14 చిత్రాలు.. 5 హిట్లు.. 14మంది నాయికలు!

సంక్రాంతి.. తెలుగు వారికే కాదు బాక్సాఫీస్‌కు పెద్ద పండుగే. ఈ ముగ్గుల పండుగకు బాక్సాఫీస్‌ వద్ద బరిలో నిలిచి సినీప్రియులకు వినోదాల విందును పంచి పెట్టాలని ప్రతి కథానాయకుడు కోరుకుంటుంటాడు. ఇక అగ్ర కథానాయకులు వెంకటేష్, బాలకృష్ణలకు సంక్రాంతితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ ప్రతి పెద్దపండగకు ప్రేక్షకులకు తమ ఆతిథ్యాన్ని అందించిగానీ వెళ్లరు. ఈ ఏడాది కూడా వీరిద్దరూ ఆ ఆనవాయితీని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’తో ముగ్గుల పండుగకు సిద్ధమవగా.. వెంకటేష్‌ ‘ఎఫ్‌ 2’తో సందడి చేయబోతున్నాడు. అయితే వీరిద్దరిలో సంక్రాంతి సెంటిమెంట్‌ వెంకీకి మరింత ప్రత్యేకం కాబోతుంది. వెంకటేష్‌ నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ‘కలియుగ పాండవులు’ నుంచి చివరిగా వచ్చిన ‘గురు’ వరకు మొత్తంగా 14 సినిమాలు సంక్రాంతి పండుగకే విడుదలయ్యాయి. వీటిలో ఐదు చిత్రాలు వెంకీ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్లుగా నిలవడం విశేషం. ఇక్కడ మరో ఆశ్చర్యకర విశేషం కూడా ఉంది. ఈ 14 సినిమాల్లోనూ నటించిన కథానాయికలంతా వెంకటేష్‌తో మొదటిసారిగా నటించిన వారే కావడం.*
వెంకీ నుంచి వచ్చిన తొలి సంక్రాంతి సినిమా ‘శత్రువు’ (1991). ఇందులో వెంకీకి జోడీగా విజయశాంతి తొలిసారి కనిపించింది.
* వెంకటేష్‌ - మీనాల కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘చంటి’ (1992) కూడా ముగ్గుల పండగకి బాక్సాఫీస్‌ ముందుకొచ్చినదే.
* ‘కలిసుందాం.. రా!’ సినిమా తర్వాత వెంకీ నుంచి సంక్రాంతి కానుక రావడానికి ఆరేళ్లు గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత 2006లో ‘లక్ష్మి’ చిత్రం వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
* ఇక వెంకీ నుంచి వచ్చిన చివరి సంక్రాంతి హిట్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఇందులో వెంకీకి జంటగా అంజలి తొలిసారి నటించింది.
* ప్రస్తుతం వెంకటేష్‌ నుంచి రాబోతున్న ‘ఎఫ్‌ 2’ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇందులో ఆయనతో కలిసి మిల్కీబ్యూటీ తమన్నా మొదటిసారి కనిపించబోతుంది.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.