ఇక్కడి కథలకు అక్కడ స్థాయి పెరిగింది
కొన్ని కథలు ఎన్నిసార్లు విన్నా బాగుంటాయి. కొన్ని కథలు ఎక్కడ చెప్పినా వినేవాళ్లుంటారు. అలాంటి కథలు కావాలిఇప్పుడు. అలాంటి కథల్ని సినిమాలుగా తీయాలిప్పుడు. మనవాళ్ల ప్రయత్నమూ అదే. రీమేక్‌ అనుకోండి, సీక్వెల్‌ అనుకోండి... చెప్పిన కథని మళ్లీ చెప్పడం, ఓ భాషలో విజయవంతమైన సినిమాని మరో భాషలో తెరకెక్కించడం ఓ కళ. మన దర్శకులకు, నిర్మాతలకు ‘రీమేక్‌’పై గురి ఎక్కువ. తెలుగులో వచ్చినన్ని రీమేక్‌ చిత్రాలు మరే భాషలోనూ రావేమో. కాకపోతే.. ఇది వరకు మనం పరాయి కథల వెంట పరుగులు పెట్టేవాళ్లం. ఇప్పుడు వాళ్లు మన కథల్ని కొనుక్కెళుతున్నారు. తెలుగు సినిమా కథకు విలువ పెరిగింది. స్థాయి పెరిగింది. టాలీవుడ్‌లో మెరిసిన కొన్ని చిత్రాలు ఇప్పుడు బాలీవుడ్‌లో తిరిగి పురుడు పోసుకుంటున్నాయి. ఇక్కడి దర్శకులు, రచయితలకు ఇదో కొత్త గౌరవం.తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ తెరకెక్కిస్తున్నప్పుడు ఆ సినిమాపై ఎవ్వరికీ అంచనాలు లేవు. కానీ విడుదలతర్వాత సంచలనాలు సృష్టించింది. హిందీలో రీమేక్‌ చేస్తున్నప్పుడూ ‘ఇక్కడి మ్యాజిక్‌ అక్కడ వర్కవుట్‌ అవుతుందా?’ అని అనుమానించారు. కానీ అవన్నీ పటాపంచలైపోయాయి. బాలీవుడ్‌లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. షాహిద్‌ కపూర్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మారింది. తెలుగు కథ సత్తా మరోసారి బాలీవుడ్‌కి తెలిసొచ్చింది. ఈ చిత్రంతోనే సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడిగా హిందీలో అడుగుపెట్టారు. ఓ తెలుగు చిత్రాన్ని, అదే దర్శకుడు బాలీవుడ్‌లో రీమేక్‌ చేసి, విజయం సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ సందీప్‌ రెడ్డి ఆ ఘనత సాధించారు. ‘అర్జున్‌ రెడ్డి’ ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు ఈ రీమేక్‌ల జోరు మరింత ఎక్కువైంది. తెలుగు కథల్ని కొనడానికి బాలీవుడ్‌ దర్శక దిగ్గజాలు, నిర్మాణంలో కాకలు తీరినవాళ్లూ ఉత్సాహం చూపిస్తున్నారు. ‘జెర్సీ’, ‘ఎఫ్‌ 2’, ‘ఎవడు’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాలు ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేకులుగా మారడానికి రెడీ అవుతున్నాయి. ‘ప్రస్థానం’ బాలీవుడ్‌లో తయారవుతోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమైంది.

క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జెర్సీ’. నాని కథానాయకుడు. ఓ దురదృష్టవంతుడైన క్రీడాకారుడి జీవితానికి అద్దం పట్టిన దృశ్యరూపం అది. భావోద్వేగాలు బలంగా పండాయి. ఇలాంటి కథలు బాలీవుడ్‌లో బాగా వర్కవుట్‌ అవుతుంటాయి. అందుకే తెలుగులో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన వెంటనే బాలీవుడ్‌ వాళ్లు కర్చీఫ్‌ వేసేసుకున్నారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ల మల్టీస్టారర్‌ ‘ఎఫ్‌ 2’ ఇక్కడ రూ.వంద కోట్లు రాబట్టింది. ఇద్దరు హీరోల ఫార్ములా అనేసరికి హిందీవాళ్లు ఇట్టే ఆకర్షితులైపోతారు. అందుకే ఈ చిత్రాన్ని అక్కడ పునః నిర్మించేందుకు సిద్ధమయ్యారు. పూరి జగన్నాథ్‌ - రామ్‌ల ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మాస్‌ని ఓ ఊపు ఊపేసింది. రామ్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నట్టు సమాచారం. కథానాయకుడు ఎవరు? ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయాలు తెలియాలి.పాత కథలూ మనకు ఉపయోగపడతాయా? అనే దృష్టితో బాలీవుడ్‌ ఆలోచిస్తోంది. ‘ప్రస్థానం’ విడుదలైన పదేళ్ల తరవాత హిందీలో రీమేక్‌ అవుతోంది. తెలుగులో సాయికుమార్‌ పోషించిన పాత్రలో అక్కడ సంజయ్‌దత్‌ నటించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 2014లో వచ్చిన ‘ఎవడు’ కూడా వాళ్లని ఆకర్షించింది. ఈ కథనీ రీమేక్‌ చేసే ఆలోచనలు ఉన్నాయి. ‘కాంచన’ మన కథ కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కథే. తెలుగులో బాగా ఆడింది కూడా. ఈ చిత్రాన్ని అక్షయ్‌ కుమార్‌ హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ హక్కుల్ని విడుదలకు ముందే కరణ్‌ జోహార్‌ కొనుగోలు చేశారు. ‘ఓ బేబీ’ కూడా హిందీలో వినోదాలు పంచడానికి రెడీ అవుతోంది. కాకపోతే ‘ఓ బేబీ’ మన సొంత కథ కాదు. ఓ విదేశీ కథని ఎంచుకున్న దర్శకురాలు నందినిరెడ్డి తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులూ, చేర్పులూ చేశారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.