కథానాయకుడు మహేష్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కలయికలో సినిమా వస్తుందంటే అంచనాలు మామూలుగా ఉండవు. ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ చిత్రాలు ఈ జాబితాలో నిలుస్తాయి. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి కలిసి పనిచేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాట విడుదలైంది. ప్రతి సోమవారం ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘మైండ్ బ్లాక్’ అనే హుషారెత్తించే పాటను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఫాస్ట్బీట్లో సాగే ఈ పాట శ్రోతల్ని అలరిస్తుంది. ‘ఎపుడూ ప్యాంటేసేవాడు ఇపుడు లుంగీ కట్టాడు.. ఎపుడూ షర్టేసేవాడు ఇపుడు జుబ్బా తొడిగాడు’ అనే పల్లవి కథానాయకుడు క్లాస్ నుంచి మాస్ లుక్‌కి మారాడని చెప్పకనే చెప్తుంది. మధ్యలో మహేష్ వాయిస్ వావర్ అందించడంతో అభిమానులు పండగ చేసుకుంటారు. శ్రీమణి, దేవీశ్రీ ప్రసాద్ సాహిత్యం అందించగా బ్లేజ్, రైనా రెడ్డి ఆలపించారు.