‘‘సావిత్రి గారికీ నాకూ కొన్ని పోలికలున్నాయి. కొన్ని విషయాల్లో ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉంటాయి. అందుకే ఈ పాత్ర నాకు వచ్చిందేమో అనిపించింది. సినిమా చేస్తున్నప్పుడు ‘ఇది వరకెప్పుడూ చేయని పాత్ర, ఇంకెప్పుడూ చేయలేని పాత్ర నా దగ్గరకు వచ్చింది’ అనుకుంటూనే పనిచేసేదాన్ని. జీవితకాలంలో ఒక్కసారి వచ్చే అదృష్టం, అవకాశం అంటారు కదా, అలాంటి పాత్ర ఇది. ఈ అవార్డుని మా అమ్మకి అంకితం ఇస్తున్నా’’.
- కీర్తి సురేష్. |
అతని వయసు కేవలం ఒక్క సినిమా. పది మాటలు మాట్లాడితే... అందులో సగం ఇంగ్లిషు ముక్కలే. బిడియమో, వినయమో తెలియని వ్యక్తిత్వం. ఓ మహానటి కథని సినిమాగా తీయాలని సంకల్పించాడు. ఆ నటి సావిత్రి... ఆ దర్శకుడు నాగ అశ్విన్.సావిత్రి గురించి తెలియని కొత్త విషయాలేమున్నాయి?ఆమె జీవితంలోని చీకటి కోణాల్నీ నిజాయతీగా తెరపై చూపించగలడా?అసలు ఈ సమయంలో ఇలాంటి కథ చెప్పడం అవసరమా? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ నాగ అశ్విన్ ఇవేం పట్టించుకోలేదు. సావిత్రి జీవితం మొత్తం తెలుసుకున్నాడు. సావిత్రి పాత్రకు ఎవరిని ఎంచుకోవాలో తెలీక... సతమతమవుతున్నప్పుడు నాగ అశ్విన్ ఓ తమిళ చిత్రం చూశాడు. పేరు... ‘తొడరి’. అందులో ఓ అమ్మాయి. 14 ఏళ్లు నిండని పాపాయిలా అందంగా, అమాయకంగా కనిపించింది. మేకప్ వేయకుండానే ఓ వెలుగు చూశాడు ఆమెలో.‘తనే నా సావిత్రి’ అని ఫిక్సయిపోయాడు. నాగ అశ్విన్ చూసిన నేటి సావిత్రి.. ‘కీర్తి సురేష్’.
సావిత్రి కథని నాగ అశ్విన్ తీయాలనుకున్నప్పుడు సినీ పరిశ్రమ ఎంత ఆశ్చర్యపోయిందో..
సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ని ఎంచుకున్నప్పుడూ అంతకు మించే షాకైంది.
అప్పటికి కీర్తి సురేష్ చేసింది ఒక్క సినిమానే. అదీ ఓ లవ్ స్టోరీ. సావిత్రి అంతటి మహానటి పాత్రని పోషించే వయసు, అర్హత... కీర్తికి ఉన్నాయా?
నిత్యమేనన్ని తీసుకోవచ్చుగా, విద్యా బాలన్ అయితే హిందీ మార్కెట్ కూడా ఉంటుందిగా..
ఇలా ఎన్నో సలహాలు, ప్రశ్నలు. వాటన్నింటినీ పక్కన పెట్టి కీర్తిని ఎంచుకున్నాడు నాగ అశ్విన్.
అవకాశం రాగానే కీర్తి ఏమీ ఆలోచించలేదు. ‘నన్ను దర్శకుడు నమ్మారు.. నేను దర్శకుణ్ని నమ్మాలి’ అని నిర్ణయించుకుంది. సినిమా విడుదలయ్యాక అన్ని ప్రశ్నలకూ సమాధానం దొరికేసింది. డబ్బులతో పాటు బోలెడన్ని అవార్డులు. ఇప్పుడు కీర్తి సురేష్‌కి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పురస్కారం. ఇదే చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఘనత. కాస్ట్యూమ్స్ విభాగంలో మరో అవార్డు అందుకుని... జాతీయ స్థాయిలోనూ తెలుగు సినిమా కీర్తి పతాక ఎగరేసింది... ‘మహానటి’.
