంత కుమార్‌ ‘బృందావనమది అందరిది’ పాట బాణీని యధాతధంగా వాడుకోవడం జరిగింది. ఇందుకోసం హేమంత కుమార్‌ రాజేశ్వరరావు దగ్గర సమ్మతి తీసుకోవడం కూడా సత్సంప్రదాయంగా అమరింది. తరువాత ఎ.వి.ఎం వారి ‘భక్త ప్రహ్లాద’, బి.ఎ. సుబ్బారావు ‘చెంచులక్ష్మి’, వాహినీ వారి ‘రంగులరాట్నం’, ‘బంగారు పంజరం’, బి. ఎస్‌. రంగా గారి ‘అమరశిల్పి జక్కన్న’, అన్నపూర్ణా వారి ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మగౌరవం’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘ఆత్మీయులు’, పి.ఎ.పి. వారి ‘భార్యాభర్తలు’, జగపతి వారి ‘ఆరాధన’ వంటి సినిమాలకు రాజేశ్వరరావు వైవిధ్యమైన సంగీతం సమకూర్చారు. తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్‌ చిత్రం ‘ఆహుతి’ (1950-హిందీలో నీరా అవుర్‌ నందా) సినిమాకు శ్రీశ్రీ స్వేచ్చనువాదంతో పాటలు రాస్తే రాజేశ్వరరావువాటిని హిట్‌ చేసి చూపారు. ‘ప్రేమయే జనన మరణ లీల’, ‘ఊగిసలాడేనయ్యా పడవ’ పాటలు అలాంటివే. ‘అమరశిల్పి జక్కన్న’ (1964) సినిమాలో రాజేశ్వరరావు స్వరపరచిన ‘ఈ నల్లని రాలలో యే కన్నులు దాగెనో’, ‘నిలువుమా నిలువుమా నీలవేణి’, ‘అందాల బొమ్మతో ఆటాడవా’ (జావళి), ‘నగుమోము చూపించవా గోపాలా’ (జావళి), ‘ఎదో గిలిగింత ఏమిటీ వింత’ పాటలు నేటికీ నిత్యనూతనాలుగా భాసిల్లుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రాజేశ్వరరావు వాద్యాలను ఉపయోగించిన తీరు పరమాద్భుతం.

అద్భుతాల సంగీత మాంత్రికుడు ...
పాటలే కాదు, పౌరాణిక సినిమాలలో వుండే పద్యాలకు అద్భుతమైన బాణీలు కట్టి, తక్కువ ఆలాపనతో వాటిని హిట్‌ చేసిన ప్రతిభాశాలి రాజేశ్వరరావు. పద్యాలను ఘంటసాల, మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్‌ల చేత ఆలపింపజేసిన తీరుగొప్పగా వుంటుంది. మద్రాసులో వాహినీ స్టూడియో కార్మికులు సమ్మె చేసిన సందర్భంలో అన్నపూర్ణా వారి ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా షూటింగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అప్పట్లో పాటల రీ-రికార్డింగ్‌ పనులు మద్రాసులో జరుగుతుండేవి. ఆ పరిస్థితులు హైదరాబాదు సారథి స్టూడియోలో లేవు. అందుకు నాందీ ప్రస్తావన చేసిన మహనీయుడు రాజేశ్వరరావే. కొంతమంది ముఖ్య వాద్యకారుల్ని హైదరాబాదు రప్పించి, స్థానిక కళాకారుల సహకారంతో పాటల రికార్డింగు, రీ-రికార్డింగ్‌ పనులు సజావుగా పూర్తిచేయించిన ఘనత రాజేశ్వరరావుకే దక్కుతుంది. రాజేశ్వరరావు మ్యూజిక్‌ సిట్టింగులకు ఆలస్యంగా వెళ్లేవారు. అందుకు ఒక కారణముంది. అర్ధరాత్రి పూట రేడియోలో బి.బి.సి, వాయిస్‌ ఆఫ్‌ అమెరికా వంటి విదేశీ ఛానళ్లలో వచ్చే సంగీతాన్ని వింటూ, మంచి ట్యూనులు స్పురిస్తే వాటిని రాసుకుంటూ, ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్రపోయేవారు. ఆలస్యంగా లేచేవాళ్లు. అందుకే ఆలస్యమయ్యేది. వీణా వాద్యమన్నా, సితార వాద్యమన్నా రాజేశ్వరరావుకు ఎంతో ఇష్టం. వీణమీద రాజేశ్వరరావు చేసినన్ని పాటలు మరే ఇతర తెలుగు సంగీత దర్శకుడు చెయ్యలేదు. విదేశీ వాద్యాలతో రాజేశ్వరరావు ఎన్నో ప్రయోగాలు చేసేవారు. బెంగాలి సంగీతాన్ని, ఆఫ్రికన్‌ జిప్సీ సంగీతాన్ని శ్రద్ధగా విని, మంచి బిట్లు వుంటే అనుకరించేందుకు వెనుకాడేవారు కాదు. రాజేశ్వరరావుకు సైగల్, నౌషాద్, బర్మన్, హేమంతకుమార్‌ సంగీతం అంటే చాలా ఇష్టం. విదేశీ సింఫనీల నుండి ప్రేరణ పొందేవారు. పాటకు మాతృక ఫలానా అని చెప్పేందుకు వెనుకాడేవారు కాదు. రాజేశ్వరరావు తనయులు అందరూ సంగీత విద్వాంసులే. రామలింగేశ్వరరావు మంచి పియానో ప్లేయర్‌ కాగా, పూర్ణచంద్రరావు, వాసూరావు మంచి సంగీత దర్శకులు. కోటి విషయానికొస్తే ఆయన ఎన్నో చిత్రాలకు అద్భుత సంగీతం అందించారు. సింధుభైరవి, కల్యాణి, మాలకోస్, భీమ్‌ పలాస్, మోహన రాగాలంటే రాజేశ్వరరావుకు చాలా ఇష్టం. రాజేశ్వరరావు 150 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. తెల్లటి పంచె, లాల్చీ వస్త్రధారణతో బెంగాలి బాబులను మరపించే రాజేశ్వరరావు సంగీతం అజరామరం... అమరం!!

