పాట ఆయన ఇంట్లోనే పుట్టింది. చిట్టిపొట్టి గౌనులు వేసుకుని ఆడి పాడింది. పెరిగి పెద్దవుతూ పరికిణీ వోణీలతో సింగారించుకుంది. జానపదం నుంచి జనపథం వరకూ దారులు కనుక్కొంది. చుట్టూ ఉన్న సమాజంలోని అన్యాయాలు, అక్రమాలకు కన్నెర్ర చేస్తూ పాట వొళ్లంతా ఎరుపురంగు పులుముకుంది. పాటతో అంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి కాబట్టే పాట సాహిత్యం సమకూర్చడంలో ఆయన ఎక్కడా తడబడలేదు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని మంచిపాటలతో సినీ సాహిత్యానికి వన్నె తేవడమే కాకుండా ‘నేను సైతం’ అంటూ తెలుగు పాటకు జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చి తలెత్తుకుని తిరిగే తెలుగు అక్షరంలా నిలుచున్నారాయన. ఆయనే...సుద్దాల అశోక్ తేజ.
నిజానికి అశోక్‌తేజ ఇంటిపేరు సుద్దాల కాదు. అసలు ఇంటిపేరు గుర్రం. తండ్రి గుర్రం హనుమంతు, తల్లి జానకమ్మ దంపతులకు అశోక్‌తేజ మే 16న జన్మించారు. తండ్రి హనుమంతు ప్రజాకవిగా ఆ ప్రాంతంలో లబ్ధ ప్రతిష్టులు. విప్లవభావాలు ఉన్న ఆయన తెలంగాణ విముక్తి పోరాటంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలసి కదం తొక్కారు. అంతే కాదు, స్వాత్రంత్య్ర సమరయోధులు కూడా. గుర్రం హనుమంతు సుద్దాల గ్రామానికి చెందినవారు కాబట్టి... సుద్దాల హనుమంతుగా ఆయన్ని అంతా పిలిచేవారు. తర్వాతర్వాత ఆదే ఇంటిపేరుగా మారింది. అదే ఆనవాయితీ అశోక్తేజకి కూడా సంక్రమించింది. గుర్రం అశోక్‌తేజ కన్నా సుద్దాల అశోక్తేజగానే ఆయన విశేష ప్రాచుర్యం పొందారు.
* చిన్నతనం నుంచే పాటతో స్నేహం అశోక్‌తేజ చిన్నతనం నుంచే పాటల్ని రాయడం మొదలు పెట్టారు. తన ఇంట్లోనే పుట్టి పెరిగిన పాటంటే ఆయనకు ప్రాణం...ప్రణవం...సర్వం. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు రాసిన పాటని ఇప్పటికీ తలచుకోవడమే కాకుండా...వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులతో పంచుకుంటూ బాల్య జ్ఞాపకాల్లో తలమునకలవడం అశోక్‌కి ఎంతో ఇష్టమైన వ్యాపకం. ఆ పాట జాతీయ జెండా మీద రాసింది. ధగ ధగలాడే జెండా... నిగనిగ మెరిసే జెండా... వినవే పేదల గాధ... చల్లారదు ఆకలి బాధ... అంటూ సాగిన ఆ పాట అప్పట్నుంచే అశోక్‌లో ఉన్న జాతీయ భావాల్ని ప్రతిబింబిస్తుంది. పాటలు రాస్తూ పెరిగిన అశోక్ చదువు అయిపోయిన తరువాత అధ్యాపక వృత్తిలో ప్రవేశించారు. కరీంనగర్ జిల్లా బండలింగాపూర్, మేడిపల్లి, మేట్పల్లి గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్ టీచర్‌గా పనిచేసారు.
