బుజ్జి బంగారం.. పెట్టమాకు అంతదూరం
చిత్రం: ‘గుణ 369’

గానం
: నకాష్‌ అజీజ్‌, దీప్తి

సంగీతం
: చేతన్‌ భరద్వాజ్‌

రచన
: అనంత శ్రీరామ్‌


పల్లవి

అతడు: కలలో కూడా కష్టం కదే ఈ హాయి కథ మొత్తం తిప్పేశావే అమ్మాయీ
ఆమె: వదలాకుండా పట్టూకుంటా నీ చేయి నువ్వు అట్టా నచ్చేశావోయ్‌ అబ్బాయీ

అతడు: నమ్మలేక నమ్మాలేక నన్ను గిచ్చుకుంటున్నా నొప్పి పుట్టి ఎక్కళ్లేని సంతోషంలో తుళ్లుతున్నా
ఆమె: నవ్వలేక నవ్వాలేక పొట్ట పట్టుకోనా పిచ్చిపట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా

అతడు: తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ వయ్యారం చల్లుతుంది తీపి కారం
ఆమె: నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ యవ్వారం తెంచుతుంది సిగ్గుదారం

చరణం 1
అతడు: సొంత ఊరిలో కళ్ల ముందరే కొత్త దారులెన్నో పుట్టాయే
ఆమె: అంతేలేరా జంటగుంటే అంతే లేరా

అతడు: సొంత వారితో ఉన్న నిన్నలే గుర్తురాము పొమ్మనన్నాయే
ఆమె: జతలో పడితే జరిగే జాదూ ఇదేగా ముద్దులెన్నో పెట్టాలిగా పెట్టి గాల్లో పంపాలిగా ఊపిరంతా గంధమైపోయేంతగా

అతడు: ముందుకొచ్చే ఉన్నానుగా ఎందుకమ్మా ఇంకా దగా నన్ను మళ్లీ మళ్లీ ఊరించేంతగా
ఆమె: తప్పదింక భరించరా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ యవ్వారం మించిపోతే పెద్ద నేరం నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ వయ్యారం పెట్టమాకు అంతదూరం

చరణం 2
అతడు: నిన్ను తాకితే ఒక్కసారిగా పట్టుకుంది నన్ను అదృష్టం
ఆమె: చాల్లే చాల్లే ఎక్కువైంది తగ్గించాల్లే

అతడు: ఉన్న జన్మనీ ముందు జన్మనీ చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం
ఆమె: అడెడే అదిగో ముదిరే పైత్యం అదేలే ఎన్నో ఎన్నో అన్నారులే ఎన్నో ఎన్నో విన్నాములే వట్టి మాటల్లోనే ఎన్నో వింతలే

అతడు: సర్లే సర్లే చెప్పావులే సందు సందు తిప్పావులే వచ్చి చేతల్లోనే చూపిస్తా భలే
ఆమె: తప్పదింక భరించనా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ యవ్వారం నచ్చుతుంది శుక్రవారం

అతడు: నా బంగారం బుజ్జీ బుజ్జీ బంగారం నీ వయ్యారం గుచ్చుతుంది పూలహారం


ప్రేమలో పడితే జరిగే జాదూనే వేరు!
కారం కూడా తీయగా ఉంటుంది. గిల్లినా గిచ్చినా హాయైపోతుంది. కలలు నిజంగా, నిజాలు కలలుగా మారిపోతాయి. గతం మర్చిపోయి భవిష్యత్తు కూడా వర్తమానంగా అల్లరి పెడుతుంది. ఓ అబ్బాయికి ఇలాంటి అనుభూతులే కలిగాయి. ఓ అమ్మాయి తన జీవితంలోకి రాగానే జాతకం మొత్తం మారిపోయింది. ఇక ఊరుకుంటాడేంటి? నచ్చిన ప్రేయసిని ‘బంగారం.. బుజ్జి బంగారం’ అంటూ వెంటపడ్డాడు. ఆ అబ్బాయి చిలిపి వర్ణనలకు ఆ అమ్మాయి కూడా గడుసుగానే సమాధానం చెప్పింది. ఈ సంభాషణలకు ‘స రి గ మ ప ద ని స’లు తోడయ్యాయి. దాంతో ఓ అందమైన పాట పుట్టింది. ‘గుణ 369’ కోసం. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనఘ నాయిక. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ‘బుజ్జి బంగారం’ పాట గురించి రచయిత అనంత శ్రీరామ్‌ ఇలా చెప్పుకొచ్చారు.