మరిన్ని విశేషాలు ...
చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘మల్లీశ్వరి’ చిత్రంలో ‘మనసున మల్లెల మాలలూగెనే’ పాట రికార్డింగుకు ముందు రిహార్సల్స్‌ జరుగుతున్నాయి. భానుమతి ఆ పాటను ప్రాక్టీస్‌ చేస్తూ రాజేశ్వరరావు చెప్పిన పద్ధతిలో కాకుండా తనదైన శైలిలో పాడుతోంది. రాజేశ్వరరావుకు ఆమె పధ్ధతి నచ్చలేదు. ‘అలలు కొలనులో గలగలమనినా’ చరణాన్ని ఇలా పాడాలి అని రాజేశ్వరరావు మరోసారి బాణీని పాడి వినిపించారు. భానుమతికి ఉక్రోషం వచ్చింది. ‘నేనూ సంగీతంలో మాస్టర్నే’ అని పెడసరంగా బదులిచ్చింది. రాజేశ్వరరావు ఏమీ మాట్లాడలేదు. బాత్‌ రూముకు వెళ్ళినట్లే వెళ్లి ఇంటికి వెళ్లిపోయారు. ఇది జరినప్పుడు దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి అక్కడ లేరు. గంటన్నర తరువాత వచ్చి చూస్తే ఆర్కెస్ట్రా వాళ్లు మాత్రమే వున్నారు. రాజేశ్వరరావు కనపడలేదు. తబలా వాద్యకారుడు లక్ష్మణరావు జరిగిన విషయాన్ని బి.ఎన్‌.కు వివరించి చెప్పాడు. బి.ఎన్‌. హుటాహుటిన రాజేశ్వరరావు ఇంటికి వెళ్ళారు. ‘ఈ సినిమా చేయడానికి నాకు ఏమీ అభ్యతరం లేదు. భానుమతికి ఉందేమో కనుక్కోండి’ అంటూ రాజేశ్వరరావు తనదైన శైలిలో చెప్పారు. బి.ఎన్‌. భానుమతికి కబురంపి గట్టిగానే మందలించారు. భానుమతి రికార్డింగుకు వచ్చి రాజేశ్వరరావు చెప్పిన పద్ధతిలోనే పాడింది. పాట రికార్డు చేశారు. రికార్డింగ్‌ అయ్యాక అందరూ ఆ పాట ఎలా వచ్చిందోనని వింటున్నారు. ‘అలను కొలనులో’ చరణం వచ్చింది. భానుమతి లేచివచ్చి రాజేశ్వరరావుకు ప్రణామం చేసింది. ‘మాస్టారూ, హాట్స్‌ ఆఫ్‌. ఇప్పుడు వింటుంటే నాకు తెలుస్తోంది మీరు నన్ను ఎందుకు హెచ్చరించారోనని. నేనే కాదు మున్ముందు మీరు చెప్పినదానికి ఎవరు అడ్డు చెప్పినా వారికి పాడే అర్హత వుండదు’ అంటూ నమస్కారం మీద నమస్కారం చేస్తూ చెప్పింది. రాజేశ్వరరావు, బి. ఎన్‌.లు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. విజయా వారి ప్రతిష్టాత్మక చిత్రం ‘మాయాబజార్‌’ (1957) సినిమాకు మొదట సంగీత దర్శకుడిగా నియమించింది రాజేశ్వరరావునే. అందులో ‘చూపులు కలసిన శుభవేళా’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘నీవేనా నను తలచినది నీవేనా నను పిలచినది’, ‘నీ కోసమే నే జీవించునదీ’ పాటలకు స్వరాలల్లి, మ్యూజిక్‌ బిట్లు కూడా సమకూర్చినది రాజేశ్వరరావే. అయితే మ్యూజిక్‌ సిట్టింగులలో చక్రపాణి జోక్యాన్ని రాజేశ్వరరావు జీర్ణించుకోలేక పోయారు. దాంతో ఆ సినిమాకు పనిచేయనని తప్పుకున్నారు. ‘బాణీలు కట్టేటప్పుడు సంగీత దర్శకునికి స్వేచ్ఛ వుండాలి. సంగీత జ్ఞానం లేనివాళ్లు ఎంతపెద్ద నిర్మాతలైనా జోక్యం చేసుకుంటే మంచి సంగీత సృష్టి జరగదు’ అని గట్టిగా నమ్మిన వ్యక్తి రాజేశ్వరరావు. అంతేకాదు ఆత్మాభిమానానికి అత్యంత విలువనిచ్చే సంగీత స్రష్ట కూడా! అన్నపూర్ణా సంస్థ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు సాలూరు రాజేశ్వరరావు అన్నా, అతని సంగీతమన్నా విపరీతమైన అభిమానం. అన్నపూర్ణా పిక్చర్స్‌ సినిమాలకు సంగీత సారథి రాజేశ్వరరావే. వారు తొలి సినిమా ‘దొంగరాముడు’ నిర్మించదలచినప్పుడు రాజేశ్వరరావునే సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. అయితే