ఆంధ్రా షెల్లీ... దేవులపల్లి...
మనసున మల్లెలమాలలూగితే రేయంతా హాయి నిండుతుందా? మావిచిగురు తింటే కోయిల ఎలా పాడుతుంది? అచ్చంగావచ్చే వసంతరాత్రిలో శృంగార గరిమ ఎలాగుంటుంది? గగనసీమలో స్వేచ్చగా విహరించే మేఘం ప్రేమ సందేశాన్ని ఎలా మోసుకొస్తుంది? ప్రియుని జాడ ఎలా తెలుసుకుంటుంది? మనసు తెలిసిన ఆ మేఘమాలది జాలిగుండె కాదా? సఖియ రాకుంటే వసంతమాసం ఆగుతుందా? మోయలేని హాయిని ఒక్క క్షణం మోయలేదా? ఆకాశపందిరిలో పెళ్లిజరిగితే దేవతలు పురోహితులుగా, అప్సరసలు పేరంటాళ్లుగ రావడం సాధ్యమా?... వీటన్నిటికీ సమాధానాలు దేవులపల్లి కృష్ణ శాస్త్రి భావ కవితలే. మీగడ తరకల్లాంటి జుబ్బా, పంచెకట్టు, ఉత్తరీయం, బంగారు రంగు శరీరం, వెండి గిరజాల జుట్టుతో భావకవితా ప్రపంచానికి చక్రవర్తిలా, తన కవిత్వంలాగే అందంగా భాసిల్లిన పదనిర్దేశకుడు. వర్షం వచ్చేముందు వీచే చల్లనిగాలి తెమ్మెర తనువును తాకితే ఎంత పులకరిస్తామో, కృష్ణశాస్త్రి కవిత వింటుంటే అదే పులకరింత వీనుల విందుగా వస్తుంది. భావ కవిత్వానికి సినిమా పాటల ద్వారా ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేసి, దిశానిర్దేశం చేసిన అతి కొద్ది మంది కవులలో కృష్ణశాస్త్రి ముందుంటారు. సినిమాలకు ప్రత్యేకించి అయన రాసిన పాటలు తేనెలూరే తెలుగుదనంతో పరిమళాలు వెదజల్లుతాయి. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కవితా సంపుటికి చలం యోగ్యతాపత్రం రాస్తూ ‘కృష్ణశాస్త్రి తన బాధని అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ... ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ’ అని రాశాడు. అయితే శ్రీశ్రీ తను కృష్ణశాస్త్రి కవితా శైలినే అనుకరించేవాడిని అని చెప్పుకున్నాడు. ‘తెలుగు దేశపు నిలువుటద్దం బద్దలైంది. షెల్లీ మళ్లీ మరణించాడు’ అంటూ కృష్ణశాస్త్రి చనిపోయిన రోజున శ్రీశ్రీ రోదించాడు. కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ స్పందిస్తూ ‘ఒక్క షెల్లీ యే కాదు, కీట్స్, వర్డ్స్‌వర్త్‌ వంటి మహాశయుల సంయుక్త స్వరూపం కృష్ణశాస్త్రి’ అన్నారు. అటువంటి కవిపుంగవుడు దివికేగి సరిగ్గా 24 ఫిబ్రవరి నాటికి 39 యేళ్ళు. ఇన్నేళ్లయినా దేవులపల్లి కవితలు, సినిమా పాటలు నేటికీ నిత్యనూతనంగా వినిపిస్తూనే, కనిపిస్తూనే వున్నాయి. కృష్ణశాస్త్రి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకాలను కొన్ని గుర్తుతెచ్చుకుందాం...


వికసించిన సాహిత్యాభిలాష...

