దోస్త్‌ మేరా దోస్త్‌!
కష్టాల్లో తోడుండే ఫ్రెండ్‌... ఓడినప్పుడు భుజం తట్టే దోస్త్‌... ఒడుదొడుకుల్లో వెన్నంటి నిలిచే స్నేహితుడు... తడిసిన కన్నులు తుడిచే నేస్తం... ఒక్కరంటే ఒక్కరున్నా చాలు. అలాంటి మిత్రులు మాకూ ఉన్నారు అంటూ తమ స్నేహితుల గురించి చెబుతున్నారు వీరు!

* నా బలహీనత అదే


నేను ఎవరితోనైనా ఇట్టే స్నేహం చేసేయగలను. ఒక్కసారి స్నేహం కుదిరాక వాళ్లని అస్సలు వదులుకోలేను. నా బలహీనత అదే. అందుకే నా స్నేహితుల జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది. వాళ్లలో ఒకరి పేరే చెప్పమంటే మాత్రం అన్మోల్‌ని గుర్తు చేసుకోకతప్పదు. చిన్నప్పటి నుంచీ స్నేహం మాది. ఊహ తెలియక ముందే తను నా ఫ్రెండ్‌ అయిపోయింది. తను మా బంధువు కూడా కావడంతో మా బంధం మరింత బలపడిపోయింది. చిన్నప్పుడు తనని విడిచి ఒక్క రోజు కూడా ఉండేదాన్ని కాదు. తను నన్ను వదిలి ఎక్కడికైనా వెళ్లిందంటే నాకు జ్వరం వచ్చేసేది. తనూ నేనూ కూర్గ్‌లో కలిసే చదువుకున్నాం. ఆపేక్ష, వరుణ్‌, ప్రేరణ.. మేమంతా ఓ బ్యాచ్‌. చిన్నప్పుడు ఎన్ని అల్లరి పనులు చేసేవాళ్లమో. నా మధుర స్మృతులన్నీ వీళ్లతోనే. స్నేహితులు లేకపోతే జీవితం చాలా బోర్‌గా అనిపిస్తుంది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. స్నేహితుల వల్లే నా జీవితం ఇంత కలర్‌ఫుల్‌గా ఉంది అనిపిస్తుంది.
- రష్మిక మందన్న


* తప్పులు చెప్పేస్తాడు!


నేనేం చేసినా అమ్మానాన్నలకు నచ్చేస్తుంటుంది. కానీ అందులో తప్పొప్పుల్ని నిర్మొహమాటంగా చెప్పే ప్రాణమిత్రుడు పూజిత్‌. చిన్నప్పటి నుంచీ ఇద్దరం మంచి స్నేహితులం. కలిసి చదువుకోవడం తప్ప అన్నీ చేశాం. తనిప్పుడు బెంగళూరులో సాఫ్ట్‌వేేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నేను సినిమాల్లో రాణిస్తానని ఇంట్లోవాళ్లు ఎంత నమ్మారో, వాడు అంతకంటే ఎక్కువ నమ్మాడు. నేను ఎంచుకునే కథలూ, చేస్తున్న సినిమాల గురించి తనతో మాట్లాడుతుంటా. పూజిత్‌ జడ్జిమెంట్‌పైన నాకు చాలా గురి. ‘ఛలో’ కథ ముందు తనకే చెప్పా. ‘చాలా బాగుంది.. తప్పకుండా హిట్‌ అవుతుంది’ అన్నాడు. ‘నర్తనశాల’ చూసి ‘ఇదేదో తేడా కొడుతోంది’ అని హెచ్చరించాడు. తను చెప్పినట్టే ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. దాంతో వాడిపై నాకు మరింత గురి కుదిరింది. నా కొత్త సినిమా ‘అశ్వత్థామ’ కథ వాడి దగ్గరే కూర్చుని రాశాను. ‘ఇది వర్కవుట్‌ అవుతుంది చూడు’ అని నాలో నమ్మకాన్ని కలిగించాడు. జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా తనకు నేను, నాకు తను ఉంటామన్న భరోసా మా ఇద్దరికీ ఉంది. స్నేహం అంటే అదే కదా!
- నాగశౌర్య


* ఎప్పటికీ తనే నా ఫ్రెండ్‌!