* తొలి అవకాశం అందుకున్నది ఇలా సుద్దాల అశోక్‌తేజ అక్క కొడుకు ఉత్తేజ్ సినిమా రంగంలో పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి అశోక్ రాసిన పాటలు, నాటికలు, ఏకపాత్రాభినయనాలు చూస్తూ పెరిగిన ఉత్తేజ్ చేయూత సినీ రంగంలో అశోక్ పాటల ప్రస్థానానికి ఎంతగానో సహకరించింది. ఓసారి హైదరాబాద్‌లో అశోక్ పాటల కచేరి జరుగుతోంది. ఆ కార్యక్రమానికి గద్దర్, పాత్రికేయుడు శ్రీ కృష్ణ కూడా వచ్చారు. ఆ కార్యక్రమ సమాచారం పత్రికల్లో చూసిన తనికెళ్ల భరణి, ఉత్తేజ్‌తో ఓసారి మీ మామయ్యని తీసుకురమ్మని... ఆయన పాటలు వినాలని ఉందని చెప్పారు. దాంతో, తనికెళ్ల భరణి దగ్గరికి అశోక్ వెళ్లి తానూ రాసిన పాటలు కొన్ని పాడి వినిపించారు. అలా ఓ ఘట్టం పూర్తయింది. అయితే, తనికెళ్ల భరణి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని అశోక్‌కి నేరుగా చెప్పలేదు. అశోక్ కూడా సినిమా అవకాశాల కోసం అడగలేదు. కొన్నాళ్ల తర్వాత... కె.రంగారావు దర్శకత్వం వహిస్తున్న ‘నమస్తే అన్న’ చిత్రం కోసం తనికెళ్ల భరణి, అశోక్‌ని పిలిపించి అవకాశం ఇప్పించారు. కోటి సంగీత దర్శకత్వంలో అశోక్ రాసిన తొలిపాట పల్లవి ఇదే... ‘గరం గరం పోరి... నా గజ్జెల సవ్వారి... బుంగమూతి ప్యారి... నా బుల్ బుల్ సింగారి...’. ఈ పాట అప్పట్లో ఎంతో జనాదరణ పొందింది. తనకు సినిమాల్లో పాటలు రాసే తొలి అవకాశాన్ని తనికెళ్ల భరణి వల్లే వచ్చిందని అశోక్ ఎంతో వినమ్రతతో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడం... పాటలు చక చకా రాయడంతో ఇండస్ట్రీలో ఆయన బిజీ అయ్యారు. అయినా... గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధపడలేదు.

* సినారె అంటే ఎంతో ఇష్టంఅశోక్తేజకి డాక్టర్ సినారే అంటే ఎంతో ఇష్టం. ఆయన పాటలంటే చెవికోసుకుంటారు.. మరీ ప్రత్యేకించి ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో... ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో...?’ అన్న పాత అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఆ పాట వింటుంటే... బాల్య జ్ఞాపకాలు ఆయనకు గుర్తొస్తాయి. తమ వూళ్లో కొండలెక్కి తిరిగిన రోజులు గుర్తొస్తాయి. సినారె సరసన కవిగా ఒక్క క్షణం కనిపించినా చాలు... అనే కోరిక చిన్ననాటి నుంచి ఆయన్ని తొలుస్తూనే ఉంది. ఆ కోరిక ఎట్టకేలకు ‘ఒసే...రాములమ్మ’ చిత్రం ద్వారా తీరింది. తెరపై మొదట సినారె పేరు...ఆ తర్వాత అశోక్ పేరు. అప్పటి ఆనందాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్తుంటారు అశోక్. ‘ఒసే... రాములమ్మ’ సినిమాకి పాటలు రాసే సందర్భంలో దర్శకుడు దాసరి నారాయణరావు ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదని ఆయన అంటారు.