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలో వుండే చంద్రపాలెంలో నవంబరు 1, 1897న కృష్ణశాస్త్రి జన్మించారు. ఆ రోజుల్లో దేవులపల్లి సోదరకవులు (సుబ్బారాయ శాస్త్రి, వెంకట కృష్ణశాస్త్రి) పిఠాపుర సంస్థానంలో విద్వత్కవులుగా వుండేవారు. వారిలో ‘తమ్మనశాస్త్రి’గా వాసికెక్కిన వేంకట కృష్ణశాస్త్రి దేవులపల్లి తండ్రి. వీరి ఇంటిలో నిరంతరం సాహిత్య గోష్టి జరుగుతూ వుండేది. ఆ వాతావరణంలో పెరిగిన కృష్ణశాస్త్రి పదవ యేటనే ‘నందనందన ఇందిరానాథ వరదా’ అనే పద్యం రాశారు. సాహిత్యకృషి సల్పుతూ తన పదహారవ యేటనే అష్టావధానం నిర్వహించి ‘ఓహో’ అనిపించుకున్నారు. పాఠశాల విద్యాభ్యాసం పిఠాపురంలో పూర్తిచేసి 1919లో కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్మీడియట్‌ విద్యను, బి.ఎ డిగ్రీని విజయనగరం కళాశాలలోను చదివారు. విద్యార్థి దశలోనే గిడుగు రామమూర్తి పంతులు వ్యావహారిక భాషావాదం, బ్రహ్మ సమాజ ఉద్యమ ప్రభావం కృష్ణశాస్త్రి మీద ప్రబలంగా ఉండేవి. పెద్దాపురం మిషనరీ పాఠశాలలోను, కాకినాడ పి.ఆర్‌. హైస్కూలులోను ఉపాధ్యాయునిగా పని చేశారు. అలాగే తెలుగు ట్యూటర్‌గా పి.ఆర్‌.కళాశాలలో కూడా పనిచేశారు. ‘జయము జ్ఞాన ప్రభాకరా జయము క్రాంతి సుధాకరా’ అనే ప్రార్థనా గీతాన్ని బ్రహ్మ సమాజం కోసం రచించారు. అప్పుడే సాహితీ వ్యాసంగం కొనసాగిస్తూ ‘జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి, జయజయజయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి’ అనే దేశభక్తి గీతాన్ని పాఠశాల విద్యార్థుల కోసం రాశారు. వాశిలో విశ్వకవి రవీంద్రుని ‘జనగణమన అధినాయక జయహే’ అనే మన జాతీయగీతం కన్నా ఏమాత్రం తక్కువగా అంచనా వేయజాలని అద్భుత దేశభక్తి ప్రార్థనా గీతమిది. ‘జయజయ సుశ్యామల సుస్యామచల చేలాంచల... జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల... జయ మదీయ హృదయాశయ లక్షారుణ పదయుగళా... జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయగాయక వైతాళిక గళ విశాలపథ విహరణ... జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ’ అంటూ భారతమాత దేవభూమికి జయం పలుకుతూ సాగే ఈ ప్రార్థనాగీతానికి స్వాతంత్య్రోదమ సమయంలో వింజమూరి అనసూయాదేవి బాణీ కట్టింది. 1920లో వైద్యం కోసం బళ్లారి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతి శోభను ఆస్వాదిస్తూ ‘కృష్ణపక్షం’ ఖండకావ్యాన్ని రచించారు. 1922లో భార్య రాజహంస కాలం చెయ్యడం కృష్ణశాస్త్రిని బాధించింది. అప్పుడే కరుణాత్మకమైన కవితలు రాశారు. వాటిలో ‘కన్నీరు’ అనే ఖండకావ్యాన్ని ఉదహరించాలి. తరువాత పునర్వివాహం చేసుకొని భావ కవితోద్యమ సారధ్యం వహిస్తూ దేశమంతటా తిరిగారు. పిఠాపురంలో హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొంటూ వుండడంతో బంధువర్గం కృష్ణశాస్త్రిని వెలివేసింది. 1929లో ‘ఊర్వశి’, ‘ఆత్మాశ్రయత్వం’, ‘ఊహాప్రేయసి’, ‘ప్రవాసము’ వంటి కవితలతో పుస్తకాలు ప్రచురించారు. అదే సంవత్సరం విశ్వకవి రవీంద్రునితో పరిచయమైంది. 1941 వరకు కాకినాడ కళాశాలలో పనిచేశారు. ‘అమృతవీణ’ వంటి గేయ మాలికలు, ‘అమూల్యాభిప్రాయాలు’ వంటి వ్యాసావళి, ‘బహు కాలదర్శనం’, ‘ధనుర్దాసు’ వంటి నాటికలు, ‘మంగళకాహళి’ వంటి దేశభక్తి గీతాలు, సంగీత రూపకాలు రచించారు. కృష్ణశాస్త్రికి బెజవాడ గోపాలరెడ్డి అత్మీయమిత్రులు కావడంతో ఆయనను వాహినీ పిక్చర్స్‌ అధినేత బి.ఎన్‌.రెడ్డికి పరిచయం చేశారు. చలనచిత్ర రచన చేయమని బి.ఎన్‌.రెడ్డి కృష్ణశాస్త్రిని పలుమార్లు కోరినా ఆయన అంత ఆసక్తి చూపలేదు. చివరికి బి.ఎన్‌.రెడ్డి, కృష్ణశాస్త్రిని మద్రాసుకు మకాం మార్చేలా చేశారు.