రాజేశ్వరరావును భరించడం కష్టమని కొందరు సలహా ఇవ్వడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. తరువాత ‘వెలుగు నీడలు’ సినిమాకు రాజేశ్వరరావును సంగీత దర్శకుడిగా అనుకున్నా, కబురంపితే రాజేశ్వరరావు రాలేదు. ఆ అవకాశాలు పెండ్యాలకు దక్కాయి. తరవాత ఒకానొక సందర్భంలో ఇద్దరూ కలవడం జరిగింది. అన్నపూర్ణా చిత్రాలకు పనిచెయ్యరా అని దుక్కిపాటి అడిగిన ప్రశ్నకు రాజేశ్వరరావు తనదైన శైలిలో బదులిచ్చారు. ‘మీరు చాలా నిబద్ధతతో ఉంటారని. సమయానికి రాకపోతే కోప్పడతారని మా ఆర్కెస్ట్రా వాళ్లు చెప్పారు. భయపడి రాలేదు’ అనేది ఆ జవాబు. దాంతో రాజేశ్వరరావు ’ఇద్దరు మిత్రులు’ చిత్రంతో అన్నపూర్ణలో అడుగుపెట్టి అజరామరమైన సంగీతాన్ని అందించారు. రాజేశ్వరరావు ఇంటికి దుక్కిపాటి కారు పంపేవారు. ‘రాజేశ్వరరావు ఎప్పుడు వచ్చి కారేక్కితే అప్పుడే తీసుకురా. అంతేగాని, కారొచ్చింది ఎక్కండి అని మాత్రం అనవద్దు’ అని డ్రైవర్‌ను హెచ్చరించి మరీ పంపేవారు. రాజేశ్వరరావు మనసెరిగి, ఆయన వీలున్నప్పుడు వచ్చి పాటలకు బాణీలు కట్టే విధంగా వాతావరణాన్ని సృష్టించడం చేతనే అన్నపూర్ణ వారి సినిమాలకు అత్యద్భుతమైన పాటలు పురుడు పోసుకొని నేటికీ శ్రోతలకు వీనుల విందు చేస్తున్నాయి. వృత్తి ధర్మాన్ని నమ్ముకున్న రాజేశ్వరరావు డబ్బు కోసం ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేదు సరికదా సంగీత సరస్వతికి అపచారం జరిగితే సహించలేదు కూడా. నిర్మాతల సరళి నచ్చక ‘కృష్ణవేణి’ సినిమాను వదలుకున్నారు. ఎన్‌.టి.రామారావు సినిమాలు కూడా వదలుకున్న సందర్భాలు లేకపోలేదు. రామారావు సంస్థలో సంగీత చర్చలు జరుగుతున్నాయి. త్రివిక్రమరావు పదేపదే సలహాలు ఇస్తుండడం రాజేశ్వరరావుకు నచ్చలేదు. వెంటనే ఆయన లేచి ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లి ‘సార్‌....మీ ఇంటిలో మంచి సంగీత దర్శకుడు వున్నారు. ఆయన ఎవరో కాదు మీ తమ్ములుంగారే. వారితో చేయించుకోండి’ అంటూ వెళ్లిపోయారు. ఈ సంఘటన ఎన్‌.టి.ఆర్‌ ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామ కల్యాణం’ విషయంలోనే జరిగింది. ఆ సినిమాకు తొలుత సంగీత దర్శకుడు రాజేశ్వరరావే. ‘కానరార కైలాస నివాసా’ పాటకు స్వరకర్త రాజేశ్వరరావే. ఈమని శంకర శాస్త్రి చేత రావణాసుర దండకానికి, ఆ పాటకు కూడా బిట్లు స్వరపరచిన మేధావి రాజేశ్వరరావు. కానీ త్రివిక్రమరావు జోక్యం సహించలేక బయటకు వచ్చేశారు. తరువాత గాలి పెంచల నరసింహారావు ఆ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రాజేశ్వరరావు సరదా మనిషి. హాస్యప్రియత్వం ఎక్కువ. ఒకసారి ఒక నిర్మాత రాజేశ్వరరావుకు ఫోను చేసి ‘కారు రిపేరులో వుంది. మీరు ఆటోలో రండి’ అని చెప్పారు. రాజేశ్వరరావుకు కోపం వచ్చింది. రెండు గంటలు ఆలస్యంగా స్టూడియోకి చేరుకున్నారు. నిర్మాత ‘సార్‌... బాగా ఆలస్యమైనట్లుందే’ అని అడిగారు. ‘అవున్‌ సార్‌.. తమరు ఆటోలో రమ్మన్నారు కదా. ఎక్కడా ఆటో దొరకలేదు. ఒక టాక్సీ దొరికింది. దాన్నెక్కి ఆటో కోసం తిరిగి తిరిగి, ఆ ఆటోని పట్టుకునేసరికి ఇంత టైమయింది. ఇవిగో టాక్సీ, ఆటో బిల్లులు’ అంటూ చేతికందించారు. నిర్మాత బిక్కమొగం వేశాడు.

