కల్లోలం వెంటేసుకొచ్చే.. పిల్లగాలే!!

‘‘కల్లోలం వెంటేసుకొచ్చే.. పిల్లగాలే!! నను చూస్తూనే.. కమ్మేసెనే’’.. అంటూ తన ప్రేయసిని తలచుకుంటూ ప్రేమగీతం ఆలపిస్తున్నాడు శర్వానంద్‌. ఇంతకీ శర్వాను పడేసిన ఆ దేవకన్య మరెవరో కాదు ఫిదా భామ సాయి పల్లవి. మరి వీరిద్దరి మధ్య ప్రేమకథ చివరికి ఏమైందో తెలియాలంటే ‘పడిపడి లేచే మనసు’ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శర్వా - సాయిపల్లవి జంటగా నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రెండో లిరికల్‌ గీతాన్ని విడుదల చేశారు. ‘‘కల్లోలం వెంటేసుకొచ్చే’’.. అంటూ సాగే ఈ ప్రేమగీతాన్ని కృష్ణకాంత్‌ రచించగా.. విశాల్‌ చంద్రశేఖర్‌ చక్కటి బాణీలు సమకూర్చాడు. ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించిన విధానం మరింత ఆకట్టుకునేలా ఉంది. పాటలో కనిపించిన థీమ్‌ విజువల్స్‌ కూడా అద్భుతంగా కుదిరాయి. ఇందులో సాయి పల్లవి మెడికో స్టూడెంట్‌గా కనిపించబోతుంది. సినిమా ఎక్కువ శాతం కలకత్తా పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ సాంగ్‌కు సినీ ప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తుండగా.. తాజాగా విడుదలైన పాట దానికంటే మరింత రొమాంటిక్‌గా వినసొంపుగా ఉంది. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాల మాదిరిగానే ఇదీ ఓ సరికొత్త తరహాలో సాగే ప్రేమకథగా ఉండబోతుంది.

© Sitara 2018.
Powered by WinRace Technologies.