రాఘవేంద్రరావు గడ్డం రహస్యం ఇదే!
చిత్ర పరిశ్రమలో ఒక్కో దర్శకుడుది ఒక్కో స్టైల్‌. ఫలాన దర్శకుడు అని చెప్పగానే ఆయన అలా ఉంటారు, ఇలా ఉంటారు అని చెప్పేస్తుంటాం. అయితే కాలానుగుణంగా వాళ్లు మారుతుంటారనే విషయం తెలిసిందే. కానీ రాఘవేంద్రరావు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటారు కదా. రాఘవేంద్రరావు పేరు వినపడగానే మనకు క్రీమ్‌ కలర్‌ చొక్కా, తెల్ల రంగు గడ్డం గుర్తొస్తాయి. ఆయన ఎప్పుడూ ఇలానే ఎందుకు దర్శనమిస్తుంటారో అనే సందేహం అందరిలో ఉంటుంది. ఇటీవలే హాజరైన ఓ కార్యక్రమంలో రాఘవేంద్రరావు తను గడ్డం ఎందుకు పెంచుతున్నారో, క్రీమ్‌ కలర్‌ చొక్కా మాత్రమే ఎందుకు వేసుకుంటారో, ఆయన పేరు చివర బి.ఎ. ఎందుకు పెడతారో చెప్పుకొచ్చారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి..


* రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బాబు’. అది యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో రెండో చిత్రం ‘జ్యోతి’ ప్రారంభించకముందే తిరుపతికి వెళ్లి గడ్డం ఇచ్చేశారట. అప్పటి నుంచి ఆ సినిమా పూర్తయ్యేవరకు మధ్యలో గడ్డం చేసుకోలేదట. ‘అలా ప్రతి సినిమా ప్రారంభం ముందు వేంకటేశ్వరస్వామికి మొక్కుకుని పూర్తయిన తర్వాత మొక్కు చెల్లించుకోవటం సెంటిమెంట్‌గా మారింది. చొక్కా విషయానికొస్తే.. అప్పట్లో నేను ఎక్కవగా వైట్‌ అండ్‌ వైట్‌ ధరించేవాడ్ని. కెమెరామెన్‌ ప్రకాష్‌ ఓసారి క్రీమ్‌ కలర్‌ షర్ట్‌ ఇచ్చాడు. అప్పటి నుంచి అదే కొనసాగిస్తున్నా’నని తెలిపారు.


* ఇందుకే పేరు చివర బి.ఎ.
దర్శకుడు కావాలంటే పీయూసీ చదివితే సరిపోతుందని రాఘవేంద్రరావు నాన్న అనేవారట. అది ఓకే కానీ.. ఒకవేళ దర్శకుడిగా రాణించలేకపోతే ఉద్యోగం చేసేందుకు ఓ డిగ్రీ కావాలి. ఆ ఉద్దేశంతోనే బి.ఎ. పట్టుదలతో చదివారట రాఘవేంద్రరావు. ఆ ఫలితాన్ని తన పేరు పక్కన చూసుకునేందుకే రాఘవేంద్రరావు బి.ఎ. ఉంటుందట.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.