శరత్‌ చెక్కిన కన్నీటి కావ్యం ‘దేవదాసు’
1917 నాటి ప్రేమకథ. బెంగాలీ రచయిత శరత్‌చంద్ర చటోపాధ్యాయ విరచిత విషాదాంత కాల్పనిక కధ. అలాంటి ఓ కధ కాలాల్ని జయించి... కోట్లాది హృదయాల్ని జ్వలించి... శాశ్వతత్వాన్ని సముపార్జించుకోవడం నిజంగా ఓ చరిత్రే. పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చే ఎన్నో ప్రేమ కధల నడుమ కాలం మరువని కన్నీటి కధగా దేవదాసు ఇంకా ఇప్పటికీ నిలిచి ఉందంటే... అదంతా శరత్‌ ఇంద్రజాలమే. ఆయన సృష్టించిన పాత్రల మాయాజాలమే. ఆ పాత్రలన్నీ రక్తమాంసాలతో మన కళ్లెదురుగానే సజీవంగా కదలాడుతున్నాయనే ఊహ కలిగించడమే దేవదాస్‌ రచయితగా శరత్‌ అనుసరించిన విజయ సూత్రం. కేవలం నవలగానే కాకుండా ప్రేక్షకుల మనస్సులపై కదిలే బొమ్మల ప్రపంచం కడు నైపుణ్యంగా విసిరిన రంగుల వలగా కూడా ‘దేవదాస్‌’ని అభివర్ణించవచ్చు. భారతీయ భాషల్లో ఇప్పటికీ పునర్నిర్మితమవుతున్న ఒకే ఒక కథ ‘దేవదాస్‌’.


* దృశ్యమాధ్యమంలోనూ సంచలనమే
కేవలం అక్షరాలతోనే సరిపెట్టుకోకుండా దృశ్యమాధ్యమంలో కూడా ‘దేవదాసు’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్నిసార్లు ఎంతమంది నటీ నటుల నటనా తృష్ణని ఇది నెరవేర్చిందో? తమ కెరీర్లో ఒక్కసారయినా ‘దేవదాసు’ చిత్రంలో నటించాలని తపన పడిన కళాకారులెందరో లెక్కకు మిక్కిలి. మళ్లీ మళ్లీ ‘దేవదాసు’ పునర్నిర్మాణమవుతూ విజయాలు చవి చూస్తూనే ఉంది. అలనాడు తెలుగులో అక్కినేని... హిందీలో దిలీప్‌ కుమార్‌ సహా ఆ తరువాతి తరం కళాకారులూ ‘దేవదాసు’ పట్ల మనసుపడ్డారు. కొంతమంది స్వీయనిర్మాణ సారథ్యంలో ‘దేవదాసు’గా నటించి మెప్పించారు. మరికొంతమంది నటించినా ఆశించిన విజయాన్ని చవిచూడకపోవడంతో విఫల మనోరధులయ్యారు.
                                                           

* షారుఖ్‌ ‘దేవదాసు’
బాలీవుడ్‌ బాద్షాగా తన ప్రత్యేక గుర్తింపుతో హిందీ సినిమాను శాసిస్తున్న షారుఖ్‌ఖాన్‌ కూడా దేవదాసు ప్రేమలో పడిపోయాడు. మెగా బాలీవుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో కలసి స్వీయ నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ద్వారా ‘దేవదాస్‌’ను నిర్మించి తనలోని నటుడిని సంతృప్తి పరిచారు. అదే సమయంలో విజయాన్నీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, పురస్కారాలను అందుకున్నారు. 2002లోనే 50 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించి బాలీవుడ్‌ స్టామినాని మరో స్థాయిలోకి తీసుకెళ్లారు. దేశ, విదేశాల్లో ఈ చిత్రం అత్యధిక వసూళ్లను కళ్ల చూసింది. బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ అనే ప్రతిష్టాత్మక సంస్థకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో షారుక్‌ ‘దేవదాసు’ నామినేట్‌ అయింది. అదే విభాగంలో అకాడమీ అవార్డుకు కోసం కూడా నామినేట్‌ అయింది. 2010లో ‘ది హండ్రెడ్‌ బెస్ట్‌ ఫిలిమ్స్‌ ఆఫ్‌ వరల్డ్‌ సినిమా’ అనే అంశంపై ఎంపైర్‌ సినిమా మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో ‘దేవదాసు’ చోటు చేసుకోవడం విశేషం. ఇటీవల కాలంలో టైమ్స్‌ టాప్‌ టెన్, మూవీస్‌ ఆఫ్‌ ది మిలియనీమ్‌లో కూడా ‘దేవదాసు’ చోటు చేసుకుంది. అంతకుముందే టైం మ్యాగజైన్‌ 2002లో విడుదలైన అన్ని సినిమాల్లోనూ ‘దేవదాú’Ã ఉత్తమ చిత్రంగా అభివర్ణించింది. సంజయ్‌ లీలా బన్సాలి ‘దేవదాస్‌’ నిర్మాణాన్ని సవాల్‌గా తీసుకుని అద్భుతంగా తీశారు.

