బన్నీ - పూజ.. సామజవరగమన

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడుగా వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతుందీ చిత్రం. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ అంచనాలను అమాంతం పెంచే ఓ చక్కటి మెలోడీ గీతంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది చిత్ర బృందం. ‘‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు... ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయ లేదా అసలు...’’ అంటూ సాగే తొలి లిరికల్‌ గీతాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి నెట్టింట మంచి ఆదరణ లభిస్తోంది. దీనికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చగా... తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ పాట గురించి సంగీత దర్శకుడు తమన్‌ తాజాగా పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. సహజమైన వాయిద్య పరికరాలతో సమకూర్చిన గీతమని ఆయన స్పష్టం చేశారు. ‘‘అల్లు అర్జున్‌కి పాట స్వరపరచడం చాలా కష్టమైన పని. చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఆయన చేసే నృత్యాలు, అందులో ఆయన ప్రతిభ ఉన్నతస్థాయిలో ఉంటుంది. ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ చిత్రాల కోసం ఇప్పటికే 12 పాటలు సమకూర్చా. అవి ఎంతగానో విజయవంతమయ్యాయి. వాటి తర్వాత చేస్తున్న ప్రయాణం ఈ చిత్రం. త్రివిక్రమ్, సీతారామశాస్త్రిలతో ప్రయాణం ఎప్పుడూ గొప్పగా, ప్రతి రోజూ కొత్తగా ఉంటుంది. పని విధానమే మారిపోతుంటుంది. ‘సామజవరగమన...’ అంటూ సాగే ఈ గీతం మంచి మెలోడీ. ఎక్కువ ఎలెక్ట్రానిక్స్‌ పరికరాలు లేకుండా.. సహజంగా వయొలిన్, పియానో, గిటార్, డ్రమ్స్, బేస్‌ గిటార్‌ తదితర వాయిద్యాలతో 70 మందితో కూడిన ఆర్కెస్ట్రా, 35 పీస్‌ బ్యాండ్‌తో తీర్చిదిద్దిన గీతమిది. మేం చేసిన ఈ ప్రయోగం చాలా ఉత్తేజాన్నిచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ఈ పాటకి మరింత గౌరవాన్నిచ్చింది. సిద్‌ శ్రీరామ్‌ సందర్భాన్ని అర్థం చేసుకొని చాలా స్వచ్ఛంగా పాడారు’’ అని ఇటీవలే ఓ వీడియో ద్వారా వివరించారు తమన్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొటోంది ఈ చిత్రం. పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. తదుపరి విదేశాల్లో పాటల్ని తెరకెక్కించబోతున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.