సూపర్‌ ఫాస్ట్‌ రొమాంటిక్‌ జర్నీ ...చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌
మనసులోని భావాల్ని వ్యక్తీకరించేందుకు భాషే కావాలా? మరీ ప్రత్యేకించి ప్రేమ అనే భావోద్వేగాన్ని బయటపెట్టేందుకు ప్రపంచంలోని ఏ భాష సాయం తీసుకోనక్కర్లేదు. ఓ కనుసైగ... ఓ చిరునవ్వు... ఎదలో ఉన్న ప్రేయసి ఎదురైనప్పుడు గుండెల్లో పూసిన గులాబీల పలకరింపు... ఆమెనలా చూస్తూ గంటలు క్షణాలుగా గడిపే తన్మయత్వం... ఇవి చాలు తనలో ఆమె పట్ల ప్రేమ ఎంతలా వెల్లువెత్తి పొంగుతుందో చెప్పడానికి. హృదయంలో తనే కావాలనే ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు భాష, ప్రాంతాలకతీతంగా మనసులు రెండు కలుస్తాయని సూటిగా చెప్పే... ఇద్దరి ప్రేమికుల రొమాంటిక్‌ జర్నీ చెన్నయ్‌ ఎక్స్‌ ప్రెస్‌.


అప్పుడప్పుడే ప్రేమలో పడుతున్న అమ్మాయి, అబ్బాయిలకు, ప్రేమ మహిమ ఎన్న తరమా? అంటూ చెట్టాపట్టాలేసుకుంటూ యుగళ గీతాలు పాడుకుంటున్న యువ జంటలకు, ప్రేమంటే ఇదేరా! అంటూ స్వీయానుభవాల్ని గొప్పగా చెప్పుకునే లవ్‌ గురులకు ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ తెగ నచ్చేసింది. అందుకే... విడుదలైన అన్ని కేంద్రాలూ యువ ప్రేమికుల జాతరని తలపించేవిధంగా కలర్‌ఫుల్‌గా కనిపించాయి.

‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ 2013 ఆగస్టు 8న విదేశాల్లో... ఆ మర్నాడు అంటే ఆగస్టు 9న ఇండియాలో విడుదలై సంచలనం సృష్టించింది. మొదట్లో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా... నెమ్మది నెమ్మదిగా ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఎన్నో రికార్డులు సాధించుకుంది. అదే సమయంలో బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన ‘త్రి ఇడియట్స్‌’ సినిమా వసూళ్లను సైతం దాటి... ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన భారతీయ సినిమాల్లో పదకొండో చిత్రంగా ప్రూవ్‌ చేసుకుంది.


చిత్ర విశేషాలు
యాక్షన్‌ కామెడీ మూవీగా రూపొందిన చెన్నయ్‌ ‘ఎక్స్‌ప్రెస్‌’కి దర్శకత్వం వహించింది రోహిత్‌ శెట్టి. నిర్మాతలుగా వ్యవహరించింది గౌరీఖాన్, కరీం మొరానీ, రోనీ స్క్రి వాలా, సిద్దార్ధ రే కపూర్‌. నాయికా నాయకులుగా దీపికా పడుకొనే, షారుఖ్‌ ఖాన్‌ నటించగా పాటలకు సంగీతం సమకూర్చింది విశాల్‌-శేఖర్‌. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అమర్‌ మొహిలే అందించారు. షారుఖ్‌ ఖాన్, రోహిత్‌ శెట్టి ముందుగా అనుకున్న సినిమా 1982 నాటి ‘అంగూర్‌’ సినిమాకి రీమేక్‌. అనూహ్యంగా తెరమీదకి వచ్చిన సినిమా ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’. ఈ కధ విన్న వెంటనే షారుఖ్‌ ఖాన్‌ కమర్షియల్‌ హిట్‌ మూవీగా రూపొందుతుందని నమ్మారు. ఆ నమ్మకాన్ని నిజం చేసిన సినిమా ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ 2012 అక్టోబర్‌లో మెహబూబ్‌ స్టూడియోలో షూటింగ్‌ ప్రారంభించిన ఈ సినిమా 2013 మేలో పూర్తయింది. ఆగస్టులో విడుదల అయింది.

ఊటీ అందాలు
ఊటీ ... ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఊటీలో ఎన్నో సినిమాలు రూపొందుతూ విజయాన్ని చవి చూస్తున్నాయి. ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ కూడా ఎక్కువ భాగం ఊటీ లోనే చిత్రీకరణ జరుపుకోవడం విశేషం.