అయితే సావిత్రిగా రూపాంతరం చెందడం వెనుక కీర్తి చాలా కృషి చేసింది. సావిత్రికి సంబంధించిన పుస్తకాలన్నీ ముందేసుకుని ఆమెను ఆవాహన చేసుకోవడం మొదలుపెట్టింది. కానీ.. లోపల ఎక్కడో అనుమానం.. భయం. సావిత్రిలా నేను కనిపిస్తానా? నేను మెప్పిస్తానా? అనే ఆలోచనలు నిద్రపట్టకుండా చేశాయి. ‘‘తొలిరోజు షూటింగ్ నాకింకా గుర్తుంది. సావిత్రికి సంబంధించిన పాటల్ని మెడ్లీగా తీశారు. ఆ పాటల్లో సావిత్రి ఎలా ఉన్నారో అలాంటి మేకప్ వేసుకోవాలి. సెట్స్ కూడా అచ్చంగా అలానే ఉండాలి. ఒకొక్కరి చేతిలో ఒక్కో సెల్‌ఫోన్. యూ ట్యూబ్‌లో పాత పాటల్ని చూస్తూ.. ఎక్కడైనా కొంచెం తేడా కనిపించినా.. నా దగ్గరకు వచ్చి ‘అక్కడ ఇలా లేదు కదా’ అంటూ అడ్డుకునేవారు’’ అంటూ ‘మహానటి’ తొలి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొంది నేటి ‘మహానటి’ కీర్తి సురేష్.
సావిత్రి పాత్ర దక్కడం వరం. తేడా వస్తే అదే శాపం. ‘మంచి పాత్రని పాడు చేశావ్’ అనే అపవాదు మూటగట్టుకోవాలి. కానీ.. కీర్తి సాహసం చేసింది. ‘‘నిజంగా అది సాహసమే. కాకపోతే.. నా భయాలు నాకున్నాయి. ఆ పాత్ర నేను మోయగలనా? లేదా? అని పదే పదే ప్రశ్నించుకునేదాన్ని. కొన్నిసార్లు నేను సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తున్నానేమో అనే భయం కూడా కలిగేది. సీన్ అవ్వగానే మానిటర్ దగ్గరకు పరుగులు పెట్టేదాన్ని. అందులో నన్ను నేను చూసుకునేంత వరకూ ఆ భయం వెంటాడేది’’ అని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంది కీర్తి.

సావిత్రి జీవితంలోని అనేక దశల్ని రెండున్నర గంటల్లో చూపించాలి. దర్శకుడికే కాదు, ఆ పాత్ర పోషిస్తున్న నాయికకీ అది పెద్ద పనే. కొన్ని సన్నివేశాల్లో బొద్దుగా ఉన్న సావిత్రిని చూపించాల్సి వచ్చింది. అప్పుడు కీర్తి శారీకరంగానూ కష్టపడింది. ‘‘పద్నాలుగేళ్ల అమ్మాయిగా కనిపించడం కష్టమనిపించలేదు. చివరి దశ బాగా ఇబ్బంది పెట్టింది. బుగ్గలు రావడం కోసం నోట్లో దూదె పెట్టుకున్నాను. నోట్లో దూది ఉండగా డైలాగులు చెప్పడం కష్టం అనిపించింది. ‘మహానటి’ డబ్బింగ్ సమయంలో ప్రతి పదం.. ప్రతి అక్షరం శ్రద్ధగా పలికాను. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కాబట్టే.. ఈ పాత్రకు మంచి పేరొచ్చింది’’ అంటోంది కీర్తి.
ఓ సినిమాకి పనిచేస్తూ, ఆ పాత్రలో లీనమైపోవడం, చిత్రబృందంతో విడదీయలేని అనుబంధం ఏర్పరచుకోవడం అరుదుగా జరిగే విషయాలు. ‘మహానటి’ విషయంలో ఇవన్నీ జరిగాయి. సావిత్రి జీవితంలోని విషాదాన్నీ, విజయాన్నీ.. తన మనసులోతుల్లోకి తీసుకోగలిగింది కీర్తి. చివరి రోజు.. ఆ సెట్‌ని వీడిపోతూ.. కన్నీరు మున్నీరైంది. తనతో పాటు పనిచేసిన టీమ్ అందరికీ చిన్న చిన్న కానుకలు ఇచ్చి సెలవు తీసుకుంది. అప్పుడే అనిపించింది. ఈ సినిమాలో, ఆ పాత్రలో ఏదో మ్యాజిక్ ఉందని. ఇప్పుడు జాతీయ అవార్డులతో ఆ మ్యాజిక్ ఏమిటన్నది అర్థమైంది.
‘‘బ్లాక్ అండ్ వైట్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, పాతాళ భైరవి.. ఇలా ఎన్నో అద్భుతాలున్నాయి. ఆ శకంలో వచ్చిన సినిమాల్ని చాలా చాలా ప్రేమించాను. అందుకే ఆ శకాన్ని వెండి తెరపై చూపించాలి అనుకున్నా. అక్కడి నుంచి ‘మహానటి’ ఆలోచన పుట్టింది. దేశంలో చాలామంది గొప్ప నటీమణులున్నారు. సావిత్రిగారికంటే మంచి నటులున్నారు. కానీ వాళ్లు వేరు. సావిత్రి గారు వేరు. ఎవరికీ దక్కని స్టార్ డమ్ ఆమెది. మహారాణిలా బతికారు. చివర్లో కష్టాలు అనుభవించారు. ఆమె కథ ఈ తరానికి చెప్పాలనిపించింది. అలా ‘మహానటి’ ఆవిర్భవించింది’’.
- నాగ అశ్విన్ |