అలరించిన కొన్ని సాలూరు పాట స్వరాలు ...


* జేబులో బొమ్మా జేజేలా బొమ్మా ... రాజూ పేద

* ఓహో మేఘమాల నీలాల మేఘమాలా ... భలేరాముడు

* నీల గగన ఘన శ్యామా దేవా ... చెంచులక్ష్మి

* ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి ... అప్పుచేసి పప్పుకూడు

* మధురం మధురం ఈ సమయం ... భార్యాభర్తలు

* యేమని పాదేదనో ఈ వేళా మానస వీణా మౌనముగా ... భార్యాభర్తలు

* పాడవేల రాధికా ప్రణయసుధా గీతికా ... ఇద్దరు మిత్రులు

* నాదు ప్రేమ భాగ్యరాసి నీవె ప్రేయసీ ... భక్త జయదేవ

* చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేర రావేలా ... కులగోత్రాలు

* నీ చెలిమి నేడే కోరితిని ... ఆరాధన

* మనసులోని కోరికా తెలుసు ప్రేమ మాలికా ... భీష్మ

* వినిపించని రాగాలే కనిపించని అందాలే ... చదువుకున్న అమ్మాయిలు

* మనసున మనసై బ్రతుకున బ్రతుకై ... డాక్టర్‌ చక్రవర్తి

* పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా ... డాక్టర్‌ చక్రవర్తి

* నిన్నలేని అందమేదో నిదురలేచె నెందుకో ... పూజాఫలము

* నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో ... రంగులరాట్నం

* నా రాణి కనులలోనే ఆ నాటి కలలు దాగే ... చిలకా గోరింక

* నీ జిలుగు పైట నీడలోన నిలువనీ ... పూలరంగడు

* కనులకు వెలుగువు నీవే కావా ... భక్త ప్రహ్లాద

* మదిలో వీణలో మ్రోగే ఆశలెన్నో చెలరేగే ...ఆత్మీయులు

* మధుర భావాల సుమమాల మనసులో పూచే ఈ వేలా ... జై జవాన్‌

* పచ్చబొట్టు చెరిగి పోదులే నా రాజా ... పవిత్రబంధం

* మ్రోగింది కళ్యాణ వీణా ... కురుక్షేత్రం

* అభినందన మందార మాల ... తాండ్ర పాపారాయుడు

ప్రైవేటు గీతాలు


* పాటపాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునటుల

* కలగంటి కలగంటి కమలరేకులవంటి

* తెరతీయరా తిరుపతి దేవరా

* ఓ విభావరీ... ఓహో విభావరీ

* కోపమేల రాధా

* హాయిగా పాడుదునా

* ఒంటిగా ఉయ్యాల లూగితివా

* పొదరింటిలో నుండి

* నావను నడిపే నవయువకా





- ఆచారం షణ్ముఖాచారి


© Sitara 2018.
Powered by WinRace Technologies.