                                             

* అలరించిన పాటలు
‘దేవదాస్‌’ చిత్రంలో పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. సిల్‌ సిలా ఏ చాహత్‌ కా, మార్‌ డాలా, బైరి పియా, చలక్‌ చలక్, హమేషా తుమ్‌ కో చాహా, వో చాంద్‌ జైసీ లడ్‌ కీ, డోలారే డోలా... ఇలా అన్ని పాటలు జనరంజకంగా రూపొందాయి. ఇప్పటికీ ఈ పాటలు ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ‘దేవదాస్‌’ చిత్రాన్ని సంగీత ప్రధాన చిత్రంగా రూపొందించడంలో దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలి చూపిన శ్రద్ధ ప్రశంసనీయం.

                             
 
* కేన్స్‌ చిత్రోత్సవంలో
కేన్స్‌ చిత్రోత్సవం (2002)లో ‘దేవదాస్‌’ సృష్టించిన హల్చల్‌ అలవికానిది. 2014 ఇంటర్‌ నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ‘దేవదాస్‌’ సెక్షన్‌ వెలిసి అభిమానులని అలరించింది. ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్‌ అవార్డుతో పాటు మరో పది ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు కూడా కైవశం చేసుకుంది. అదే వరుసలో 5 జాతీయ అవార్డులను అందుకుంది.

* తెరముందూ...తెర వెనుక
అన్ని విజయాలు నమోదు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా కీర్తినార్జించిన ‘దేవదాస్‌’ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులే. లబ్ధప్రతిష్టులే. కథానాయకుడు షారుఖ్‌ గురించి చెప్పవలసిన పని లేదు. నాయికగా మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ అందాలతో కనువిందు చేస్తూనే... పార్వతిని కళ్లముందు సాక్షాత్కరింపచేసింది. ‘దేవదాసు’లో మరో ముఖ్య భూమిక చంద్రముఖి. ఎంతగానో ప్రేమించిన ప్రేయసి పార్వతి నుంచి విడివడిన తరువాత ‘దేవదాసు’ను అక్కున చేర్చుకుని మనసుకు ఊరట కలిగించిన చంద్రముఖి పాత్రలో మాధురీదీక్షిత్‌ కనిపించి కవ్వించింది. ‘దేవదాస్‌’ మనసెరిగిన నేస్తం చున్నీలాల్‌గా జాకీ ష్రాఫ్, పార్వతి తల్లి సుమిత్ర చక్రవర్తిగా కిరణ్‌ ఖేర్, దేవదాస్‌ తల్లి కౌసల్య ముఖర్జీగా స్మిత జయకర్‌... ఇలా ముఖ్యమైన పాత్రల్లో ప్రతిభావంతులు నటించారు. ‘దేవదాస్‌’లోని పాటల్ని జనరంజకంగా మలచిన సంగీత దర్శకుడు ఇస్మాయిల్‌ దర్బార్, మోంతీ శర్మ. సినిమాటోగ్రఫీ బినోద్‌ ప్రధాన్‌. ఎడిటర్‌ దిలీప్‌ దియో. దర్శకుడు: సంజయ్‌ లీలా బన్సాలి. సినిమా నిడివి 185 నిముషాలు. విడుదల తేదీ: 2002 జులై 12.

* ఇతివృత్తం
కులం, బలం, ధనం, మతం... ఇవే ప్రతి ప్రేమకథలోనూ ప్రధాన విలన్లు. అలాంటి అన్ని ప్రేమకథల్లానే దేవదాసు పార్వతి ప్రేమకథ కూడా. ఇంగ్లండ్‌లో లాయర్‌ విద్యనభ్యసించి తిరిగి సొంతూరు వస్తాడు కధానాయకుడు దేవదాసు. చిన్నతనంలో పక్కింటి పార్వతితో సన్నిహితంగా ఉండేవాడు. తిరిగి వచ్చిన తరువాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. దేవదాస్‌ కుటుంబం ధనిక కుటుంబం. పార్వతి పేదరాలు. అదే...వారి ప్రేమకు అడ్డంకి అయింది. విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్వతి వివాహం భువన్‌ చౌదరితో కుదురుతుంది. ఆయన తన పిల్లలకు తల్లిగా, ఎస్టేట్‌కి యజమానిగానే పార్వతిని పెళ్లాడుతాడు తప్ప... భార్యగా కాదు. పార్వతి నుంచి విడిపోయిన దేవదాసు వేశ్య చంద్రముఖి చెంతకు చేరుతాడు. తాగుడుకు బానిసవుతాడు. చివరికి తండ్రి మరణించాక అంత్యక్రియలకు సైతం తిరిగి రాకపోవడంతో ఆయన పరువు పోతుంది. ప్రేమను గెలిపించుకోలేని అసమర్ధ ప్రేమికుడు దేవదాసు. ప్రేయసి జ్ఞాపకాల్లోనే మగ్గుతూ విపరీతంగా తాగుతూ జీవితాన్ని విషాదాంతం చేసుకుంటాడు.