చలనచిత్ర రంగప్రవేశం...

‘వందే మాతరం’ షూటింగు కోసం బి.ఎన్‌.రెడ్డి హంపికి వెళ్ళారు. శ్రీకృష్ణదేవరాయలు మీద వున్న ఆరాధనాభావంతో బి.ఎన్‌.రెడ్డి కృష్ణదేవరాయల నేపథ్యంలో సినిమా నిర్మించాలని ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. రచయిత బుచ్చిబాబు రాసిన ‘రాయల కరుణకృత్యం’ నాటిక, ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో వచ్చిన కథను సమన్వయం చేస్తూ ఒక కథ అల్లారు. ఆ కథను కృష్ణశాస్త్రి అభివృద్ధి చేసి, స్క్రిప్టు తయారు చేశారు. మల్లీశ్వరి నాగరాజు ముందు ప్రదర్శించిన నృత్యగానాలను మారువేషంలో ఉన్న రాయలు, అల్లసాని పెద్దన చూసినప్పుడు అల్లసాని మల్లీశ్వరిని ఆశువుగా ఓ పద్యంలో మెచ్చుకునే సన్నివేశం వుంది. అల్లసానివారి అల్లిక జిగిబిగి అనే నానుడి వుండడంతో, అదే ధోరణిలో పద్యం రావాలని చెప్పి బి.ఎన్‌.రెడ్డి కృష్ణశాస్త్రి చేత వంద పద్యాలు రాయించి అందులోంచి ‘భళిరా ఎన్నడు జారె నీభువికి రంభా రాగిణీ రత్నమేఖలయో నిర్జర వల్లభ ప్రియవధూ కంఠస్రవథ్ధామమో...’ అనే పద్యాన్ని ఖరారు చేశారు. చిత్రీకరణ విషయంలో బి.ఎన్‌.రెడ్డి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దేవులపల్లి మాటలతోబాటు, ఇందులో రాసిన పాటలన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. పాటలన్నీ కథా సంబంధంగా రాసినవి కావడం విశేషం. ఈ సినిమాలో కథాంశాలైన ప్రణయం, అనురాగం, విజయనగర వైభవం, వేదన వంటి కోణాల్లో పాటలు రాశారు కృష్ణశాస్త్రి. 1951లో విడుదలైన ఈ చిత్రం గొప్ప క్లాసిక్‌గా సంచలనం సృష్టించడంతో, కృష్ణశాస్త్రి ఉత్తమ శ్రేణి సినీకవిగా గుర్తింపు పొందారు. తొలుత సినిమా రంగం మీద పెద్దగా ఆసక్తి లేకున్నా కొన్ని సినిమాలకు అద్భుతమైన పాటలు రాశారు. ‘నాయిల్లు’ (1953) చిత్రంలో ‘అదిగదిగో గగన సీమ’, ‘బంగారుపాప’ (1954)లో ‘యవ్వన మధువనిలో వన్నెల పూవులా ఉయ్యాలా’; ‘భాగ్యరేఖ’ (1957)లో ‘నీవుండేదా కొండపై నాస్వామి నేనుండేదీ నేలపై’, ‘రాజమకుటం’ (1959)లో ‘సడిసేయకో గాలి సడిసేయబోకే’ వంటి అద్భుతమైన పాటలు రాశారు. అలా సినిమాలకు పాటలు రాస్తూనే, ఆకాశావాణికి రేడియో రూపకాలు రాసేవారు. దాంతో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో ‘ప్రయోక్త’గా చేరమని ఆహ్వానం అందింది. జెమినీ వాసన్, బి.ఎన్‌.రెడ్డి వంటి వారు ఒత్తిడిచేసి మద్రాసులోనే కొనసాగే ప్రయత్నం చేసినా కృష్ణశాస్త్రి ఆకాశవాణిలో చేరేందుకే మొగ్గుచూపారు. హైదరాబాదుకు వచ్చిన రోజుల్లోనే 1958లో కూతురు సీత మశూచి సోకి మరణించడంతో కృష్ణశాస్త్రి మరలా మద్రాసుకు మకాం మార్చారు. ఆకాశవాణిలో వుండగా ‘విప్రనారాయణ’, ‘క్షీరసాగర మథనం’ వంటి యక్షగానాలు అద్భుతంగా రాసి ప్రదర్శింపజేశారు.


