అసలైన న్యాయానికి ‘దో భాయి’ పాట

హిందీ చలనచిత్రసీమలో మంచి అభిరుచి గల నిర్మాత, దర్శకునిగా బ్రిజ్‌ మోహన్‌కు పేరుంది. అతని అసలు పేరు అని బ్రిజ్‌మోహన్‌ కిషన్‌ లాల్‌ సదానాథ్‌. సన్నిహితులు బ్రిజ్‌ అని పిలుస్తుంటారు. పాకిస్తాన్‌లోని గుజ్రన్వాలాలో జన్మించి, దేశ విభజనాంతరం బొంబాయిలో స్థిరపడిన కుటుంబం వారిది. బ్రిజ్‌ నిర్మాణంలో ‘దో భాయి’, ‘ఏ రాత్‌ ఫిర్‌ న ఆయెగీ’, ‘ఉస్తాదోం కి ఉస్తాద్‌’, ‘నైట్‌ ఇన్‌ లండన్‌’, ‘విక్టోరియా 203’, ‘చోరి మేరా కామ్‌’, ‘యకీన్‌’, ‘ప్రొఫెసర్‌’ వంటి అనేక సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. బ్రిజ్‌ సినిమాలకు ఎక్కువగా కల్యాణ్‌ జి ఆనంద్‌ జి సంగీతం సమాకూర్చేవారు. ఎనభై దశకంలో బ్రిజ్‌ నిర్మించిన ‘‘ఊంచే లోగ్‌’, ‘బాంబే 405 మెయిల్స్‌’, ‘మగ్రూర్‌’ సినిమాలు పరాజయాలు చవిచూశాయి. అయితే చివర్లో నిర్మించిన ‘తఖ్దీర్‌’, ‘మర్దోన్‌ వాలి బాత్‌’ సినిమాలు బాగా ఆడాయి. ఎంతటి మేధావికైనా ఎక్కడో ఒక దగ్గర బలహీనత తొంగిచూస్తూ ఉంటుంది. 1990లో కుమారుడు కమల్‌ పుట్టినరోజు సందర్భంగా బాగా తాగిన మైకంలో ఒళ్లు తెలియక భార్య సయీదాఖాన్‌ (నటి)ను, కూతుర్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి, ఆ మత్తు దిగిన తర్వాత తను చేసిన తప్పుకు శిక్ష విధించుకుంటూ పిస్తోలుతో కాల్చుకుని బ్రిజ్‌ కూడా చనిపోవడం ఒక విషాదకర సంఘటన. దర్శకుడిగా బ్రిజ్‌ తొలి చిత్రం 1960లో విడుదలైన ‘తూ నహీ అవుర్‌ సహి’, 1969లో అశోక్‌కుమార్‌, జితేంద్ర, మాలాసిన్హా, జగ్దీష్‌, షేక్‌ ముఖ్తర్‌, చాంద్‌ ఉస్మాని ప్రధాన తారాగణంగా ‘దో భాయి’ సినిమా నిర్మించారు. ఆ సినిమాకు సంగీత దర్శకత్వం వహించింది కళ్యాన్‌ జి ఆనంద్‌ జి శిష్యులు లక్ష్మికాంత్‌ ప్యారేలాల్‌. ఈ సినిమాలో అశోక్‌కుమార్‌, జితేంద్ర అన్నదమ్ములు. ఒకరు న్యాయాధికారి కాగా మరొకరు పోలీసు ఉన్నతాధికారి. అన్న వద్ద కార్యదర్శిగా పనిచేసే అమ్మాయిని తమ్ముడు ప్రేమించడం, ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీయడం ఈ సినిమా నేపథ్యం. సినిమా సూపర్‌హిట్‌ కావడంతో 1971లో ఆ సినిమాను తమిళంలో మోడరన్‌ థియేటర్స్‌ వారు ‘జస్టీస్‌ విశ్వనాథన్‌’గా నిర్మించారు. అందులో అశోక్‌కుమార్‌ పాత్రను మేజర్‌ సుందర్‌రాజన్‌ ధరించగా, తమ్ముడుగా రవిచంద్రన్‌, హీరోయిన్‌గా మణిమాల నటించారు. ఈ సినిమా 1976లో ‘ప్రేమద కానికే’ పేరుతో కన్నడంలో కూడా నిర్మించారు. దాదాపు ఇదే కథా నేపథ్యంలో తెలుగులో మోడరన్‌ థియేటర్స్‌ వారే తమ 110వ చిత్రంగా ‘నేనంటే నేనే’ అనే పేరుతో సినిమా నిర్మించారు. తెలుగు సినిమాలో దర్శకుడు జి.వి.ఆర్‌.శేషగిరిరావు చాలా మార్పులు, చేర్పులు చేశారు. ఇందులో గుమ్మడి, కృష్ణ, కాంచన, సత్యనారాయణ ముఖ్యపాత్రలు పోషించారు. మోడరన్‌ ఆర్ట్స్‌ సంస్థకు వేదా అనబడే ఎస్‌.ఎస్‌ వేదాచలం ఆస్థాన సంగీత దర్శకుడు. తొలుత సింహళ సినిమాలకు సంగీత దర్శకుడిగా ఉంటూ మోడరన్‌ ఆర్ట్స్‌ సంస్థలో చేరాడు. ముఖ్యంగా హిందీలో అందంగా అమరిన సూపర్‌హిట్‌ పాటలను యాధాతధంగా తమిళంలో కానీ, లేక తెలుగులో కానీ మలచడంలో అతనికి అతనే సాటి. ‘నేనంటే నేనే’ సినిమాకు సంగీతం సమకూర్చింది వేదానే. ‘దోభాయి’ సినిమాలో బాగా జనరంజకమైన మహమ్మద్‌ రఫీ ఆలపించిన ‘ఇస్‌ దునియా మే ఒ దునియావాలో బడా ముష్కిల్‌ హై ఇన్సాఫ్‌ కర్నా... బడా ఆసాన్‌ హై దేనా సజాయే బడా ముష్కిల్‌ హై పర్‌ మాఫ్‌ కర్నా’ అనే పాటను తెలుగులో యధాతధంగా దించేశాడు. హిందీలో నాలుగు చరణాలున్న ఈ పాటకు డా।। సి.నారాయణరెడ్డి కూడా నాలుగు చరణాలు రాశారు. ‘ఏది ఇలలోన అసలైన న్యాయం... తేల్చగలిగేది కనరాని దైవం, మనిషి పగబూని చేసేది నేరం... ఎపుడు దిగపోని పెను పాపభారం’ అంటూ సాగే ఈ పాటను సినిమా టైటిల్స్‌ పడుతుండగా గుమ్మడి మీద చిత్రీకరించారు. నేపథ్య సంగీతం దగ్గర నుంచి, పల్లవి, చరణాలు కూడా హిందీలో ఉన్నట్లే స్వరపరచడం వేదా ప్రత్యేకత. అయితే సినిమా టైటిల్స్‌ కేవలం రెండు చరణాలతో మాత్రమే పూర్తికావడం ఈ పాట విశేషం. తమిళంలో రావు బాల సరస్వతి చేత పాడించిన తొలి సంగీత దర్శకుడు వేదా (మర్మవీరన్‌ -1956). బి.ఎస్‌.నారాయణ తెలుగులో నిర్మించిన ‘ఆమె ఎవరు’ (హిందీలో ‘ఓ కౌన్‌ థీ’, తమిళంలో ‘యార్‌ నీ’) సినిమాకు, ‘అవేకళ్లు’ వంటి మరెన్నో తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం నిర్వహించింది కూడా వేదా నే.