* నేను సైతం...పాటకి జాతీయ పురస్కారం చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ చిత్రంలో సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘నేను సైతం’ పాటకి జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సినిమా పాటకి ఇలా జాతీయ పురస్కారం దక్కడం ముచ్చటగా మూడోసారి. మొదట ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా!’ అనే పల్లవితో సాగే చైతన్యగీతానికి ఈ గౌరవం దక్కగా...రెండోసారి ‘మాతృదేవోభవ’ చిత్రం కోసం వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ‘రాలిపోయే పువ్వా...నీకు రాగాలేందుకు?’ అన్న పాటకు జాతీయ పురస్కారం లభించింది. 2003 సంవత్సరంలో ‘ఠాగూర్’ సినిమాలో నేను సైతం...అనే పాటతో సుద్దాల అశోక్‌తేజ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అన్యాయాలు, అక్రమాలపై ఎక్కుపెట్టిన బాణం లాంటి ‘ఠాగూర్’ చిత్రంలో చిరంజీవికి ఆ స్థాయి పాటను రాయడం తనను వరించి వచ్చిన అదృష్టమని అశోక్ అంటూంటారు. మహాకవి శ్రీశ్రీ రాసిన పల్లవితో సాగే పాటలో చిత్రంలో సన్నివేశానుగుణంగా చరణాలను సుద్దాల అశోక్‌తేజ రాసారు. మహాకవి శ్రీశ్రీని ఆవాహన చేసుకుని మరీ ఈ పాటను రాసానంటూ ఆనాటి అనుభవాన్ని తరచూ గుర్తు చేసుకుంటారాయన.
* అన్ని రకాల పాటలు ఆయనకు కరతలామలకంసుద్దాల అశోక్‌తేజ కేవలం విప్లవ గీతాలే రాస్తారేమో... అనుకున్నవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అన్ని రకాల పాటల్ని రాస్తూ ప్రజామోదాన్ని పొందారు. ‘నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణా...’, ‘ఏం సక్కగున్నావో ... నా సొట్టసెంపలోడా!, దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే..., మీసాలు గుచ్చకుండా, నీలి రంగు చీరలోనా సందమామ నీవే జాణ, వచ్చిండే ..మెల్ల మెల్లగా వచ్చిండే...అంటూ ఇటీవల కాలంలో హిట్ అయిన ‘ఫిదా’ చిత్రంలోని పాటతో సహా...రొమాంటిక్ టచ్ ఉండే అనేకానేక పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. కేవలం విప్లవ పాటలే రాస్తారన్న అపవాదును తొలగించుకుని...అన్ని రకాల పాటల్ని రాయగల సత్తా, సమర్ధత తనకుందని నిరూపించిన సినీ కవి సుద్దాల అశోక్ తేజ. శంకర్ దర్శకత్వం వహించిన ‘రోబో’ సినిమాలో కూడా అశోక్‌తేజ రాసిన పాటలు జనాదరణ పొందాయి. ఓ మరమనిషి మాలోకి రా..., ఇనుముతో హృదయం మొలిచెలే...ముద్దిమ్మంటూ నిన్నే వలచేలే...పాటలు ఎంత విజయం సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్ఫూర్తివంతమైన పాటలు కూడా ఎన్నో రాసి యువత హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. శ్రీహరి హీరోగా నటించిన ‘భద్రాచలం’ సినిమాలో ‘ఒకటే జననం...ఒకటే మరణం... ఒకటే గమనం...ఒకటే గమ్యం...గెలుపు పొందేవరకూ అలుపు లేదు మనకు...’ అనే పాట సుద్దాల అశోక్‌తేజ గీతాల్లో మెచ్చుతునకగా పేర్కొనవచ్చు. ఇలాంటి మెరుపులు ఎన్నో పాటల్లో మెరిపించారు. నేలమ్మా...నేలమ్మా.., ఆలీ నీకు దండమే... అర్ధాంగి నీకు దండమేలాంటి పాటలు ఎన్నో రాసారాయన.
* వ్యక్తిగతంసుద్దాల అశోక్‌తేజ నిర్మలను వివాహమాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జ్వాలా చైతన్య, అరుణ్ తేజ, ఒక కూతురు స్వప్న. వీరందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. జ్వాలా చైతన్య సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా అమెరికాలో పనిచేస్తున్నారు.
* సుద్దాల ఫౌండేషన్ ద్వారా సేవలు2010 అక్టోబర్ 13సుద్దాల ఫౌండేషన్ స్థాపించి తన తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల జ్ఞాపకార్ధం విశేష ప్రతిభ కనబరిచినవారికి పురస్కారాలు అందజేస్తున్నారు.
- పి.వి.డి .ఎస్.ప్రకాష్