బాలీవుడ్‌ కళ్లన్నీ టాలీవుడ్‌ వైపే
గల్లీ క్రికెట్‌ ఆడేవాళ్లకు దిల్లీ తీసుకెళ్లి ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఆడే అవకాశం ఇస్తే... అది ప్రమోషన్‌ కొట్టినట్టే! షార్ట్‌ ఫిల్మ్‌ నుంచి సినిమాల్లో అవకాశం కొట్టేస్తే... ఎదిగినట్టే. తెలుగు సినిమా నుంచి బాలీవుడ్‌కి పిలుపు వస్తే...? అదీ.. అసలైన ఎదుగుదల అంటే. బాలీవుడ్‌లో సినిమా చేయడమే అంతిమ లక్ష్యం అని కాదు. హిందీ జనాలు తెలుగు చిత్రసీమపై కన్నేసి, ఇక్కడి ప్రతిభను సైతం గుర్తించారంటే.. ఆ లెక్కేవేరు. తెలుగువాళ్లు బాలీవుడ్‌ వీధుల్లో వీరవిహారం చేసే అవకాశం రావడం నిజంగా గర్వపడే విషయం. ఇది వరకు తెలుగులో ప్రతిభ చూపించిన కథా నాయికలకు బాలీవుడ్‌లో ఛాన్సులు దక్కేవి. వాళ్లకు మినహా మిగిలిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు వాళ్ల కళ్లకు పెద్దగా కనిపించేవారు కాదు. ఇప్పుడు అలా కాదు.. టాలీవుడ్‌లో మెరుస్తున్న వాళ్లని ఎలా పట్టేద్దామా అంటూ బాలీవుడ్‌ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఆ ప్రయత్నంలో కొంతమంది తెలుగు దర్శకులకూ అటు నుంచి పిలుపులు అందుతున్నాయి. వాళ్లు సినిమాలు చేశారా, చేయట్లేదా? అనేది తరువాతి సంగతి. బాలీవుడ్‌లోనూ సినిమాలు తీసి, మెప్పించగల సత్తా మన దర్శకులకు ఉందన్న విషయాన్ని గ్రహించగలగడం ఆహ్వానించదగిన పరిణామమే.‘బాహుబలి’ చూసి బాలీవుడ్‌ సైతం ముక్కున వేలేసుకుంది. టాలీవుడ్‌ సత్తాని ప్రపంచ సినిమాకి చాటి చెప్పిన చిత్రమది. హిందీనాట కూడా రికార్డులు సృష్టించింది. అక్కడ ఖాన్‌ త్రయం సాధించిన వసూళ్లను దాటి నివ్వెరపోయేలా చేసింది. దాంతో ఎస్‌.ఎస్‌.రాజమౌళి నామ జపం ఎక్కువైంది. నిజానికి ‘మగధీర’తోనే రాజమౌళికి అక్కడి నుంచి ఆఫర్లు రావడం మొదలైంది. ‘ఈగ’తో ఇంకా ఎక్కువైంది. ‘బాహుబలి’తో అయితే ఇక చెప్పనవసరం లేకుండాపోయింది. ఆమీర్‌ఖాన్‌తో రాజమౌళి సినిమా చేస్తారని అప్పట్లో చెప్పుకున్నారు. ఆమీర్‌ హైదరాబాద్‌ ఎప్పుడొచ్చినా రాజమౌళి ప్రస్తావన తీసుకురాకుండా ఉండరు. ‘ఆయనతో తప్పకుండా ఓ సినిమా చేస్తా’ అని మీడియా ముఖంగా చాలాసార్లు చెప్పారు ఆమీర్‌. అయితే రాజమౌళి దృష్టి అటువైపు లేదు. ‘ముందు తెలుగులో చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయ’న్నది ఆయన మాట.


