హీరోనే విలనౌతున్నాడు!!
వెండితెరపై కథానాయకుడు గొప్పా? ప్రతినాయకుడు గొప్పా? ఈ ప్రశ్నలకు హాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి భిన్నమైన సమాధానాలు వినిపించ వచ్చేమో కానీ, భారతీయ సినీప్రియులంతా ముక్త కంఠంతో చెప్పే మాటొక్కటే.. ‘మాకు కథానాయకుడే గొప్ప’ అని. అందుకే భారతీయ చిత్రసీమలో హీరోలకు ఉన్నంతటి అభిమాన గణం, ఆదరణ మిగతా నటీనటులకు ఉండదు. కథానాయకులు కూడా అభిమానుల్లో తమకున్న ఇమేజ్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే తమ తమ పాత్రలను ఎంపిక చేసుకుంటుంటారు. అంతేకాదు ఒకసారి కథానాయకుడిగా స్థిరపడ్డాక ప్రతినాయక పాత్రలొచ్చినా అస్సలు అంగీకరించేవారు కాదు. ఒకవేళ అంతగా చేయాల్సి వస్తే.. హీరోగా తమ మార్కెట్‌ పూర్తిగా పడిపోయిందనుకున్న సందర్భంలోనే విలన్‌ పాత్రల వైపు మొగ్గు చూపేవారు. ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్‌వాంటెడ్‌ ప్రతినాయకుడిగా బిజీగా ఉన్న జగపతిబాబు, ఉపేంద్ర, అరవింద స్వామి తదితరులంతా ఈ కోవకు చెందిన వారే. అయితే గత కొన్నాళ్లుగా సినీప్రియుల అభిరుచితో పాటు కథానాయకులు కథల ఎంపికలోనూ వైవిధ్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కథ కథనాలు బాగుండాలే కానీ, ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో సైతం తమ అభిమాన హీరో చూసుకునేందుకు అటు ప్రేక్షకులు, చేసేందుకు ఇటు హీరోలు వెనకాడటం లేదు. అందుకే ప్రస్తుతం చిత్రసీమలో కథానాయకులే.. ప్రతినాయకులుగా కొత్త అవతారాలెత్తుతున్నారు.


కథానాయకుడు ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించడమన్న సాహసం ఈరోజుల్లోనే కాదు.. పాతతరంలోనూ జరిగింది. హీరోగా ఎన్టీఆర్‌ భీభత్సమైన స్టార్‌డంలో ఉన్న రోజుల్లోనే రావణ బ్రహ్మ, దుర్యోధనుడు వంటి భీకరమైన ప్రతినాయక పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు. ఆయా పాత్రలపై ప్రేక్షకుల్లో కొత్త అభిప్రాయాల్ని ఏర్పరిచారు. కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి వంటి వారు సైతం అవకాశాలొచ్చినప్పుడల్లా ఇలాంటి పాత్రలు ధరించి మెప్పించారు. ఇక నేటి తరం కథానాయకుల విషయానికొస్తే.. నాని, ఎన్టీఆర్, మహేష్‌బాబు, రానా, ఆది పినిశెట్టి వంటి వారు ఈ తరహా పాత్రలను పోషించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచిపెట్టారు. మహేష్‌బాబు చేసిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్‌’ చిత్రాల్లో ఆయన పాత్ర చాలా వరకు ప్రతినాయక ఛాయలున్న కోణంలోనే సాగుతుంది. ఇక ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ కోసం, నాని ‘జెంటిల్‌మెన్‌’ కోసం ప్రతినాయకులుగా మారి ప్రేక్షకులకు వినోదాల విందు పంచారు. ఆది ‘సరైనోడు’ చిత్రంలో స్టైలిష్‌ విలన్‌గా కనిపించి అలరించాడు. ఇక ప్రతినాయకుడన్న పదానికి నేటితరంలో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చిపెట్టింది మాత్రం రానానే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌లో భళ్లాల దేవుడిగా ఆయన పండించిన విలనిజానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే ప్రస్తుతం తెలుగులో మరికొంత మంది యువ హీరోలు ప్రతినాయకులుగా మారి తమ ముచ్చటను తీర్చుకునేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు.

* నాని..
ఇప్పటికే ‘జెంటిల్‌మెన్‌’ చిత్రంతో ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషించి సత్తా చాటిన నేచురల్‌స్టార్‌.. ఇప్పుడు మరోసారి అదే దర్శకుడి సినిమా కోసం విలన్‌గా మారేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఆ చిత్రమే ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న ‘వి’. ఈ చిత్రంలో సుధీర్‌బాబు, నాని ఇద్దరూ ప్రధాన పాత్రధారులే అయినప్పటికీ సుధీర్‌ పోలీస్‌ అధికారికగా, నేచురల్‌ హీరో విలన్‌గా కనిపిస్తారట. అలాగని నాని ఏమీ కరుడుగట్టిన భయంకరమైన రౌడీలా ఏం కనిపించడు లేండి. ‘దాన వీర శూర కర్ణ’లోని కర్ణుడి తరహా విలన్‌ అట. అంటే.. తాను వ్యక్తిగతంగా ప్రతినాయకుడు కానప్పటికీ, ఓ మంచి పని కోసం చెడు మార్గంలో నడిచే విలన్‌గా దర్శనమిస్తాడట. సినిమాలో ఈ పాత్ర నిడివి కొద్దిసేపే అయినప్పటికీ ‘వి’కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. ఈ పాత్రకున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొనే సినిమాకు ‘వి’ అనే టైటిల్‌ను ఎంపిక చేసుకున్నారట ఇంద్రగంటి.


* మురిపించే ‘మెగా’ విలన్‌..
చిరంజీవి కుటుంబం పేరు చెప్పగానే దాదాపు అరడజనుకు పైగా కథానాయకుల ముఖాలే అందరికీ గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు వీరిలో నుంచే ఓ ప్రతినాయకుడు పుట్టుకొస్తున్నాడు. అతనే యువ హీరో వరుణ్‌ తేజ్‌. తన తాజా చిత్రం ‘వాల్మీకి’ కోసం ఈ సాహసానికి సిద్ధపడ్డాడు వరుణ్‌. తమిళ హిట్‌ మూవీ ‘జిగడ్తాండ’కు తెలుగు రీమేక్‌గా దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర మాతృక వెర్షన్‌లో విలన్‌గా చేసిన బాబీ సింహా పాత్రనే ఇప్పుడు తెలుగులో వరుణ్‌ చేయబోతున్నారు. దీని కోసమే తన గెటప్‌ను కూడా పూర్తి రఫ్‌లుక్‌లోకి మార్చేసుకున్నారు వరుణ్‌. ఇక ఈయన ప్రతినాయకుడిగా కనిపించబోయే ఈ చిత్రంలో కథానాయకుడిగా అధర్వ నటిస్తున్నారు.


* ఇటు కార్తికేయ.. అటు బెల్లంకొండ...
ఇక కుర్ర హీరోల్లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలతో అదరగొట్టేందుకు ముస్తాబవుతున్నారు కార్తికేయ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే కథానాయకుడిగా మెప్పించిన కార్తికేయ.. ప్రస్తుతం నాని కథానాయకుడిగా నటిస్తోన్న ‘గ్యాంగ్‌లీడర్‌’లో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక బెల్లంకొండ విషయానికొస్తే.. ఆయన తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలోనే సందడి చేయబోతున్నారు. 1980 - 90 దశకాల్లో రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితాధారంగా దర్శకుడు వంశీకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడిందోలోని గజదొంగ పాత్రనే బెల్లంకొండ పోషిస్తున్నది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.