పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇట్లాగే ఉంటాదట!

పెళ్లి తర్వాత నాగచైతన్య - సమంత తొలిసారి కలిసి నటిస్తోన్న చిత్రం ‘మజిలీ’. దివ్యాంశా కౌశిక్‌ మరో కథానాయికగా నటిస్తోంది. ‘నిన్ను కోరి’ చిత్రంతో మంచి హిట్‌ అందుకున్న శివ నిర్వాణ.. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర ప్రచార పర్వాన్ని షురూ చేసింది చిత్ర బృందం. దీనిలో భాగంగా తాజాగా చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. దీన్ని చైతన్య తన ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. ‘‘మజిలీ’లో నాకు ఇష్టమైన ‘వన్‌ బాయ్‌.. వన్‌ గర్ల్‌..’ పాట ఇదుగో. పెద్దలు కుదిర్చి, చేసిన పెళ్లిపై పూర్ణ (చైతన్య) తన బాధను వ్యక్తపరుస్తున్నాడు’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ‘‘వన్‌ బాయ్‌ వన్‌ గర్ల్‌ లుకింగు, హైటు వెయిటు చెకింగు’’ అంటూ క్యాచీ క్యాచీ ఆంగ్ల పదాలతో సాగుతున్న ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించగా.. రేవంత్‌ ఎంతో చక్కగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తి కాగా.. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌ హక్కులు రూ.2.5 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.