తెలుగు తెరని ‘ఫిదా’ చేసిన కలం

నేలమ్మ నేలమ్మ... అంటూ మట్టి పరిమళాల్ని వెదజల్లిన కలం అది. ఒకటే జననం ఒకటే మరణం... అంటూ పోరాట స్ఫూర్తినీ రగిలించింది. నువు యాడికెళ్తే ఆడికొస్త సువర్ణా... అంటూ కొంటె బాణాల్నీ విసురుతుంది. నీలి రంగు చీరలోన సందమామ నీర‌ జాణ...అంటూ మెలోడీ గీతాలతో మది మదినీ దోస్తుంది. ‘వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే...’ అంటూ ఎవ్వర్నయినా ‘ఫిదా’ చేసిన ఆ కలం సుద్దాల అశోక్‌తేజది. శ్రీశ్రీ, వేటూరి తర్వాత ‘నేను సైతం...’ అంటూ తెలుగు పాట కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన ఘనత సుద్దాలది. 23 యేళ్ల సినీ ప్రయాణంలో 1200 పై చిలుకు సినిమాల్లో 2400పైగా పాటల్ని రచించారు సుద్దాల. గరం గరం పోరి నా గజ్జల సవ్వారి... అంటూ పాటందుకొన్న సుద్దాల కలం... ఎప్పటికప్పుడు పదును పోసుకొంటూ వచ్చింది. ఇప్పటికీ ఆయన యువతరాన్ని ఉర్రూతలూగించేలా పాటలు రాస్తున్నారు సుద్దాల. విప్లవ భావాలైనా, జానప‌దమైనా, శృంగార రసాన్ని ఒలికించాలాన్నా... సెంటిమెంట్‌ గీతమైనా... ఆయన కలం నుంచి జాలువారిందంటే చాలు.. అది కొన్నాళ్లపాటు శ్రోతల మదిలో నిలిచిపోవల్సిందే. నటుడు ఉత్తేజ్‌ మేనమామ అయిన సుద్దాల అశోక్‌తేజ పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడు. తన మేనల్లుడి ప్రోద్భలంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తనికెళ్ల భరణి ప్ర‌మేయంతో తన తొలిపాటని ‘నమస్తే అన్న’లో రాశారు. ఆ తర్వాత నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. కృష్ణవంశీ, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలతోపాటు... శ్రీహరి కథానాయకుడిగా నటించిన పలు చిత్రాల్లో వరుసగా పాటలు రాస్తూ శ్రోతల్ని అలరిస్తూ వచ్చారు. తండ్రి, స్వాతంత్యస్రమర యోధుడైన సుద్దాల హ‌నుమంతు , డా. సి.నారాయణరెడ్డి రచించిన పాటల స్ఫూర్తితో పాఠశాల రోజుల నుంచే కలం కదిలిస్తూ వచ్చిన సుద్దాల అశోక్‌తేజ... ‘ఒసేయ్‌ రాములమ్మ’ సినిమాకి సి.నారాయణరెడ్డితో కలిసి పాటలు రాశారు. అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన ఘట్టం అని చెప్పుకొనే సుద్దాల అశోక్‌తేజ... సినిమా ఎలాంటి పాట కోరుకొంటే అలాంటి పాట రాసేలా తనని తాను మలచుకొన్నా అంటుంటారు. ఇటీవలే ఆయన రాసిన ‘ఫిదా’లోని గీతం యువతరంతో పాటు.. పెద్దవాళ్లని కూడా ఉర్రూతలూగిస్తోంది. ఈ రోజు ఆయన పుట్టినరోజు.

© Sitara 2018.
Powered by WinRace Technologies.