నేనూ త్రివిక్రమ్‌ మంచి స్నేహితులం అని అందరికీ తెలిసిందే. అయితే స్నేహితుల దినోత్సవం సందర్భంగా త్రివిక్రమ్‌ నుంచి నేర్చుకున్న ఓ విషయాన్ని చెప్పాలి. ఇద్దరం సినీ రంగంలోకి రావాలని ప్రయత్నిస్తున్న రోజులవి. ఒకసారి లక్డీకాపూల్‌లో మేముండే రూమ్‌ని ఖాళీ చేయాల్సి వచ్చింది. రాత్రి తొమ్మిదిగంటలప్పుడు లగేజీ సర్దుకుని బయటకొచ్చి ఓ బస్టాప్‌లో కూర్చున్నాం. అప్పుడు మా దగ్గరున్నది పన్నెండు రూపాయలే. అవి చూసి నేను మురిసిపోవడమే కాదు... ఒరేయ్‌ ఈ చిల్లరతో ఇప్పుడూ, రేపు ఉదయం కూడా గడిపేయొచ్చు. డబ్బులు అయిపోయాక ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నా. ‘అవునా... ఆ డబ్బులు ఇవ్వు’ అని నా చేతిలో చిల్లర లాగేసుకుని చకచకా రోడ్డు దాటి వెళ్లి మరీ ఓ కోక్‌ టిన్ను తెచ్చాడు త్రివిక్రమ్‌. సగం తను ఖాళీ చేసి మిగతా సగం నాకు ఇచ్చాడు. కడుపు కాలుతుంటే కోపంగానే కోక్‌ తాగా. ఆ తరవాత ‘డబ్బులు అయిపోయాయి. ఆకలి తీరలేదు. ఈ కసిలోనే సంపాదించడం గురించి ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి. ఇక మొదలెట్టు’ అన్నాడు. నాకూ నిజమే కదా అనిపించింది. నేను సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా ఆలోచించా... తను శాశ్వత పరిష్కారం ఎలా దొరుకుతుందో చెప్పాడు. ఇప్పటికీ నేను అలాంటి విషయాల్లో త్రివిక్రమ్‌నే స్ఫూర్తిగా తీసుకుని ఆలోచిస్తా. అలాంటి ఫ్రెండ్‌ దొరకడం నా అదృష్టం.
- సునీల్‌

* సుక్కూ భాయ్‌ నా ధైర్యం!


‘నా ఆత్మకు ప్రతిరూపం అంటూ ఉంటే అది దేవీలానే ఉంటుంది’ అని దర్శకుడు సుకుమార్‌ ఎప్పుడూ అంటుంటాడు. నాదీ అదే ఫీలింగ్‌. నాన్న చనిపోయినప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి పనిచేస్తున్నా. అప్పటికి పాటల రికార్డింగ్‌ పూర్తి కాలేదు. ఆ సమయంలో సుక్కూ భాయ్‌ ఇచ్చిన ధైర్యంతో నాన్న పోయిన మూడో రోజు నుంచే రికార్డింగ్‌ మొదలుపెట్టా. అలానే నాన్న ఆలోచనలు రాకుండా ఏవో కబుర్లు చెబుతుండేవాడు. నాకెప్పుడూ ఏదో ఒక బహుమతి ఇవ్వాలనుకునేవాడు. డబ్బు దండగ అని నేనే వద్దనేవాడిని. కానీ ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో రిలీజ్‌ వేదికపైన ఆ సినిమా పాటలన్నీ మా నాన్నకి అంకితమిచ్చి నేను జీవితాంతం మర్చిపోలేని బహుమతినిచ్చాడు. ఇదనే కాదు తనకి ఆరోగ్యంపైన శ్రద్ధ ఎక్కువ. పొట్ట పెరగనివ్వద్దు అని పోరు పెడుతుంటాడు. తనకు భయపడి నేను పొట్ట పెరగనివ్వను. తనగురించి ఒక్క మాటలో చెప్పాలంటే సుక్కూ భాయ్‌ ఈజ్‌ మై ట్రూ ఫ్రెండ్‌ ఫర్‌ ఎవర్‌ అండ్‌ ఎవర్‌.
- దేవిశ్రీప్రసాద్‌

* మన చేతుల్లోనే ఉంది


అమ్మానాన్నల్ని మనం ఎంచుకోలేం. కానీ స్నేహితుల్ని మాత్రం ఎంచుకోగలం. మన వ్యక్తిత్వానికీ, అభిరుచికీ, ఆలోచనలకూ దగ్గరగా ఉండేవాళ్లని మనం స్నేహితులుగా మార్చుకోగలం. నటి వాణీకపూర్‌ నాకు అలాంటి స్నేహితురాలే. పదహారేళ్ల స్నేహం మాది. ఇన్నేళ్లలో మా మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదు. ‘ఈ విషయంలో గొడవ జరగొచ్చేమో’ అని నేను భయపడిన ప్రతీ విషయాన్నీ చాలా తేలిగ్గా తీసుకునేది. తను ముక్కుసూటి మనిషి. నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. వాణి వ్యక్తిత్వం నాకు బాగా నచ్చుతుంది. మా మధ్య సినిమాల గురించి తప్ప మిగతా అన్ని విషయాలూ చర్చకు వస్తుంటాయి. నేను అడిగితే తప్ప.. సలహాలు ఇవ్వదు. ‘ఇది నీ జీవితం. నీ కెరీర్‌. నీకు ఎలా నచ్చితే అలా మలచుకో’ అని చెబుతుంటుంది. అలానే నా చిన్నప్పటి స్నేహితులు కొంతమంది ఇప్పటికీ టచ్‌లో ఉన్నారు. స్నేహితుల దినోత్సవం అంటూ మేమెప్పుడూ ప్రత్యేకంగా జరుపుకోలేదు. మేం ఎప్పుడు కలుసుకుంటే అప్పుడే ఫ్రెండ్‌షిప్‌ డే.
- రాశీఖన్నా