చిత్రకథ
షారుఖ్‌ ఖాన్‌ ఈ చిత్రంలో రాహుల్‌ మిఠాయి వాలాగా నటించి మెప్పించారు. దీపికా పదుకొణె మీనా లోచని (మీనమ్మ)గా నటించింది. మీనమ్మ తండ్రి తమిళనాడులోని ఓ మాఫియా హెడ్‌. రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన నాయికానాయకులు ఒకరి భాష ఒకరికి తెలీకున్నా ప్రేమలో పడడం... ఆ ప్రేమను గెలిపించుకునే క్రమంలో ఎదురయిన సవాళ్ళను అధిగమించడం.... హాస్యాన్ని దట్టించి మరీ చిత్రీకరించడంలోనే ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ సగం విజయం సాధించింది. ముంబయ్‌లో గ్రాండ్‌ పేరెంట్స్‌ దగ్గర షారుఖ్‌ ఖాన్‌ పెరుగుతాడు. తాత భిషంబర్‌ మిఠాయి దుకాణాలను వివిధ ప్రాంతాల్లో విజయవంతంగా నిర్వహిస్తుంటారు. భిషంబర్‌ వందో పుట్టిన రోజు వేడుకల్ని స్నేహితులతో గోవాలో జరుపుకోవాలని షారుఖ్‌ ఖాన్‌ నిర్ణయించుకుంటాడు. ఈ లోగా టీవీలో సచిన్‌ 99 పరుగులు తీసి అవుట్‌ అయిపోవడాన్ని తట్టుకోలేని భిషంబర్‌ బాల్చీ తన్నేస్తాడు. ఆయన అస్థికలు గంగ, రామేశ్వరం ప్రాంతాల్లో కలిపేందుకు చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కుతాడు. దుర్మార్గుడైన వ్యక్తితో తండ్రి తన పెళ్లి చేయడాన్ని నిరసిస్తూ ఇంట్లోంచి పారిపోయి వచ్చిన నాయిక దీపిక కూడా అదే బోగీలోకి ఎక్కుతుంది. స్టార్ట్‌ అయిన ట్రైన్‌లోకి నాయికను చేయి పట్టుకుని ఎక్కించే సన్నివేశానికి 1995లో విడుదలైన ‘దిల్‌ వాలే దుల్హన్‌ లేజాయేంగే’ స్ఫూర్తి. ట్రైన్‌లో దీపికను షారుఖ్‌ ఆటపట్టించే సన్నివేశాలు, దీపికను వెంటాడుతున్న వ్యక్తుల ద్వారా పుట్టిన హాస్యం... అనివార్య పరిస్థితుల్లో దీపికతో పాటు ఆమె ఊరికి షారుఖ్‌ చేరుకోవడం... దీపిక తన ప్రేమికుడు షారుఖ్‌ అని తండ్రికి చెప్పడం... అక్కడ విలన్‌తో తగవు పడడం... దీపికని రక్షించే పనిలో భాగంగా ఆమెని తీసుకుని పరారవడం... ఈ క్రమంలో ఆమెతో తాను ప్రేమలో పడ్డానని నాయకుడు గ్రహించడం... ఇలా ప్రతి సన్నివేశం ఆకట్టుకునే రీతిలో చిత్రీకరించారు. చివరికి ముంబయికి చెందిన నాయకుడు, తమిళనాడుకి చెందిన నాయికని భాష తెలీకున్నా మనసిచ్చి పుచుకుని ప్రేమను బతికించుకోవడంతో చిత్రం చివర శుభం కార్డు పడుతుంది.

లుంగీవాలా డాన్స్‌ అదరహో
చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో లుంగీ వాలా డాన్స్‌ అదరహో అన్నారు ప్రేక్షకులు. ఆ ఒక్క పాత కోసమే పదే పదే ఆ చిత్రాన్ని చూసిన వాళ్ళెంతమందో ఉన్నారు. తమిళనాడు నేపథ్యంలో తీసిన చిత్రం కాబట్టి... తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజినీ కటవుట్‌ ముందు నాయికా నాయకులు చేసిన హల్చల్‌ థియేటర్స్‌ ని హోరెత్తించింది. వన్‌ టూ త్రి ఫోర్‌...గెట్‌ ఇంటూ ది డాన్స్‌ ఫ్లోర్, తేరా రాస్తా మై చోడోనా, కాశ్మిర్‌ మే తూ కన్యా కుమారి, చెన్నయ్‌ ఎక్స్‌ ప్రెస్‌ ...లాంటి పాటలు జనాన్ని ఓ ఊపు ఊగించాయి.


అవార్డులు
‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ చిత్రానికి ప్రేక్షాకాధరణే కాకుండా వివిధ పురస్కారాలు, అవార్డులు అనేకం దక్కాయి. ఫిలిం ఫేర్, ఐఐఎఫ్‌ఏ, స్టార్‌ గిల్డ్, స్కీన్ర్, జీ అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి. బిగ్‌ స్టార్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్, బాలీవుడ్‌ హంగామా సర్ఫర్స్‌ ఛాయిస్, మిర్చి మ్యూజిక్, గోల్డెన్‌ కెలా అవార్డులు సైతం ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇప్పటికీ ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ టీవీలో వస్తుంటే అదే రొమాంటిక్‌ ఫీలింగ్‌తో ప్రేక్షకులు పరవశులవుతారు. షారుఖ్, దీపిక సినీ కెరీర్‌లో 2007 బ్లాక్‌ బస్టర్‌ ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ మెచ్చు తునకలు.


- పి.వి.డి.ఎస్‌. ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.