విధి వక్రించి గొంతు మూగవోయి...
1964లో తిరుపతిలో అన్నమయ్య జయంతి ఉత్సవంలో కృష్ణశాస్త్రి పాల్గొన్నారు. అతని వెంట బాలాంత్రపు రజనీ కాంతరావు కూడా వెళ్ళారు. ఉపన్యాసం చదివేందుకు ఉద్యుక్తుడైన కృష్ణశాస్త్రి గొంతు బొంగురు పోయింది. దాంతో తన ఉపన్యాసాన్ని రజనీకాంతరావు చేత చదివించారు. వైద్య పరీక్షల్లో అది గొంతు క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది. మద్రాసులో కృష్ణశాస్త్రి స్వరపేటికను తొలగించారు. స్వరపేటిక తొలగించిన తరువాత కృష్ణశాస్త్రి దాదాపు పదహారేళ్లు బ్రతికినా, మూగవోయిన కంఠంతోనే అనేక సినిమాలకు పాటలు, ఆకాశవాణికి లలిత గీతాలు రాశారు. ఎవరితోనైనా మాట్లాడాలన్నా, చెప్పాలన్నా కాగితం మీద రాసి చూపేవారు. కృష్ణశాస్త్రి పాటలు మనసు లోతుల్లోంచి వచ్చేవి. భావోద్వేగాలకు పెద్దపీట వేసేవారు. ‘మల్లీశ్వరి’ తరువాత కృష్ణశాస్త్రి ‘రాజీ నాప్రాణం’, ‘నాయిల్లు’, ‘రాజగురువు’ వంటి కొన్ని చిత్రాలకు పాటలతోబాటు మాటలు కూడా రాశారు. తరువాత పాటలకు మాత్రమే పరిమితమయ్యారు. కృష్ణశాస్త్రి రాసిన కొన్ని లలిత గీతాలు సినిమా పాటలుగా రూపొందాయి. వాటిలో... ‘బంగారు పంజరం’ చిత్రంలో ‘పదములె చాలు రామా’, ‘గట్టుకాడ ఎవరో, సెట్టు నీడ ఎవరో’, ‘భక్తశబరి’లో ‘ఏమి రామకథ శబరీ శబరీ ఏదీ మరియొకసారి’, ‘రాక్షసుడు’ చిత్రంలో ‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి’, ‘ఆనంద భైరవి’ చిత్రంలో ‘కొలువైతివా రంగశాయి’ పాటలు కొన్ని మాత్రమే. కృష్ణశాస్త్రి 24 ఫిబ్రవరి 1980న మరణించిన విషయం తెలిసిందే. 1983లో ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ‘మేఘసందేశం’ సినిమా నిర్మించి అందులో కృష్ణశాస్త్రి రాసిన మూడు లలిత గీతాలను ఉపయోగించుకున్నారు. ఆ పాటలు బాగా పాపులర్‌ అయ్యాయి. అంతేకాకుండా దాసరి ‘మేఘసందేశం’ చిత్రాన్ని కృష్ణశాస్త్రికి అంకితమివ్వడంతో చిత్రసీమలోని పలువురు సినీ పండితులు హర్షించారు. ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’, ‘ముందు తెలిసేనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా’, ‘సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో’ అనేవి ‘మేఘసందేశం’ చిత్రంలో వినియోగించిన లలితా గీతాలు.


