నీతో రాని జన్మింక నరకం..
సరికొత్త వర్ణనలకి వేదిక ప్రేమ పాట. ప్రణయ గీతం అనగానే పదాలు పోటీ పడుతుంటాయి. భావాలు పొంగి పొర్లుతుంటాయి. చాలా రోజుల తర్వాత అలాంటి మరో పాట వచ్చింది. ‘మన్మథుడు 2’ చిత్రం కోసం శుభం విశ్వనాథ్‌ అనే ఓ కొత్త రచయిత రాసిన పాట అది. నాగార్జున, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా... రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ‘నాలోనా నీవేనా...’ పాట ప్రయాణం గురించి శుభం విశ్వనాథ్‌ చెప్పిన విషయాలివీ...‘‘నాగార్జున నటించిన ‘మజ్ను’ సినిమా చివర్లో ‘ప్రేమకు మరణం లేదు, మరణానికి ప్రేమ కారణం కారాదు’ అని ఒక వాక్యం తెరపైన పడుతుంది. ఆ లైన్‌తోనే నా పాట ప్రయాణం మొదలైంది. అప్పటివరకు పాటంటే ఏమిటో తెలియదు నాకు. థియేటర్‌ నుంచి బయటికి వచ్చాక ఆ వాక్యాన్నే ఓ ట్యూన్‌గా చేసుకొని పాడా. ఆ తర్వాత దీనికి పల్లవి తయారు చేస్తే ఎలా ఉంటుందని ‘నా పాటకి పల్లవి నీవే అనుకొన్నా... నా ప్రేమకి మనసు నీవే అనుకొన్నా.. ప్రియా ఓ ప్రియతమా’ అని రాసుకొని, దానికి ట్యూన్‌ కట్టి మా అన్నయ్యకి వినిపించా. అప్పట్నుంచి పాటే నా వ్యాపకమైంది. వీలున్నప్పుడంతా మా ఊరు విజయ నగరం జిల్లా చీపురుపల్లి నుంచి హైదరాబాద్‌కి వచ్చి సంగీత దర్శకుల్ని కలిసి వెళుతుండేవాణ్ని. వాళ్ల బాణీలకి డెమోలు రాసేవాడిని. అలా సంగీత దర్శకుడు చైతన్‌ భరద్వాజ్‌ బాణీలకి కూడా రాసేవాణ్ని. ఆయన నాకు మొదట ‘ఆర్‌ఎక్స్‌ 100’లో పాట రాసే అవకాశం ఇచ్చారు. కానీ అప్పుడు వ్యక్తిగత కారణాలవల్ల పాట రాయలేకపోయా. అయినా నన్ను గుర్తుపెట్టుకొని ‘గుణ 369’, ‘మన్మథుడు 2’ చిత్రాలకు పాటలు రాసే అవకాశాన్నిఇచ్చారు. నా రెండో చిత్రమే నాగార్జునగారి సినిమా కావడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇన్నాళ్లూ చూసింది నిన్నేనా అని ఒక అమ్మాయి తన ప్రియుడిని ఉద్దేశించి ఓ రకమైన సంశయంతో పాడుకొనే పాట ఇది. ఒకటో చరణంలో ప్రేమలోని హాయితో పాటు నువ్వు లేకపోతే నా హృదయం ఒక ప్రళయమే అని చెబుతూ రాశా. రెండో చరణం ‘నీలాంబరమే.. వాలే నీ కళ్లలో, తారలే నిన్ను వర్ణించగా’ అంటూ రాశా. పరోక్షంగా నువ్వే నా ప్రపంచం అన్నది అక్కడ అర్థం. నాగార్జున లాంటి అగ్ర కథానాయకుడి సినిమాకి పాట రాయడం కొత్త రచయితగా నాకు సవాలే. దాంతో భయం, బాధ్యతతో పాట రాశా. బాణీలోనే ఆత్మ, అమృతతత్వం ఉంటుంది. నేను కేవలం అక్షరాలే రాయగలను. గాయని చిన్మయి ఈ పాటకి ప్రాణం పోశారు. చైతన్‌ భరద్వాజ్‌ బాణీ గొప్పగా ఉంటుంది. ఈ పాట విడుదల కాగానే సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభించింది. నాగార్జునగారు పాట వినగానే, కొత్త కుర్రాడు బాగా రాశాడని చెప్పారట. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ‘ఒకసారి ట్విటర్‌లో చూడు, నీ పాటకి స్పందన ఎలా ఉందో’ అని సందేశం పంపించారు. ఇందులో మరో రెండు పాటలు రాశా’’.


చిత్రం: మన్మథుడు 2
గానం: చిన్మయి
రచన: శుభమ్‌ విశ్వనాథ్‌
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌

పల్లవి: నా..లోనా నీ..వేనా
ప్రేమై నేడు పూచేనా
నా పెదవుల్లో పాటై
ఎగసే కెరటమవుతోంది హృదయం
ఎదలో నిన్ను చేసింది పదిలం
నిన్నే చూస్తు కరిగిందిలే కాలం
పగలే వెన్నెలయ్యింది భువనం
కలలే మరిచి చూస్తోంది నయనం
నీలో కలిసి రానంది నా ప్రాణం
ప్రేమా.. ఈ వింత కొత్తగుందిలే
నాలో నీ జతలో ఈవేళా
ప్రేమా ఈ హాయి పొంగుతోందిలే
నాలో నా జతకై రావేలా
నువ్వే లేని హృదయాన ప్రళయం
నీతో రాని జన్మింక నరకం
నీకై అడుగులేస్తోంది నా పాదం
పరువం ఉరకలేస్తున్న తరుణం
ఆహా.. చెప్పలేనంత మధురం
మనసా చేసి పోవద్దులే గాయం

చరణం: 1
నీలాంబరమే.. వాలే నీ కళ్లలో
తారలే నిన్ను వర్ణించగా
కుంకుమ పువ్వై విరిసే ఎద నందనం
వెన్నెలై నువ్వు వర్షించగా
పరిమళవదా.. నిను తాకే గాలి
ఎద లయ వినవా శ్వాసే నీవై
పగడపు కలువ నిను చేరే దారీ
పదములకెరుకా.. తోడై రావా
।।నాలోన నీవేనా।।

చరణం: 2
తలపులు పారిజాతమో
నీ పిలుపులు సుప్రభాతమో
వైనం చూస్తే రుతువులలో నయగారం
రూపం చూస్తే మధువుల జలపాతం
నా మనసిక రాసే నీకై వలపుల మృదుకావ్యం
నాలో మౌనం పలికెను హిందోళం
నీ కలయిక పొందే వేళా కదలదు
ఇక కాలం ।।నాలోన నీవేనా।।
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.