చిత్రం: మోడరన్‌ థియేటర్స్‌ వారి ‘నేనూ మనిషినే’ (16-10-1971)
గీతరచన: డా।। సి.నారాయణరెడ్డి
గానం: ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: వేదా (వేదాచలం)
అభినయం: గుమ్మడి (టైటిల్స్‌ పడేటప్పుడు)

ఏది ఇలలోన అసలైన న్యాయం... తేల్చగలిగేది కనరాని దైవం
।।2।।
మనిషి పగబూని చేసేది నేరం... ఎప్పుడు దిగిపోని పెను పాపభారం
।।ఏది।।
కాలమే నిన్ను కవ్వించెనేమో... కోపమే నిన్ను శాశించెనేమో
।।2।।
శిక్ష విధియించు నీ చేతితోనే... కక్ష సాధించ విధి వ్రాసెనేమో
మనసు పొరలందు పెరిగే కళంకం... కడిగినా మాసిపోలేని పంకం
మనిషి పగబూని చేసేది నేరం... ఎపుడు దిగిపోని పెను పాపభారం
।।ఏది।।
గమ్యమే లేని పెనుకాన లోన... కళ్లు పొరగమ్మి చొరబారినావా
।।2।।
అచట లేదోయి ఏ కాలి బాట... కానరాదోయి ఏ పూలతోట
అచట కరిసేను రాకాశి ముళ్లు... అపుడు కురిసేను కన్నీటి జల్లు
మనిషి పగబూని చేసేది నేరం... ఎపుడు దిగిపోని పెను పాపభారం
।।ఏది।।
పదవి కర్తవ్యమును కోరుతుంది... మనసు కల్లోలపడి మూల్గుతుంది
ఒకటి బంగారు సంకెళ్ల బంధం... ఒకటి హృదయాల మధురానుబంధం
రెంటిలో ఏది విలువైన ధర్మం... తెలుసుకొని చేరుకోవాలి గమ్యం
మనిషి పగబూని చేసేది నేరం... ఎపుడు దిగిపోని పెను పాపభారం
।।ఏది।।
ధర్మ మార్గాన పయనించావు... దైవ ప్రతిరూప మనిపించినావు
తెలిసి చేశావు ఒక వింత నేరం... కడకు మోశావు పరితాప భారం
ఆత్మ అందించే గీతోపదేశం... ఆరిపోయావు ఒక నీతి కోసం
ఆరిపోయావు ఒక నీతి కోసం... ఆరిపోయావు ఒక నీతి కోసం
।।ఏది।।

తొలి హిందీ బాణీ పాటకు లంకె:తెలుగు సారూప్య పాటకు లంకె:

- షణ్ముఖాచారి


© Sitara 2018.
Powered by WinRace Technologies.