* ఎందరో దేవదాసులు
1917లో ‘దేవదాస్‌’ సినిమా తీస్తే... 1928లో నరేష్‌ మిత్ర దర్శకత్వంలో దేవదాస్‌గా ఫణి శర్మ, పార్వతిగా తారక్‌ బాల నటించిన మూకీ సినిమా నిర్మితమైనది. 1935లో బెంగాలీ భాషలో పి.సి.బారువా దర్శకత్వంలో ఆయనే నాయకుడిగా జమునా బారువా పార్వతిగా నటించిన చిత్రం నిర్మితమైనది. 1936లో హిందీలో పి.సి.బారువా దర్శకత్వంలో ‘దేవదాస్‌’గా కె.ఎల్‌.సైగల్, పార్వతిగా జామున బారువా నటించారు. 1937లో అస్సామిలో పి.సి.బారువా దర్శకత్వంలోనే ఫణి శర్మ దేవదాసుగా పార్వతిగా జుబేడియా నటించగా చిత్రం నిర్మితమైనది.

                                            

* 1953లో అక్కినేని ‘దేవదా
1953లో తెలుగు, తమిళ్‌ భాషల్లో అక్కినేని నాగేశ్వరరావు ‘దేవదాసు’గా సావిత్రి పార్వతిగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో చిత్రం రూపొందించారు. ఆ చిత్రం అఖండ విజయం సాధిచిన సంగతి తెలిసిందే.. 1955లో బిమల్‌ రాయ్‌ దర్శకత్వంలో హిందీలో దిలీప్‌ కుమార్‌ దేవదాసుగా, సుచిత్ర సేన్‌ పార్వతిగా సినిమా రూపొందింది. 1965లో ఉర్దూలో ఖవాజా సర్ఫరాజ్‌ దర్శకత్వంలో దేవదాసుగా హబీబ్‌ తాలీష్, పార్వతిగా షమీమ్‌ అర్వా నటించగా చిత్రం నిర్మితమైంది. హిందీ దేవదాస్‌ చిత్రంలో నటించిన దిలీప్‌ కుమార్‌ అక్కినేని దేవదాస్‌ని చూసిన తర్వాత... ఈ చిత్రం ముందుగానే చూసి ఉంటే తను హిందీ ‘దేవదాస్‌’లో నటించేవాడిని కానని చెప్పేసారు. అంతలా అక్కినేని దేవదాస్‌ ఆయన్ని ఆకర్షించింది. ఒక్క ఆయనకే కాదు... ఆ తర్వాత ఎంతో మంది దేవదాస్‌ పాత్రను వేసినా అక్కినేనిని అధిగమించలేరని ఇప్పటికీ విమర్శకులు అంటుంటారు. అంతలా...దేవదాస్‌ ఆంటే అక్కినేని, అక్కినేని అంటే దేవదాస్‌గా ప్రగాఢ ముద్ర వేయగలిగారు.


* 1974లో ‘దేవదాసు’గా
1974లో విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ ‘దేవదాసు’గా, విజయ నిర్మల పార్వతిగా దేవదాసు చిత్రం నిర్మితమైనది. అలనాటి మహానటి సావిత్రి నటించిన పార్వతి పాత్రలో తనని చూసుకోవాలనే కాంక్షతో విజయ నిర్మల ఈ సినిమా తీయడానికి సాహసించింది. 1979లో బెంగాలీలో దిలీప్‌ రాయ్‌ దర్శకత్వం లో సౌ మిత్ర ఛటర్జీ దేవదాస్‌గా, సుమిత్ర ముఖర్జీ పార్వతిగా దేవదాస్‌ చిత్రం రూపొందింది. 1982లో బెంగాలీలోనే మళ్ళీ ఛషీ నాజ్రుల్‌ ఇస్లాం దర్శకత్వంలో బుల్బుల్‌ అహ్మద్‌ దేవదాస్‌గా, కాబోరి సాన్వర్‌ పార్వతిగా దేవదాస్‌ నిర్మితమైనది. 1989లో మలయాళంలో క్రాస్‌ బెల్ట్‌ మని దర్శకత్వంలో వేణు నాగవల్లి దేవదాసుగా, పార్వతిగా పార్వతి నటించగా ఓ ఇంకో సినిమా రూపొందింది. 2002లో బెంగాలీలో శక్తి సామంత్‌ దర్శకత్వంలో ప్రసేన్‌ జిత్‌ ఛటర్జీ దేవదాస్‌గా, అర్పితా పాల్‌ పార్వతిగా మరో చిత్రం రూపొందింది. అదే సంవత్సరం సంజయ్‌ లీలా బన్సాలి దర్శకత్వంలో షారుఖ్‌ ‘దేవదాస్‌’గా, ఐశ్వర్య రాయ్‌ పార్వతిగా చిత్రం రూపొందింది. ఇలా 2018 వరకూ వివిధ భాషల్లో దేవదాస్‌ ప్రతి సంవత్సరం నిర్మితమవుతూనే ఉంది. ఈ చిత్రంపై ఇప్పటికీ అటు ఆర్టిస్ట్‌లకు, ఇటు ఆడియన్స్‌కి ప్రేమ తగ్గకపోవడం ఈ కథకున్న ప్రత్యేకత.


- పి.వి.డి.ఎస్‌. ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.