‘‘తొలిసారి ప్రేమలో పడినప్పుడు, తొలి చూపులోనే ప్రేమ మొదలైనప్పుడు వచ్చే పాటలు ఒకలా ఉంటాయి. ‘గుణ 369’లో సందర్భం అది కాదు. ఇద్దరూ ఎప్పుడో ప్రేమలో పడిపోయారు. ఇద్దరి ప్రేమ ముదిరింది. ఈ సమయంలో పాడుకోవాల్సిన యుగళ గీతం ఇది. ఆ ప్రేమలో కాస్త సున్నితమైన శృంగారం కూడా కనిపించాలి. సాధారణంగా అమ్మాయిలపై అబ్బాయిలకు ప్రేమ పుట్టుకొచ్చినప్పుడు ‘బంగారం’ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. అందుకే ‘బుజ్జి బంగారం’ అంటూ కాయినింగ్‌ చేసి ఈ పాట రాశా. ముందు ‘బంగారం..’ అన్న పదం రాశాకే... దానికి లీడ్‌గా పల్లవి, చరణాలు రాసుకొచ్చా.

గుణ జీవితంలోకి అమ్మాయి రాగానే... అదృష్టం తన్నుకొస్తుంది. ఎప్పటి నుంచో కంటున్న కల నిజం అయిపోతుంది. అందుకే.. ‘కలలో కూడా కష్టం కదే ఈ హాయి.. కథ మొత్తం తిప్పేశావే అమ్మాయీ’ అంటూ పాట మొదలెట్టా.

చరణంలో మరో చోట.. ‘నిన్ను తాకితే ఒక్కసారిగా పట్టుకుందె నన్ను అదృష్టం’ అని రాశా. ఈ పాటలో కొన్ని ప్రయోగాలు, కొన్ని చమత్కారాలూ చేసే అవకాశం దక్కింది. సాధారణంగా నొప్పి పుడితే బాధ వస్తుంది. కానీ ప్రేమలో మత్రం ఆ బాధ కూడా సంతోషాన్నే ఇస్తుంది. అందుకే ఓ చోట.. ‘నమ్మలేక నమ్మాలేక నన్ను గిచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కళ్లేని సంతోషంలో తుళ్లుతున్నా’ అని రాశాను. హుక్‌ లైన్‌ ‘బంగారం’ అని ఎంచుకున్నా కాబట్టి.. ‘రం’ ప్రాసతో అంతమయ్యే పదాలనే ఎక్కువగా రాశా. తీపికారం, సిగ్గుదారం, యవ్వారం, వయ్యారం, పూలహారం, శుక్రవారం... ఇలాంటివి వినిపిస్తాయి.

ఈ పాటలోని గమ్మత్తేమిటంటే కథానాయకుడు తన పాటలతో, మాటలతో ఎంత హంగామా చేస్తున్నా, నాయిక మాత్రం చాలా సెటిల్‌గా సమాధానాలు ఇస్తుంటుంది. ‘చాల్లే.. చాల్లే.. తగ్గించు’ అంటూ గుంభనంగా ఉంటుంది. ఇక్కడ కూడా నాయిక పాత్ర ఔచిత్యాన్ని చూపించే అవకాశం వచ్చింది.

కథ తెలిస్తే రొటీన్‌ సందర్భాన్ని సైతం కొత్తగా రాసే అవకాశం ఉంటుంది. ‘గుణ 369’ కథ నాకు తెలుసు. ఈ పాట సందర్భాన్ని కూడా దర్శకుడు వివరించారు. దాంతో పాట రాయడం సులభమైంది. ఇలాంటి పాటలకు ఫోక్‌ ముద్ర పడుతుంది. కానీ సంగీత దర్శకుడు ఇచ్చిన సౌండింగ్‌ వల్ల పాటకు కొత్త సొగసులు వచ్చాయి. పాట కోసం ఉపయోగించిన సంగీత వాయిద్యాల వల్ల మోడ్రన్‌ లుక్‌ వచ్చింది’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.