అలరించిన కృష్ణశాస్త్రి పాటలు...
‘మల్లీశ్వరి’ చిత్రంలో పాటలు ప్రకృతి శోభను ప్రతిబింబించాయి. ముఖ్యంగా ‘పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి’, ‘మనసున మల్లెలు మాలలూగెనే’, ‘ఎందుకే నీకింత తొందరా’, ‘నా ఇల్లు’ చిత్రంలో ‘అదిగదిగో గగనసీమ అందమైన చందమామ’, ‘వచ్చేనమ్మా సంక్రాంతి పచ్చని వాకిట చేమంతి’ వంటి పాటలు ఈ కోవలోకి వస్తాయి. కృష్ణశాస్త్రి రాసిన విరహగీతాలు అద్భుతాలే. ‘మల్లీశ్వరి’లో ‘ఎడతానున్నాడొ బావా జాడ తెలిసిన పోయిరావా అందాల ఓ మేఘమాలా’, ‘ఉండమ్మా బొట్టుపెడతా’లో ‘ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి’, ‘కలసిన మనసులు’ చిత్రంలో ‘ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలకరించకు నావైపిటు చూడకు’ పాటలు చెప్పుకోవచ్చు. కృష్ణశాస్త్రి ఎన్నో ప్రణయ గీతాలు, భక్తి గీతాలు, విషాద గీతాలు కూడా రాశారు. వాటిలో కొన్ని పాటలు చెప్పాల్సివస్తే...

* మనసున మల్లెల మాలలూగెనే ఎంతహాయి ఈ రేయి నిండెనో (మల్లీశ్వరి)

* పిలచిన బిగువటరా ఔరౌర (మల్లీశ్వరి)

* నీవుండేదాకొండపై నేనుండేదీ నేలపై (భాగ్యర్వేఖ)

* రావమ్మా మహాలక్ష్మి రావమ్మా (ఉండమ్మా బొట్టుపెడతా)

* చుక్కలుపాడే శుభమంత్రం (కళ్యాణ మండపం)

* గోరింట పూచింది కొమ్మ లేకుండా (గోరింటాకు)

* ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం (కార్తీకదీపం)

*
పాడనా తెనుగు పాటా (అమెరికా అమ్మాయి)

* నాపేరు బికారి నా దారి ఎడారి (శ్రీరాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌)

* కుశలమా నీకు కుశలమేనా (బలిపీఠం)

* నేలతో నీడ అన్నది నను తాకరాదని (మంచిరోజులు వచ్చాయి)

* ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి (ఏకవీర)

* ఘనా ఘన సుందరా కరుణారస మందిరా (భక్త తుకారాం)

* ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా (జగత్‌ కిలాడీలు)

* ఊరకే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది (సంపూర్ణ రామాయణం)

*
ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని (సుఖదుఃఖాలు)

* ఎవరు నేర్పేరమ్మ ఈకొమ్మకు (ఈనాటి బంధం ఏనాటిదో)

* మావిచిగురు తినగానే కోయిల పలికేనా (సీతామాలక్ష్మి)

* ఏమి రామకథ శబరీ శబరీ ఏదీ మరియొకసారి (భక్త శబరి)

* ఈ గంగకెంత దిగులు ఈ గాలికెంత గుబులు (శ్రీరామ పట్టాభిషేకం)

* చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు (చీకటి వెలుగులు)

* మాట చాలదా మనసు చాలదా (మట్టిలో మాణిక్యం)

* పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా (బంగారు పంజరం)

* రానిక నీకోసం సఖీ రాదిక వసంతమాసం (మాయని మమత)

* అడుగడుగున గుడి వుంది అందరిలో గుడివుంది (ఉండమ్మా బొట్టుపెడతా)


కృష్ణశాస్త్రికి అనేక సన్మానాలు, ప్రశంసలు లభించాయి. 1976లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్‌’ అవార్డునిచ్చి గౌరవించింది. 1978లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. ప్రఖ్యాత వ్యంగ్యచిత్రకారుడు, సాహితీవేత్త ‘బుజ్జాయి’ కృష్ణశాస్త్రి కొడుకే. చందమామలోని చల్లదనాన్ని, మందారపువ్వులోని మకరందాన్ని, గుండెలోని ఆర్దత్రని రంగరించి రాస్తే అది కృష్ణశాస్త్రి పాటవుతుంది. పట్టు పరికిణిలో ఒదిగిన సింగారం కృష్ణశాస్త్రి పాట. ఆయన తెలుగు పదం అమ్మమ్మ చేతిలో నేతి నైవేద్యం.


- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.