క్రిష్‌ బాలీవుడ్‌లో నిరూపించుకున్న దర్శకుడే. ‘ఠాగూర్‌’ని అక్కడ ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. దర్శకుడిగా క్రిష్‌ ప్రతిభను బాలీవుడ్‌లో చాటి చెప్పిన చిత్రమది. కంగనా రనౌత్‌తో ‘మణికర్ణిక’ చేసే అవకాశం వచ్చిందంటే దానికి కారణం ‘గబ్బర్‌’ అనే చెప్పాలి. ఆ చిత్రం సెట్స్‌పై ఉండగానే క్రిష్‌కి మరిన్ని అవకాశాలు వచ్చాయి. నిజానికి ‘మణికర్ణిక’ పూర్తయిన వెంటనే ఆయన మరో సినిమా చేయాల్సివుంది. కానీ దాన్ని పక్కన పెట్టి ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ బాధ్యత తీసుకున్నారు. ‘ఎన్టీఆర్‌’ పూర్తయిన వెంటనే మళ్లీ క్రిష్‌ ఓ హిందీ చిత్రం చేస్తారని తెలుస్తోంది. శేఖర్‌ కమ్ములకూ హిందీ నుంచి అవకాశాలు వచ్చాయి. ‘హ్యాపీడేస్‌’ని అక్కడ రీమేక్‌ చేయమన్నారు. సల్మాన్‌ ఖాన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి.

అందుకు సంబంధించి నటీనటుల ఎంపిక కూడా మొదలైంది. ఎందుకో శేఖర్‌కమ్ముల ఆ తరవాత ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు.‘రంగస్థలం’ చూశాక... సుకుమార్‌కీ అలాంటి ఆఫర్లే అందుతున్నాయి. త్వరలో ఆయన ఓ హిందీ సినిమా చేయనున్నారని, అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వినిపిస్తోంది. ‘రంగస్థలం’ తరవాత మహేష్‌బాబుతో ఓ సినిమా చేయాల్సింది. బాలీవుడ్‌ ఆఫర్‌ కోసమే.. మహేష్‌ చిత్రాన్ని వాయిదా వేశారని సమాచారం. ‘అర్జున్‌ రెడ్డి’తో తొలి అడుగులోనే సంచలనాలు సృష్టించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ. దాన్నో సాహసోపేతమైన చిత్రంగా అభివర్ణించారు తెలుగు సినీ విమర్శకులు. ‘కల్ట్‌ క్లాసిక్‌’ అంటూ కితాబులు ఇచ్చారు. దాంతో సహజంగానే.. అగ్ర కథానాయకుల దృష్టి సందీప్‌పై పడింది. ఇదే చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు సందీప్‌. తెలుగులోనే ఈ కథని ఇంత బోల్డ్‌గా తీశారంటే, బాలీవుడ్‌లో ఎలా తీస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి తగ్గట్టుగానే కథలో మార్పులు చేర్పులూ చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లోనూ అర్జున్‌ రెడ్డి ప్రభావం చూపిస్తే.. సందీప్‌కి అక్కడి నుంచి మరిన్ని ఛాన్సులు రావడం ఖాయం.హిందీ చిత్రసీమలో టాలీవుడ్‌ దర్శకులు కాలు మోపడం కొత్తేం కాదు. మన దర్శక దిగ్గజాలంతా అక్కడ సినిమాలు చేసినవాళ్లే. అయితే ఎక్కువ శాతం తెలుగులో విజయవంతమైన చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయడంతో సరిపెట్టారు. ఇప్పటి దర్శకుల ఆలోచనా ధోరణి వేరు. రీమేక్‌ కంటే, మరో కొత్త కథ చెప్పడానికే ఉత్సాహం చూపిస్తున్నారు. ఓ విధంగా అదే మంచిది కూడా. తీసేసిన కథని మళ్లీ తీయడంలో కిక్కేముంటుంది? కొత్త కథలు పట్టుకున్నప్పుడే అసలైన ప్రతిభ బయటకు వచ్చేది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.