* వాడే నా బెస్టీ!

నాకు చాలామంది స్నేహితులున్నారు. వాళ్లలో ధీరజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నేను ఉప్పల్‌లోని ఓ కాలేజీలో ఇంటర్‌లో చేరా. మొదటివారంలోనే ఫ్రెండ్‌ అయ్యాడు ధీరజ్‌. అప్పట్లో నాకు బస్సులు ఎక్కడం అస్సలు ఇష్టముండేదికాదు. కాలేజీ బస్సు లేనప్పుడు ఆర్టీసీ బస్‌లోనే ఇంటికెళ్లాలి. ధీరజ్‌ ఇల్లు కాలేజీకి దగ్గరే. మాది జూబ్లీహిల్స్‌. కాలేజీ బస్సు రానప్పుడు నేను చిరాకు పడుతుంటే ‘నేనున్నా పదా...’ అంటూ ధీరజ్‌ నాతోపాటు ఆర్టీసీ బస్‌లో తోడుగా వచ్చి ఇంటి దగ్గర దిగబెట్టి మళ్లీ వాడు ఆ ట్రాఫిక్‌ దాటుకుని బస్‌లోనే వెళ్లేవాడు. అలానే నేను చదువుని అంతగా పట్టించుకునేవాణ్ని కాదు. ధీరజ్‌ బాగా చదువుతాడు. పరీక్ష రేపు ఉంది అంటే ఈరోజు రాత్రి ధీరజ్‌కి ఫోన్‌ చేసి సిలబస్‌ అడిగేవాణ్ని. పాపం వాడు రాత్రంతా మేల్కొని చదివి నిద్రపోకుండానే తెల్లవారుజామున మా ఇంటికొచ్చేవాడు. పక్కనే కూర్చుని అన్నీ ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తూ చదివించి... వాడిలా నన్ను పరీక్షకు సిద్ధం చేసేవాడు. నేను పరీక్ష బాగా రాశానంటే వాడు సంబరపడిపోయేవాడు. నేను కాలేజీ రోజుల్లో పరీక్షల్లో గట్టెక్కానంటే ధీరజ్‌ వల్లే. నా సంతోషం, విజయంలోనే తన ఆనందం అనుకునే ధీరజ్‌ ఈజ్‌ ఆల్వేస్‌ మై బెస్టీ.

- విజయ్‌ దేవరకొండ

* వాడొక్కడే మిగిలాడు

విజయాలు ఉన్నప్పుడు, మనకంతా మంచే జరుగుతున్నప్పుడు మన చుట్టూ చాలామందే ఉంటారు. ఓటముల్లో కూడా వెన్నంటి ఉండి ధైర్యం చెప్పేవాడే నిజమైన స్నేహితుడు. నాకు అలాంటి మిత్రుడు నవీన్‌. ఈమధ్య నాకన్నీ వరుస పరాజయాలే. చాలా ఒత్తిడికి లోనయ్యా. నావాళ్లూ, నా స్నేహితులూ అనుకున్న చాలామంది దూరమయ్యారు. నవీన్‌ మాత్రం అప్పుడు నా పక్కనే ఉన్నాడు. ఒత్తిడి తగ్గించుకునే మెడిసిన్‌ అయ్యాడు. నా చిన్నతనంలో చెన్నైలో పెద్ద మావయ్య ఇంట్లో ఉండేవాణ్ని. అక్కడే నాకు నవీన్‌ పరిచయం. ఇద్దరం కలిసి క్రికెట్‌ ఆడుకునేవాళ్లం. చాలా సరదాగా ఉండేవాళ్లం. తనూ సినీ రంగంలోకి వచ్చాడు. కొన్నాళ్లు ఎడిటర్‌గా పనిచేసి ఇప్పుడు హీరో కూడా అయ్యాడు. మా ఇంట్లో వాళ్లు కూడా నవీన్‌ని కుటుంబసభ్యుడిలానే చూస్తారు. అందరితో అంత ప్రేమగా ఉంటాడు.


- సాయిధరమ్‌తేజ్

(మహమ్మద్‌ అన్వర్‌)


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.